Sports: 11 వేల మందికి.. ఒక్కరూ లేరు!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:28 AM
Physical Education Teachers కళాశాల స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం కరువవుతోంది. ప్రధానంగా వ్యాయామ ఉపాధ్యాయుల కొరతే దీనికి కారణమని తెలుస్తోంది. మైదానాలు కూడా లేకపోవడం మరో కారణం.

జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కానరాని క్రీడలు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కళాశాల స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం కరువవుతోంది. ప్రధానంగా వ్యాయామ ఉపాధ్యాయుల కొరతే దీనికి కారణమని తెలుస్తోంది. మైదానాలు కూడా లేకపోవడం మరో కారణం. గతంలో చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఏటా అంతర్ జూనియర్, అంతర్ డిగ్రీ కళాశాల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో క్రీడారులు బయట అసోసియేషన్ల తరపున ఆడాల్సిన దౌర్భగ్య దుస్థితి నెలకొంది.
జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం 5,980 మంది, ద్వితీయ సంవత్సరం 5,066 మంది విద్యార్థులు ఉన్నారు. సరాసరి 11 వేలమందికిపైగా విద్యార్థులు ఉండగా.. వీరికి క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు కనీసస్థాయిలో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు కూడా లేకపోవడం దారుణం. అప్పట్లో జూనియర్ కాలేజీ అంటే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు కొనసాగేవి. ఏటా క్రీడాపోటీలు నిర్వహించేవారు. అప్పట్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు పదవీవిరమణ తర్వాత కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదు. సబ్జెక్టు బోధకుల మాదిరి కాంట్రాక్టు ప్రతిపాదికన కూడా నియమించలేదు. దీంతో కాలేజీల్లో క్రీడా శిక్షణ కనుమరుగైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో సైతం క్రీడలకు స్థానం లేకుండా పోయింది.
మైదానాల కొరత..
జిల్లాలో చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మైదానాలు లేవు. 38 కాలేజీలకుగాను 16 కాలేజీల్లో అసలు మైదానాలే లేనట్టు తెలుస్తోంది. ఉన్న మైదానాలు సైతం సరైన నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల గత వైసీపీ సర్కారు ‘నాడు-నేడు’ పనుల పేరిట అస్తవ్యస్తంగా మార్చేసింది. భవన నిర్మాణ సామగ్రితో పాటు తొలగించిన భవనాలకు సంబంధి వేస్ట్ మెటీరియల్‌ను పడేసింది. దీంతో ఆటలు ఆడుకునేందుకు వీలులేకుండా పోయింది. గత ఐదేళ్ల పాటు ప్రభుత్వ కాలేజీల స్థాయిలో క్రీడా పోటీలు కూడా నిర్వహించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా కళాశాలల స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మైదానాలు బాగుచేయాలని, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి శివ్వాల తవిటినాయుడు వద్ద ప్రస్తావించగా.. జిల్లాలోని 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని తెలిపారు.