గుట్టల్లో ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:16 AM
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. తాగునీరు, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు ఉన్న చోట్ల కట్టుకోవాలని భావిస్తుంటారు. గత వైసీపీ సర్కారు మాత్రం కొండలు, గుట్టలు ఉన్న చోట పేదలకు ఇళ్ల పట్టాలు అందించింది. తమ వాళ్లకు మాత్రం మంచి స్థలాలను కేటాయించింది.

- నివాసయోగ్యం కానిచోట పేదలకు కేటాయింపు
- వైసీపీ మద్దతుదారులకు మాత్రం మంచి స్థలాలు అందజేత
- జగన్ సర్కారు నిర్వాకం
- పట్టాల పంపిణీలో అక్రమాలు
- విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశం
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. తాగునీరు, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు ఉన్న చోట్ల కట్టుకోవాలని భావిస్తుంటారు. గత వైసీపీ సర్కారు మాత్రం కొండలు, గుట్టలు ఉన్న చోట పేదలకు ఇళ్ల పట్టాలు అందించింది. తమ వాళ్లకు మాత్రం మంచి స్థలాలను కేటాయించింది. దీనివల్ల పేదలు గృహ యోగానికి నోచుకోలేకపోయారు. ఇచ్చిన స్థలాలు కూడా సెంటు, సెంటున్నరే కావడం.. అక్కడ తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకపోవడం కారణంగా చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. పట్టాల పంపిణీలో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ మద్దతుదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్నిచోట్ల ముందుగానే వైసీపీ బడానాయకులు తక్కువ ధరకు స్థలాలను కొనుగోలు చేసి వాటినే పేదల పట్టాల కోసం ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించారు. ఈ అక్రమాలపై కూటమి సర్కారు విచారణ చేపడుతుంది.
శ్రీకాకుళం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 74,892 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. ఇందులో కేవలం 38,522 మంది మాత్రమే ఇళ్లను నిర్మించుకున్నారు. వీరిలో సొంత స్థలాల్లోనే గృహాలు కట్టుకున్న వారు అధికంగా ఉన్నారు. 15వేల గృహాలకు సంబంధించి పునాదుల కోసం గోతులు తవ్వి వదలిలేశారు. 5,638 ఇళ్లకు సంబంధించి పనులే ప్రారంభం కాలేదు. జగన్ సర్కారు అందించిన స్థలాలు అనుకూలంగా లేకపోవడంతో చాలామంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టలేదు. ఇళ్ల స్థలాలు తీసుకోకుంటే ఇతర పథకాలు వర్తిస్తాయా లేదో అని అప్పట్లో లబ్ధిదారులు గందరగోళానికి గురయ్యారు. అలాగే వైసీపీ నాయకులు ఇంటింటికీ వచ్చి తమ ప్రభుత్వ పథకాలు గురించి ప్రచారం చేయడం, వలంటీర్లు కూడా మాటిమాటికి సర్వేచేసి వివరాలు తీసుకోవడంతో అధికమంది అయిష్టంగానే ఇంటి పట్టాలను పొందారు.
వైసీపీ నేతల అనుచరులకే ప్రాధాన్యం..
జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలోని పేదలకు సంబంధించి ఎచ్చెర్ల మండలం పొన్నాడ, కొంగరాం గ్రామాల వద్ద.. అలాగే, శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస, రాగోలు వద్ద స్థలాలు కేటాయించారు. అయితే, స్థలాల కేటాయింపులో పలు అక్రమాలు జరిగాయి. వైసీపీ నాయకులకు, వారి అనుచరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మంచి స్థలాలను ఎంపిక చేసి వారి పట్టా నెంబర్లు, ప్లాట్ల నెంబర్లు ముందు వరుసలో ఉండేలా ప్రణాళికతో వ్యవహరించారు. సాధారణ లబ్ధిదారులకు మాత్రం చెరువు గట్టుకు ఆనుకుని, పెద్దపెద్ద గుట్టల వద్దనూ, కొండ ప్రాంతాలనూ ఆనుకుని స్థలాలను కేటాయించారు. పొన్నాడ వద్ద ఉన్న ప్లాట్ల నెంబర్ల క్రమ సంఖ్యకు, క్షేత్రస్థాయిలో కేటాయించిన ప్లాట్ల సంఖ్యకు మధ్య తేడా లు ఉన్నాయి. అలాగే పాత్రునివలస-1 వద్ద కేటాయించిన స్థలాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇదిలాఉండగా, పేదలకు స్థలాలు ఎక్కడ కేటాయిస్తారో వైసీపీ పార్టీ నాయకులకు ముందుగానే తెలియడంతో భూసేకరణలో పెద్ద తతాంగం నడిపారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో ముందుగానే తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేశారు. ఆ భూముల్లోనే పేదలకు పట్టాలు ఇచ్చేందుకు గాను వాటిని ఎక్కువ ధరకు అప్పటి ప్రభుత్వానికి విక్రయించారు. ఈ విషయం పైకి తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. బడానాయకులు సైతం ఇందులో ఉండటంతో ఆ ప్రక్రియ సజావుగా సాగిపోయింది.
విచారణకు ఆదేశం..
వైసీపీ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సెంటు, గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సెంటున్నర స్థలాన్ని మాత్రమే కేటాయించారు. పైగా ఈ స్థలం ఏకంగా రూ. 6లక్షల పైబడి విలువ చేస్తుందని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పారు. కానీ, వాస్తవంగా సెంటు, సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణం కష్టంగా ఉండేది. తమకు నచ్చినట్లు పేదలు ఇళ్లు కట్టుకోలేకపోయే వారు. హాలు, వంట గది, బాత్‌రూం అన్ని అందులోనే నిర్మించడంతో ఇరుకుగా ఉండేవి. కుటుంబంతో అందులో జీవించడం కష్టంగా మారేది. ఇంటికి ఎవరైనా బంధువులు గానీ వస్తే వారు కూర్చోవడానికి కూడా జాగా ఉండేది కాదు. దీంతో చాలామంది లబ్ధిదారులు సెంటు స్థలంలో ఇళ్ల నిర్మించేందుకు ముందుకు రాలేదు. వారికి ఇచ్చిన స్థలాలను ఖాళీగా విడిచిపెట్టేశారు. ఫలితంగా పేదల సొంతింటి కల నెరవేరలేదు. అయితే, కూటమి ప్రభు త్వం వచ్చాకా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని ప్రకటించింది. అలాగే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాల పేరుతో జరిగిన అక్రమాలు, కేటాయించిన నిధులు, లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి సుముఖత చూపించకపోవడం, పట్టాలు అందుకున్నవారిలో అనర్హులు ఉన్నారా? వంటి అంశాలపై విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు కలెక్టర్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. దీంతో మండలాల వారీగా తహసీల్దార్ల ఆధ్వర్యంలో బృందాలుగా ఇళ్ల పట్టాలపై విచారణ జరగనుంది. దీనివల్ల వైసీపీ నాయకుల అక్రమాలు బయటపడే అవకాశముంది. లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన స్థలాలను రద్దుచేసి మంచి స్థలాలు ఇచ్చేందుకు వీలుంటుంది.