Share News

Bear: ‘ఎలుగు’ సంచారంతో హడల్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 11:43 PM

Bear tension ఉద్దానం ప్రాంతవాసులను ఎలుగుబంట్ల బెడద వెంటాడుతోంది. ప్రస్తుతం జీడిపంట సీజన్‌ కావడంతో ఎలుగుల సంచారం పెరిగింది. వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి పరిసర గ్రామాల తోటలలో మంగళవారం ఎలుగుబంటి సంచారంతో ప్రజలు హడలిపోయారు. రెండు రోజులుగా ఎలుగు బంటి తోటల్లో తిరుగుతుండడంతో ప్రజలు తోటలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

Bear: ‘ఎలుగు’ సంచారంతో హడల్‌
వజ్రపుకొత్తూరు తోటలలో సంచరిస్తున్న ఎలుగుబంటి

  • తరచూ దాడి ఘటనలు

  • భయాందోళనలో ఉద్దానం వాసులు

  • వాహనానికి అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి దివ్యాంగుడి మృతి

  • వజ్రపుకొత్తూరు/ హరిపురం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతవాసులను ఎలుగుబంట్ల బెడద వెంటాడుతోంది. ప్రస్తుతం జీడిపంట సీజన్‌ కావడంతో ఎలుగుల సంచారం పెరిగింది. వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి పరిసర గ్రామాల తోటలలో మంగళవారం ఎలుగుబంటి సంచారంతో ప్రజలు హడలిపోయారు. రెండు రోజులుగా ఎలుగు బంటి తోటల్లో తిరుగుతుండడంతో ప్రజలు తోటలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇదే ప్రాంతంలో గత ఏడాది ఎలుగుబంటి దాడితో ఐదుగురు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఎలుగుబంటి సంచారం అంటేనే ఈ ప్రాంతవాసులు హడలిపోతున్నారు. తాజాగా మందస మండలం ముకుందపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందసకు చెందిన దివ్యాంగుడు తామాడ జయరాం(40) మృతిచెందగా.. అతని భార్య కున్నికు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు వారి త్రి చక్రవాహనంపై సోంపేట నుంచి మందస వస్తుండగా.. ముకుందపురం వద్ద ఎలుగుబంటి అడ్డుగా వచ్చింది. దీన్ని తప్పించబోయిన జయరాం దివ్యాంగుడు కావటంతో వాహనాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోయాడు. దీంతో వాహనం రోడ్డుపైనే బోల్తాపడింది. జయరాం తలకు బలమైన గాయమవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్యకు కాళ్లు, ముఖంపై గాయాలయ్యాయి. జయరాం కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పదేళ్ల కిందట త్రిచక్ర వాహనాన్ని అందించటంతో పరిసర గ్రామాలకు కూడా పనికి వెళ్లేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇలా ప్రమాదాలతోపాటు తరచూ ఎలుగుబంట్లు దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఈ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. జీడిపంట సీజన్‌ కావడంతో తోటల్లో పనులుంటాయని, అయితే ఆ సమయంలో ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో ఆందోళన కలిగిస్తోందని కిడిసింగి సర్పంచ్‌ నర్తు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అటవీ శాఖధికారులు స్పందించి ఎలుగుబంటి సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.

Updated Date - Feb 18 , 2025 | 11:43 PM