Share News

Suspension: టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Feb 27 , 2025 | 11:45 PM

Sub-Registrar Corruption టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ ఎం.ఉమామహేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ గురువారం విజయనగరం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎ.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతోంది.

Suspension: టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌
టెక్కలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం... ఇన్‌సెట్‌లో సబ్‌రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు

- అడ్డగోలు రిజిస్ర్టేషన్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

- గతంలో పలాసలోనూ వేటు

టెక్కలి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ ఎం.ఉమామహేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ గురువారం విజయనగరం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎ.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై గత నెల 29న ‘టెక్కలిలోనే ఎక్కువగా ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లు’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. సబ్‌రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లతోపాటు ఇళ్ల కాలనీల పొజిషన్‌ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టెక్కలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీ సక్రమంగా వినియోగించకుండా తప్పిదాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సక్రమంగా లేని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని విశాఖకు చెందిన నల్లకోర్ల సరోజాదేవి ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి.. అడ్డగోలు రిజిస్ర్టేషన్లు వాస్తవమేనని నిర్ధారించారు. సబ్‌రిజిస్ర్టార్‌ ఉమామహేశ్వరరావును సస్పెండ్‌ చేశారు. కాగా.. ఉమామహేశ్వరరావు గతంలో పలాస సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సమయంలోనూ సస్పెండ్‌కు గురికావడం గమనార్హం. తాజాగా రెండోసారి కూడా సస్పెండ్‌ చేయడంతో.. ఉమామహేశ్వరరావు అవినీతికి అధికారులు చెక్‌ పెట్టినట్లయింది.

Updated Date - Feb 27 , 2025 | 11:45 PM