Share News

'Tandel' ‘తండేల్‌’ ఒక్కడే కాదు.. ముగ్గురు

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:07 AM

తండేల్‌ చిత్రంలో చూపించినట్టు రియల్‌ తండేల్‌ రామారావు ఒక్కడే కాదని, పాకి స్థాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేల్‌లు ఉన్నారని బాధిత మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

'Tandel'  ‘తండేల్‌’ ఒక్కడే కాదు.. ముగ్గురు
మాట్లాడుతున్న పలువురు మత్స్యకారులు

  • మిగిలిన 21 మత్స్యకార కుటుంబాలకు అన్యాయం జరిగింది

  • పలువురు ‘పాకిస్థాన్‌ బాధితుల’ ఆవేదన

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తండేల్‌ చిత్రంలో చూపించినట్టు రియల్‌ తండేల్‌ రామారావు ఒక్కడే కాదని, పాకి స్థాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేల్‌లు ఉన్నారని బాధిత మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఎన్జీవో హోమ్‌లో గతంలో పాకిస్తాన్‌ నావిదళాలకు చిక్కిన మత్స్యకార కుటుంబ సభ్యులు శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పాకిస్థాన్‌ నావీదళాలకు చిక్కిన 22 మంది మత్స్యకా రుల యథార్ధ గాధ ఆధారంగా తండేల్‌ చిత్రం చిత్రీకరించారని, అయితే కేవలం గనగళ్ల రామారావు, అతడి భార్య నూకమ్మకు దక్కుతున్న గౌరవం మిగిలిన 21 మత్స్యకార కుటుంబాలకు దక్క డం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా కథ రాసే సమయంలో 20 మంది మత్స్యకా రులకు రూ.45 వేలు చొప్పున ఇచ్చి సంతకాలు చేయించుకున్నారని, కానీ రామారావు, అతడి బా వమరిది ఎర్రయ్యకు మాత్రం రూ.90 వేలు చొప్పున ఇచ్చారన్నారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన తండేల్‌ సినిమా విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో కూడా రామారావు అతడి భార్యను మా త్రమే గౌరవించారని, మిగిలిన వారిని కనీసం స్టేజ్‌పైకి కూడా పిలవకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రామారావుకి రూ.లక్షల్లో నగదు అందడంతో పాటు, ఒక ఇళ్లు కూడా చిత్ర యూనిట్‌ అందించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా మిగిలిన 21 మంది మత్స్యకార కుటుంబాలకు దక్కాల్సిన గౌరవాన్ని దక్కించాలని వారు చిత్ర యూనిట్‌ను కోరారు. సమావేశంలో చీకటి గురుమూర్తి, సూరాడ ముగతమ్మ, కోనాడ వెంకటలక్ష్మి, కె.అప్పారావు, కిశోర్‌, పి.మణి, రాజు, భవిరోడు, గురువులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:07 AM