శ్రీకాకుళంలో ‘తండేల్’ సందడి!
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:53 PM
‘శ్రీకాకుళం వెనుక ఓ చరిత్ర ఉంది’ అని సినీ హీరో అక్కినేని నాగచైతన్య పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి మత్స్యకారుల యధార్థ గాథ ఆధారంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా విజయోత్సవ సభను గురువారం రాత్రి శ్రీకాకుళంలో నిర్వహించారు.
శ్రీకాకుళం/అర్బన్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళం వెనుక ఓ చరిత్ర ఉంది’ అని సినీ హీరో అక్కినేని నాగచైతన్య పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి మత్స్యకారుల యధార్థ గాథ ఆధారంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా విజయోత్సవ సభను గురువారం రాత్రి శ్రీకాకుళంలో నిర్వహించారు. స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకలో సినీ తారలు నాగ చైతన్య, సాయిపల్లవి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, దర్శకుడు చందు మొండేటి, రచయిత కార్తీక్ సందడి చేశారు. ఈ సినిమా ఇతివృత్తానికి మూలమైన గనగళ్ల రామారావు, నూకమ్మ దంపతులతో కలసి సక్సెస్ మీట్లో మాట్లాడారు. అనంతరం ‘నమో నమఃశివాయ, హైలెస్సా హైలెస్సా’ పాటలకు సాయిపల్లవి, నాగచైతన్య, అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత పోలీసులతో కలసి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కథానాయకుడు నాగచైతన్య, నాయిక సాయిపల్లవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులను అభిమానులు గజమాలలతో సత్కరించారు.
ఫ యాస కోసం ఎటకారం సేస్తే రాజులమ్మ జాతరే: నాగ చైతన్య
‘శ్రీకాకుళం ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్. చందూ మొండేటి, కార్తీక్ నాకు ఈ కథ చెప్పడంతో తొలుత డి.మత్స్యలేశం గ్రామానికి వెళ్లాను. అక్కడ మత్స్యకారుల చేపల వేట, వల ఎలా విసురుతారు.. ఇవన్నీ తెలుసుకుని నేర్చుకున్నా. ఆ తర్వాతనే ‘తండేల్’ రాజు కేరెక్టర్‌కు డిజైన్ చేశారు. సినిమా రిలీజైన తర్వాత అందరి మన్ననలు అందుకున్నా. ఈ కేరెక్టర్‌తో ఎంతో ప్రేరణ పొందాను. శ్రీకాకుళం వెనుక ఓ చరిత్ర ఉందని తెలుసుకున్నా. శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ కేరెక్టర్ చాలా కష్టమైనది. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది.. మట్టి వాసన మారుద్ది.. గాలి తీరు మారుద్ది.. అలాగే యాస, బాస మారుతుంది. యాస కోసం ఎటకారం సేస్తే రాజులమ్మ జాతరే. దద్దా సెప్పినాగా.. ఈ పాలి యేట దుల్లగొట్టేస్తామని. తండేల్ సినిమా రాజులమ్మ జాతర.. మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్లాలి. సాయిపల్లవి ఇక్కడకు వచ్చి మీ ప్రేమను తెలుసుకున్నారు. అల్లు అరవింద్, వాసు, చందూ మొండేటి.. వారు లేకపోతే నేను ఇక్కడకు వచ్చేవాడిని కాదు.
ఫ కథ వినగానే కంట తడి పెట్టుకున్నా: సాయిపల్లవి
శ్రీకాకుళం జనాలను చూసినందుకు ఆనందంగా ఉంది. గనగళ్ల రామారావు(ఒరిజినల్) చెప్పినప్పుడే శ్రీకాకుళం ప్రజలకు థ్యాంక్స్ చెప్పేందుకు సిద్ధమయ్యాం. మత్స్యకారుల జీవితాల్లో ఇంతటి డ్రామా ఉంటుందని తెలిసి.. పాకిస్తాన్ జైలులో గడిపి... అక్కడి నుంచి విడుదల కావడానికి పడిన కష్టాలు వింటూనే కంటతడి పెట్టుకున్నా. వీరి జీవితాన్ని సినిమా తీయడానికి అనుమతించినందుకు కృతజ్ఞతలు. ఇటువంటి పాత్రలో నటించడం దేవుడందించిన భాగ్యంగా ఫీలవుతున్నా. రామారావుతో కూర్చుని కథ కోసం మాట్లాడేటప్పుడు.. రెండు గంటల్లో ఈ సినిమా ఎలా పూర్తవుతుందని అనుకున్నా. కానీ డైరెక్టర్ చక్కగా చిత్రీకరించారు. కథపై నమ్మకముంది. విన్నప్పుడే ఇటువంటి పాత్రలు చేయాలని అనుకున్నా. శ్రీకాకుళం యాస నేర్చుకునేందుకు యోగి అనే వ్యక్తి శిక్షణ ఇచ్చాడు. అందరికీ కృతజ్ఞతలు. మీ రుణం తీర్చుకోలేను. మానిటర్ వెనుక చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక సెట్‌గా ఈగో లేకుండా ఉన్నాం. స్నేహితులందరం కలసి సినిమా తీసినట్లయ్యింది. మా డైరక్టర్ చాలా కూల్‌గా సలహాలు ఇచ్చారు.
ఫ శ్రీకాకుళం జనాలు దుల్లగొట్టేశారు: దర్శకుడు చందు మొండేటి.
శ్రీకాకుళం జనాలు దుల్లగొట్టేశారు. ఉత్తరాంధ్ర నుంచి సినిమా తీస్తే.. ప్రపంచం నలువైపులా ఆదరించేలా కథ తయారైంది. సక్సెస్ వరించింది. లేడీ సూపర్‌స్టార్.. మా పవర్‌స్టార్ సాయిపల్లవి అంగీకరించడమే ఈ సినిమాకు పెద్ద విజయం. నా ప్రేమకథ స్వీయ అనుభవం.. లీడర్ షిప్ అల్లు అరవింద్. క్వాలిటీగా సినిమా రావడానికి వంశీ, శేఖర్ ఎంతో ఉపయోగపడ్డారు. వీళ్లకు థ్యాంక్యూ. నాగ చైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ బాగా కుదిరింది. లవ్‌స్టోరీ నుంచి బాగా ఉంది. హిట్ పెయిర్‌గా ఉన్నారు. అరవింద్ గారి వద్ద పది సంవత్సరాలు పనిచేస్తే విజయాలు వచ్చేస్తాయి.
ఫ కోడి రామ్మూర్తి జీవిత గాఽథను వెబ్‌సిరీస్‌గా తీస్తాం : నిర్మాత అల్లు అరవింద్ :
ఈ ప్రాంతం నుంచి తీసుకున్న కథ ఆధారంగా ‘తండేల్’ సినిమాను తెరకెక్కించాం. ప్రజలు ఎంతగానో ఆదరించారు. శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటా. శ్రీకాకుళం కోసం తెలుసుకుందామని ఆలోచన వచ్చినప్పుడు కోడి రామ్మూర్తి గొప్పదనం గురించి చదివా. ఈ ప్రాంతంలో పుట్టి.. ఎన్నో ఛాలెంజ్‌లు చేసి శ్రీకాకుళానికి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చారు. ఆయన కథ ఆధారంగా వెబ్ సిరీస్‌గానీ.. సినిమా గానీ తీసే ఆలోచనలో ఉన్నాం. రోడ్డుపై రెండు కార్లు ఆపగలిగిన కోడి రామ్మూర్తి శాఖాహారి కావడం.. ఓ శాఖాహారి ఇంత గొప్ప యోధుడిగా ఎదగడమన్నది స్ఫూర్తినిచ్చింది. ‘తండేల్’లో నాగచైతన్య, సాయిపల్లవిని దర్శకుడు తోలుబొమ్మలుగా చేసి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూసిన ఎవరూ ఆ పాత్రలను కానీ.. నాగచైతన్య సాయిపల్లవిలను మరిచిపోలేరు. నాగార్జున కోసం మంచి కథ తయారవుతోంది. కథ రాగానే సినిమా తీస్తాం. ఈ సినిమా ప్రాఫిట్‌ను బన్నీ వాసుతో షేర్ చేసుకుంటా. మా అబ్బాయిలకు షేర్ ప్రాఫిట్ ఇస్తా. ఆ సినిమాతో మరో సినిమా తీస్తా.
ఫ డి.మత్స్యలేశం...ఓ సంచలనం: నిర్మాత బన్నీ వాసు
రెండు రోజుల్లో ఇంతటి జనం వస్తారని ఊహించలేదు. శ్రీకాకుళం వచ్చేటప్పుడు ఇక్కడి ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని విన్నాను. అది ఇక్కడి జనాన్ని చూడగానే అర్థమైంది. శ్రీకాకుళంలోని డి.మత్స్యలేశం గ్రామం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ‘తండేల్’ సినిమాతో మత్స్యలేశం మత్స్యకారుల గాథను ప్రపంచానికి తెలియజేశాం.
ఫ సాయిపల్లవి ప్రాణం పోశారు : రచయిత కార్తీక్ తోట
చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కోసం శ్రీకాకుళం రావడం ఆనందంగా ఉంది. జిల్లా వాసిగా ఈ చిత్ర కథ రాయడం.. ఇంతటి విజయాన్ని చవిచూడడం ఇంకా ఆనందంగా ఉంది. కో ప్రొడ్యూసర్ భానుకి కథ చెప్పాక.. బన్నీ వాసు వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. అక్కడి నుంచి డైరెక్టర్ చందు మొండేటి నన్ను ఎంతగానో ఆదరించారు. కథ ఇవ్వడంతో రచయిత పని అయిపోలేదు. నన్ను పక్కనే ఉంచి ఆదరించారు. సాయిపల్లవి ఈ సినిమాకు ప్రాణం పోశారు. బన్నీ వాసు లేకుంటే నేను లేను. అక్కినేని అభిమానులు బంగారం.