Share News

Bendikonda: బెండికొండ ఆక్రమణపై సర్వే

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:34 PM

Bendikonda Land occupation వజ్రపుకొత్తూరు మండలం బెండికొండ ఆక్రమణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జాతీయ రహదారి సమీపాన.. పలాస- కాశీబుగ్గ మార్కెట్‌కు కూతవేటు దూరంలో ఉన్న బెండి కొండపై వందలాది ఎకరాల భూమిని వైసీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు.

Bendikonda: బెండికొండ ఆక్రమణపై సర్వే
బెండికొండ వద్ద సర్వే చేస్తున్న అధికారులు

  • డీ-పట్టా భూముల వ్యవహారంపై అధికారుల ఆరా

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

    వజ్రపుకొత్తూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం బెండికొండ ఆక్రమణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జాతీయ రహదారి సమీపాన.. పలాస- కాశీబుగ్గ మార్కెట్‌కు కూతవేటు దూరంలో ఉన్న బెండి కొండపై వందలాది ఎకరాల భూమిని వైసీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు. దీనిపై ఈ నెల 14న ‘బెండికొండ మాది!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. మండల సర్వేయర్‌ కె.తిరుపతిరావు ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో బెండికొండపై పలు ప్రదేశాల్లో అధికారులు సర్వే చేశారు. ఇప్పటికే కంచెలు వేసిన వారిని గుర్తించి.. వారి వద్ద ఉన్న భూమి హక్కుపత్రాలపై ఆరా తీశారు. భూమి హక్కు పత్రాలను డిప్యూటీ తహసీల్దార్‌ బి.మురళీకృష్ణ పరిశీలించారు. బెండికొండపై ఉన్న ప్రభుత్వ, రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూముల్లో కొంతమందికి డీ పట్టా భూములను గతంలో రెవెన్యూ అధికారులు అందజేసినట్టు సర్వే అధికారులు గుర్తించారు. కాగా.. డీ-పట్టా భూములు ఏ ప్రాతిధికన అందించారనే విషయమై ఆరా తీశారు. ప్రభుత్వ భూముల్లో డీ-పట్టా మంజూరు చేయాలంటే నిబంధనలు పాటించాలి. భూమిలేని నిరుపేదలు, విశ్రాంతి సైనికులకు ప్రత్యేక ఆదేశాలతో డీ-పట్టా భూములు ఇవ్వాలి. కానీ చాలావరకు నిబంధనలు పాటించకుండా డీ-పట్టాలను కొంతమంది కలిగి ఉండడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీ-పట్టాలు ఉన్న వారిలో చాలామందికి జిరాయితీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నిరుపేదలు కానప్పటికీ చాలా మందికి డీ-పట్టాలు ఎలా అందజేశారనే విషయమై అధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్‌ బి.మురళీకృష్ణ మాట్లాడుతూ.. తహసీల్దార్‌ సీతారామయ్య ఆదేశాల మేరకు బెండికొండపై భూమి హక్కు పత్రాలను పరిశీలించామన్నారు. నివేదికను జిల్లా అధికారులకు పంపించనున్నట్టు తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 11:34 PM