Suda Venture: ఇవేం ప్లాట్లు?
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:53 PM
Land Division Draw ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకుపేరు సోమలింగం’ అన్న సామెత శ్రీకాకుళం అర్బన్ డవలెప్‌మెంట్ అథారిటీ(సుడా)కి అచ్చంగా సరిపోతుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని బొడ్డపాడు గ్రామ రెవెన్యూ వద్ద 150 ఎకరాల్లో ఎన్టీఆర్ టౌన్‌షిప్ పేరుతో సుడా యంత్రాంగం భారీ వెంచర్ వేసింది.

సుడా వెంచర్‌లో స్థలాలు విభజించకుండానే డ్రా
కనీసం చదును కూడా చేయలేదు
రోడ్లు, కాలువల ఊసేలేదు
దరఖాస్తుదారుల్లో ఆందోళన
అధికారుల తీరుపై విమర్శలు
పలాస, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకుపేరు సోమలింగం’ అన్న సామెత శ్రీకాకుళం అర్బన్ డవలెప్‌మెంట్ అథారిటీ(సుడా)కి అచ్చంగా సరిపోతుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని బొడ్డపాడు గ్రామ రెవెన్యూ వద్ద 150 ఎకరాల్లో ఎన్టీఆర్ టౌన్‌షిప్ పేరుతో సుడా యంత్రాంగం భారీ వెంచర్ వేసింది. ఉద్యోగులు, సామాన్య ప్రజల కోసం మొత్తం మూడు విభాగాల్లో ప్లాట్లు వేస్తున్నట్లు ప్రకటించి బ్రోచర్లు విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘జగనన్న టౌన్‌షిప్’ పేరుతో భూసేకరణ చేయగా, ప్రస్తుతం దాన్ని ‘ఎన్టీఆర్ టౌన్‌షిప్’గా పేరు మార్పు చేశారు. కొద్ది రోజుల కిందట దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి టౌన్‌షిప్ స్థలానికి రప్పించారు. లాటరీ పద్ధతిపై ప్లాట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నవారు, చేయని వారు సైతం వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. డ్రా విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చేశారు. దీంతో మొత్తం లాటరీ ప్రక్రియను నిలుపుదల చేసి అందరికీ ప్లాట్లు ఇస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకొన్నారు.
సుడా అధికారుల తీరుపై మొదటి నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రైవేటు వెంచర్లు వేస్తేనే ఎంతో అట్టహాసం చేస్తారు. రహదారులు, కాలువలు నిర్మించడంతో పాటు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తారు. ప్లాట్ల వద్ద రాళ్లకు రంగులు వేసి ఎంతో ఆకట్టుకునేలా మారుస్తారు. అదే ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి ప్లాట్లు విక్రయిస్తే ఆ తంతు ఏ విధంగా ఉండాలి. కానీ, సుడా మాత్రం వీటిని పట్టించుకోలేదు సరికదా స్థలాన్ని కూడా చదును చేయించలేకపోయింది. 80 అడుగుల ప్రధాన రహదారి, లోపల 40అడుగుల రహదారి అంటూ ప్రచారం చేశారే తప్ప చిన్న రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. ప్లాట్లు విభజించకుండానే డ్రా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారులు, కాలువలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు పార్కులు, షాపింగ్ మాల్స్ అన్నీ కట్టి అభివృద్ధి చేస్తామని బ్రోచర్లలో అందంగా తీర్చిదిద్దినా ఆ మేరకు ఒక్క పనీ కూడా జరగలేదు. దీనిపై దరఖాస్తుదారులు ప్రశ్నిస్తే.. బ్రోచర్లలో ఉన్న విధంగానే ప్లాట్లు కేటాయిస్తామని, అందులో ఉన్న నెంబర్లు మీరే చూసుకోవాలని సుడా అధికారులు సమాధానం చెబుతున్నారు. ఇప్పటికైనా స్థలాలను చదును చేయాలని, ప్లాట్లుగా విభజించి హద్దు రాళ్లు పాతాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.