Share News

POLICE కట్టుదిట్టమైన బందోబస్తు

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:48 AM

రథసప్తమి వేడుకలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాధ్‌ జెట్టి తెలిపారు.

POLICE కట్టుదిట్టమైన బందోబస్తు
ఏర్పాట్లపై ఆలయ ఈవోతో మాట్లాడుతున్న డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టి

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రథసప్తమి వేడుకలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాధ్‌ జెట్టి తెలిపారు. ఈ సందర్బంగా నగరంలోని మిల్లు జంక్షన్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లను డీఐజీ పరిశీలించి, క్రమబద్ధీకరణకు అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ నుంచి నడక మార్గంలో సూర్యనారాయణ స్వామి ఆలయం వద్దకు చేరుకుని మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ అంతరం లేకుండా, రోడ్లు మార్గంలో నిలిపిన వాహనాలను ఎప్పటికప్పుడు టోయింగ్‌ వాహనంతో క్లియర్‌ చేయించాలన్నారు. నిర్థేశించిన స్థలంలోనే వాహనాలను పార్కింగ్‌ చేసుకునేలా వాహనదారులకు అవగాహన కలిగించేలా రోడ్లపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లు, క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయం లోపల భక్తులు ఒకే సమయంలో అధిక సంఖ్యలో రద్దీ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆర్ట్స్‌ కళాశాలలో జరగనున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు, తోపులాటలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డీఐజీ గోపినాథ్‌ జట్టి పోలీసు అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆదివారం సాయంత్రం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఎస్పీ మహేశ్వరరెడ్డి పరిశీలించి, పలు సూచనలు చేశారు.

Updated Date - Feb 03 , 2025 | 12:48 AM