Share News

Railway: శ్రీకాకుళం రోడ్‌ రైల్వేకి మహర్దశ

ABN , Publish Date - Feb 04 , 2025 | 12:26 AM

Road Railway Development ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం.. రాష్ట్రంలో కొలువు తీరడంతో రైల్వే లోనూ జిల్లాకు ప్రాధాన్యం లభించింది. శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. జిల్లా మీదుగా మరిన్ని వందే భారత్‌ రైళ్లు కూడా నడవనున్నాయి.

Railway: శ్రీకాకుళం రోడ్‌ రైల్వేకి మహర్దశ
శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌

  • అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద అభివృద్ధి

  • సిక్కోలు మీదుగా మరిన్ని వందే భారత్‌ రైళ్లు

  • రైల్వే బడ్జెట్‌లో ప్రాధాన్యంపై సర్వత్రా హర్షం

  • శ్రీకాకుళం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం.. రాష్ట్రంలో కొలువు తీరడంతో రైల్వే లోనూ జిల్లాకు ప్రాధాన్యం లభించింది. శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. జిల్లా మీదుగా మరిన్ని వందే భారత్‌ రైళ్లు కూడా నడవనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం రైల్వే బడ్జెట్‌ను ప్రకటించింది. అందులో ఆంధప్రదేశ్‌లో రైల్వే పరంగా కేటాయించిన నిధులు.. చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వెల్లడించింది. ఈ మేరకు అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా శ్రీకాకుళం రోడ్‌తోపాటు.. ఇతర రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉంది. మరింత విస్తరణ చేయనున్నారు. గతం కంటే ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అన్ని రైల్వేస్టేషన్లను నూరు శాతం విద్యుదీకరణ చేయనున్నారు. కొత్తగా నడవనున్న వందే భారత్‌ రైళ్లను కూడా జిల్లాపై నుంచి వెళ్లేలా.. శ్రీకాకుళం రోడ్‌లో హాల్ట్‌ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 73 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్‌ (ఆమదాలవలస) కూడా ఉంది. అలాగే కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లు, 200 వందే భారత్‌ రైళ్లు, కొత్తగా వంద అమృత్‌ భారత్‌ రైళ్లకు ఆంధ్ర రాష్ట్రంలో నడిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ప్రకటించారు. దీనివల్ల జిల్లా మీదుగా ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు వెళ్లే రైళ్లు వల్ల ‘శ్రీకాకుళం రోడ్‌’కు మహర్దశ పట్టనుంది. దూరప్రాంతాలకు మరిన్ని రవాణా సౌకర్యాలు మెరుగపడనున్నాయి. దీనిపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 04 , 2025 | 12:26 AM