B.C.loans: భలే చాన్స్!
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:47 PM
Self-Employment బీసీలకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఉపాధి రుణాలు అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 28లోగా యూనిట్ల మంజూరు ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది.

బీసీలకు స్వయం ఉపాధి రుణాలు
50 శాతం రాయితీపై అందించనున్న ప్రభుత్వం
జిల్లాలో 2,828 యూనిట్ల మంజూరుకు నిర్ణయం
వచ్చే నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి
ఇచ్ఛాపురం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): బీసీలకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఉపాధి రుణాలు అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 28లోగా యూనిట్ల మంజూరు ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. జిల్లాలో 2,828 యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో ఏ,బీ,సీ,డీ వర్గాలకు యూనిట్లు మంజూరు చేయనున్నారు.
యూనిట్లు ఇవే..
ప్రధానంగా కుట్టు శిక్షణ, కోళ్లఫారాలు, పాడి, వస్త్ర దుకాణాలు, ఫొటో స్టూడియోలు, జిరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ కేంద్రాలు, బ్యూటీపార్లర్లు తదితర యూనిట్లకు అవకాశం ఉంటుంది. యూనిట్‌కు సంబంధించి 50 శాతం బ్యాంకు రుణంగా అందిస్తారు. మిగతా 50 శాతం రాయితీ. బ్యాంకు నుంచి కూడా ప్రభుత్వమే రుణం ఇప్పిస్తుంది. ఇందులో రూపాయి కూడా లబ్ధిదారుడు కట్టనవసరం లేదు. అయితే 100 శాతం యూనిట్ ఏర్పాటు చేస్తేనే మంజూరు చేస్తారు. లేకుంటే మాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. 21 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఏపీవోబీఎంఎంఎస్)లో నమోదు చేసుకోవాలి. మొత్తం 3 స్లాబుల్లో రుణాలు అందించేందుకు నిర్ణయించారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రుణాలు అందిస్తారు. మొదటి స్లాబులో 1935 మందికి రూ.29.03 కోట్లు, రెండో స్లాబులో 581 మందికి రూ.14.52 కోట్లు, మూడో స్లాబులో 208 మందికి రూ.8.32 కోట్లు అందించనున్నారు. ప్రధానంగా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసే బీసీ యువతకు రుణాలు అందించనుంది. ఇందులో బీసీ యువతకు 55 దుకాణాలకు గాను రూ.4.40 కోట్లు, అగ్రవర్ణాల్లోని పేద యువతకు ఎమినిది దుకాణాల నిమిత్తం రూ.64 లక్షలు రుణం రూపంలో ఇవ్వనున్నారు. బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకు ఈబీసీ కోటా కింద రుణాలు అందించనున్నారు. ఈబీసీ విభాగంలో 12 మందికి రూ.21 లక్షలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి రూ.3 లక్షలు, రెడ్డి సామాజికవర్గంలో ఒకరికి రూ.2 లక్షలు, బ్రాహ్మణ సామాజికవర్గంలో 23 మందికి రూ.40 లక్షలు, క్షత్రియ విభాగంలో ఒకరికి రూ.2 లక్షలు, ఆర్యవైశ్యుల్లో ఇద్దరికి రూ.3 లక్షల చొప్పున రుణాలు అందించనున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీ ర్యం అయ్యింది. ఆ సామాజిక వర్గ యువతకు ఎటువంటి న్యాయం దక్కలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా రుణాలు, రాయితీలు అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పథకాలకు చేసిన కేటాయింపులనే.. కార్పొరేషన్ల వారీగా లెక్కలు చూపి చేతులు దులుపుకొన్నారు. దీనివల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.
సద్వినియోగం చేసుకోవాలి
స్వయం ఉపాధికి సంబంధించి ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుంది. వంద శాతం యూనిట్లు పెడితేనే రుణంతో పాటు రాయితీ అందుతుంది. ఈ అవకాశాన్ని బీసీలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ 50 శాతం రాయితీ అందించడమే కాకుండా.. 50 శాతం బ్యాంకు రుణాలు కూడా అందిస్తుంది.
- ఆర్.గడ్డెమ్మ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, శ్రీకాకుళం