Share News

Private travels: నెంబరు ఒకటే.. బస్సులు రెండు..

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:26 AM

Private travels:జిల్లాలో ప్రైవేటు బస్సులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రెండు, మూడు బస్సులకు ఒకే నెంబరు ఉంటుంది. కాంట్రాక్టర్‌ క్యారియర్‌ అనుమతులతో ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి.

  Private travels: నెంబరు ఒకటే.. బస్సులు రెండు..

  • ప్రైవేటు ట్రావెల్స్‌ ఇష్టారాజ్యం

  • జిల్లాలో పుట్టగొడుగుల్లా సర్వీసులు

  • ప్రభుత్వ ఆదాయానికి గండి

  • అధికార పార్టీ నేతల అండదండలు

  • చోద్యం చూస్తున్న అధికారులు

  • అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై ప్రతిరోజూ రెండు ప్రైవేట్‌ బస్సులు నడుస్తుంటాయి. ఒకటి విజయవాడ-పాతపట్నం, మరోకటి హైదరాబాద్‌-పాతపట్నం రూట్లలో తిరుగుతుంటాయి. అయితే, ఈ రెండు బస్సులకూ ఒకటే నెంబర్‌ ఉంది. ఒకటి నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌తో, మరోకటి ఛత్తీస్‌గఢ్‌రిజిస్ట్రేషన్‌తో గత కొంతకాలంగా నడుస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  • హడ్డుబంగి-విశాఖపట్నం మార్గంలో పదుల సంఖ్యలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో కొన్ని కాంట్రాక్టర్‌ క్యారియర్‌ అనుమతులతో ప్రయాణికులను రవాణా చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల రిజి స్ట్రేషన్‌, అనుమతులతో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.


ఆమదాలవలస, జనవరి 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రైవేటు బస్సులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రెండు, మూడు బస్సులకు ఒకే నెంబరు ఉంటుంది. కాంట్రాక్టర్‌ క్యారియర్‌ అనుమతులతో ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. రవాణా శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు పాతపట్నం నుంచి విజయవాడకు రెండు ప్రైవేట్‌ బస్సులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం పాతపట్నం, బత్తిలి, కొత్తూరు, హడ్డుబంగి ప్రాంతాల నుంచి సుమారు 30 ప్రైవేటు బస్సులు ప్రతిరోజూ హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజురోజుకూ ప్రైవేటు ట్రావెల్స్‌ సంఖ్య పెరుగుతుండ డంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్‌ ఏర్పడుతుంది. ముఖ్యంగా అలికాం-బత్తిలి రహదారిపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇరువైపులా వచ్చిపోయే బస్సులతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ప్రధాన కూడళ్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఎక్కువ సమయం బస్సులను నిలుపుదల చేస్తున్నారు. దీంతో ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


చోద్యం చూస్తున్న అధికారులు..

ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు బస్సులను పోలీసులు, రవాణాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎంతసేపూ బస్సుల్లో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారా? లేదా? అని తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప ఏ రోజైనా బస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించిన దాఖలాలు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పేరుతో రిజిస్ర్టేషన్లు, ఒకే నెంబర్‌తో నడుస్తున్న బస్సులపై, కాంట్రాక్టర్‌ క్యారియర్‌ అనుమతులతో పాసింజర్‌ సర్వీస్‌ చేస్తున్న ట్రావెల్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల సరుబుజ్జిలి పోలీసు స్టేషన్‌ వద్ద విశాఖపట్నం వెళుతున్న ఓ ప్రైవేట్‌ బస్సును పోలీసులు ఆపారు. ఆ బస్సు కాగితాలను పరిశీలించగా కాంట్రాక్టర్‌ క్యారియర్‌గా అనుమతులు ఉన్నాయి. కానీ, పాసింజర్‌ సర్వీసుగా తిరుగుతుండడంతో బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులందరూ వివిధ అవసరాలపై వెళుతున్నామని, ఏదైనా ఉంటే తర్వాత విచారించాలని పోలీసులను కోరడంతో అక్కడ నుంచి బస్సును పంపించేశారు. ఇదే విధంగా సుమారు ఆరు బస్సులు తప్పుడు ధ్రువపత్రాలతో ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి విశాఖపట్నంకు ప్రతిరోజూ ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు, రవాణాశాఖ అధికారులు స్పందించి ఇలాంటి బస్సులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:26 AM