Share News

Road works: వారం రోజుల్లోనే.. పోయింది

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:02 AM

Poor quality of road works ప్రధాన రహదారుల మరమ్మతులకు గత ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.

Road works: వారం రోజుల్లోనే.. పోయింది
పనులు చేసిన వారం రోజుల్లో తారు తేలిపోయిన దృశ్యం

  • ఆల్‌ఆంధ్రారోడ్డు పనుల్లో నాణ్యతాలోపం

  • మెళియాపుట్టి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రధాన రహదారుల మరమ్మతులకు గత ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక కష్టాలు ఉన్నా.. సంక్రాంతిలోగా రహదారులు మరమ్మతులు చేయాలని సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా పాతపట్నం నుంచి మెళియాపుట్టి వచ్చే ఆల్‌ఆంధ్రారోడ్డు మరమ్మతుల కోసం రూ.56 లక్షలు కేటాయించారు. టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఈ మేరకు వారం రోజుల కిందట పనులు చేపట్టారు. కాగా.. రోడ్డుపై వేసిన తారు వారం రోజులకే వదిలేసి.. రాళ్లు తేలడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిధులు వెచ్చించినా.. తూతూమంత్రంగా పనులు చేపట్టారని ఆరోపిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విషయమై పాతపట్నం సెక్షన్‌ ఆర్‌అండ్‌బీ ఏఈ వి.యోగి వద్ద ప్రస్తావించగా.. ఎక్కడైనా తారు వదిలి రాళ్లు తేలితే.. కాంట్రాక్టర్‌తో మళ్లీ పనులు చేయిస్తామని తెలిపారు. ‘ఆల్‌ఆంధ్రా రహదారిలో పెద్ద పెద్ద గుంతలు పూడ్చేలా పనులు చేయించాం. కిలోమీటర్‌కి సుమారు రూ.40లక్షలు అవసరం. కానీ 12కిలోమీటర్లకు రూ.39లక్షలు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. నిధులు లేక చిన్నచిన్న గుంతల మరమ్మతులు నిలిచిపోయాయి’ అని యోగి తెలిపారు.

Updated Date - Feb 23 , 2025 | 12:02 AM