Share News

ఆ ఉపాధ్యాయుడి దందాను అడ్డుకోండి

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:09 AM

తమపై దందాకు పాల్పడుతున్న ఓ ప్రభుత్వ హైస్కూల్‌ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధి గ్రామాలకు చెందిన పలువురు క్వారీ కార్మికులు కోరారు.

ఆ ఉపాధ్యాయుడి దందాను అడ్డుకోండి
సరుబుజ్జిలి పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న క్వారీ కార్మికులు

  • క్వారీ కార్మికుల ఆందోళన

  • పోలీసులకు ఫిర్యాదు

ఆమదాలవలస, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తమపై దందాకు పాల్పడుతున్న ఓ ప్రభుత్వ హైస్కూల్‌ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధి గ్రామాలకు చెందిన పలువురు క్వారీ కార్మికులు కోరారు. ఈ మేరకు శనివారం వారంతా ఆయా మండలాల పోలీసు స్టేష న్లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు క్వారీ కార్మికులు మాట్లాడారు. బూర్జ మండలం కొరగాం రెవెన్యూ పరిధిలో ఉన్న ముంగన్నకొండపై 20 ఏళ్ల నుంచి సుమారు 150 కుటుంబాలు క్వారీ పనులు (రాళ్లు కొట్టడం) చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని కార్మికులు తూలుగు శ్రీరాములు, గొజ్జల సింహాచలం, గుద్దల చంద్ర, గుజ్జల రమణ, తాడేల మల్లేష్‌, తాడేల కృష్ణ, వి.రమణ, బి.సింహాచలం, పిట్ట దాలయ్య తదితరులు తెలిపారు. ఈ కొండ పరిసరాలను ఆనుకుని ఉన్న సుమారు ఐదు ఎకరాల డీ-పట్టా భూములను రొట్టవలస గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కొనుగోలు చేసి తమపై పెత్తనం చెలా యిస్తున్నాడని ఆరోపించారు. క్వారీ ప్రాంతానికి చేరుకోవాలంటే ఈ భూముల మీదుగానే వెళ్లాల్సి ఉండడంతో ప్రతి నెలా డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాడని ఆరోపించారు. ఒక్కో క్వారీ కార్మికుల బృందం పది వేల రూపాయలు చెల్లిస్తేనే తన భూముల్లో నడవడానికి అంగీకరిస్తానని హుకుం జారీ చేసి భయ బ్రాంతులకు గురిచేస్తున్నాడని క్వారీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాలకు చెందిన పెద్దలకు ఈ విషయం చెప్పినా.. ఆ ఉపాధ్యాయుడి గత చరిత్ర తెలిసిన వారెవరూ తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. రెక్కాడితేగాని డొక్కాడని తమపై దందా చేస్తున్న ఆ ఉపాధ్యాయుడిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.

Updated Date - Feb 23 , 2025 | 12:09 AM