Share News

Policy change: ఆ నిబంధన సడలింపు

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:08 AM

Law modification స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల పోటీకి సంబంధించి సంతానం నిబంధనలను కూటమి ప్రభుత్వం సడలించింది. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను పంచాయతీరాజ్‌ చట్టం నుంచి తొలగించింది.

Policy change: ఆ నిబంధన సడలింపు
బిర్లంగి గ్రామ పంచాయతీ కార్యాలయం

  • స్థానిక సంస్థల్లో పోటీకి సంతానం అడ్డుకాదు

  • గెజిట్‌ జారీచేసిన కూటమి ప్రభుత్వం

  • ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 13: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల పోటీకి సంబంధించి సంతానం నిబంధనలను కూటమి ప్రభుత్వం సడలించింది. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను పంచాయతీరాజ్‌ చట్టం నుంచి తొలగించింది. ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హులేనని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం కూడా పొందింది. గురువారం న్యాయశాఖ ఏకంగా గెజిట్‌ జారీ చేసింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

  • 30 ఏళ్ల కిందట దేశ జనాభా రికార్డుస్థాయిలో పెరిగింది. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించాయి. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు 1994లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఏపీ పంచాయతీరాజ్‌ చట్టాన్ని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారిని అనర్హులుగా తేల్చింది. అప్పట్లో ఈ నిబంధన కలకలం రేపింది. ఎంతోమంది రాజకీయ ఆశావహులపై నీళ్లు చల్లింది. దీనికి తెరదించుతూ.. తాజాగా కూటమి ప్రభుత్వం ఇద్దరి కంటే ఎక్కవ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల్లో పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

  • నడి వయస్కులు, వృద్ధులే అధికం..

    ప్రస్తుతం రాష్ట్రంలో యువత సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే యువత కంటే నడి వయస్కులు, వృద్ధుల జనాభా అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణం కుటుంబ నియంత్రణ. ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఇద్దరు, ఆపై ఎక్కువ మంది పిల్లలు ఉంటే చదువు, వివాహాలతోపాటు వారికి మంచి భవిష్యత్‌కు బాటలు వేయాలంటే ఇబ్బందికరమే. అందుకే ప్రస్తుతం చాలామంది దంపతులు ఒకరినే కంటున్నారు. ఫలితంగా జనాభా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో జనాభా పెరగాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థల పోటీకి సంతానం అర్హతను సడలించిందని తెలుస్తోంది.

  • జిల్లాలో పరిస్థితి ఇది..

    జిల్లాలోని 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 647 సచివాలయాలు కొనసాగుతున్నాయి. 667 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి 2021లో ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానం అర్హతను సడలించడంపై అన్నివర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

  • శుభ పరిణామం

    గ్రామ ప్రథమ పౌరుడిగా సేవలందించాలని చాలామంది భావించారు. కానీ స్థానిక సంస్థల్లో పోటీకి సంతానం అర్హతగా నిలవడంతో అప్పట్లో చాలామంది ఆశావహులపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఇప్పుడు ఆ నిబంధనను తొలగించడం శుభ పరిణామం.

    - దక్కత ఢిల్లీరావు, మాజీ ఎంపీపీ, ఇచ్ఛాపురం

  • అవకాశం దక్కుతుంది

    స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గతంలో సంతానం అర్హత పెట్టడంతో చాలామందికి ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉన్నా అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఆ నిబంధనను తొలగించడం శుభపరిణామం. ఇప్పుడు చాలా మంది ఆశావహులకు పోటీ చేసే అవకాశం దక్కుతుంది.

    - రంగాల పద్మావతి, సర్పంచ్‌ అరకబద్ర, ఇచ్ఛాపురం

Updated Date - Feb 14 , 2025 | 12:08 AM