రెగ్యులర్ ఏడుగురే
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:41 PM
ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీని అధ్యాపకుల కొరత వేధిస్తోంది. వర్సిటీ ఏర్పాటై 17 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ రెగ్యులర్ అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేరు.

కాంట్రాక్ట్ అధ్యాపకులు 87మంది
అంబేడ్కర్ వర్సిటీలో ఇదీ పరిస్థితి
కొన్నేళ్లుగా జరగని నియామకాలు
ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీని అధ్యాపకుల కొరత వేధిస్తోంది. వర్సిటీ ఏర్పాటై 17 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ రెగ్యులర్ అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేరు. కేవలం ఏడుగురు మాత్రమే ఉండడంతో బోధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే తరగతులను నెట్టుకొస్తున్నారు. ప్రతీసారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం.. తరువాత వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వంలోనైనా నియామకాలు జరుగుతాయని ఉన్నత విద్యావంతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎచ్చెర్ల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రాయూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఎచ్చెర్లలోని పీజీ సెంటర్ సుమారు 17 ఏళ్ల కిందట యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. 2008లో ఇక్కడి పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా అప్పటి ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. వర్సిటీ ఏర్పాటైన తర్వాత నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పనలో కాస్త మెరుగ్గానే ఉన్నా, అధ్యాపకుల కొరతను మాత్రం తీవ్రంగా ఎదుర్కొంటోంది. అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 2010లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు జరిగాయి. అప్పటి వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్ హయాంలో సోషల్‌వర్క్, బయోటెక్నాలజీ కొత్త కోర్సులను ప్రారంభించి, ఒక అసోసియేట్, ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నియమించారు. పీజీ సెంటర్‌గా ఉన్నప్పుడు పనిచేసిన అధ్యాపకుల్లో సుమారు 30 మంది ఆప్షన్ ఇచ్చి తిరిగి ఏయూకు వెళ్లిపోయారు. ఐదుగురు ఆచార్యులు మాత్రమే ఇక్కడ కొనసాగారు. వీరిలో నలుగురు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం వర్సిటీలో ఎకనామిక్స్‌లో ఒక ప్రొఫెసర్, బయోటెక్నాలజీలో ఒక ప్రొఫెసర్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సోషల్‌వర్క్‌లో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఉన్న వారిలో రెగ్యులర్ అధ్యాపకులు ఏడుగురు మాత్రమే ఉన్నారు.
పలుమార్లు నోటిఫికేషన్ జారీ చేసినా..
అంబేడ్కర్ వర్సిటీకి వీసీలుగా పనిచేసిన ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, ప్రొఫెసర్ కూన రాంజీ హయాంలో పలుమార్లు బోధనా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్లు విడుదలైనా పలు అభ్యంతరాల కారణంగా నియామక ప్రక్రియ పూర్తికాలేదు. సుమారు 49 బోధనా సిబ్బంది నియామకానికి ప్రొఫెసర్ లజపతిరాయ్ పాలనా కాలంలో రెండుసార్లు ప్రకటనలు వెల్లడైనా ఆ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. అలాగే వీసీ ప్రొఫెసర్ కూన రాంజీ హయాలో సుమారు 13 అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించినా ఆ నియామకాలు కూడా కార్యరూపం దాల్చలేదు. 2017 ఏప్రిల్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు అంబేడ్కర్ వర్సిటీలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించింది. కోర్టు చిక్కులు ఎదురుకావడం, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏకంగా ఆ నోటఫికేషన్‌నే రద్దుచేసింది. ఆ మధ్య కాలంలో బీసీ (బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి అంబేడ్కర్ వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ అవి కూడా భర్తీకాలేదు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 61 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2023 అక్టోబరులో నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులను కూడా స్వీకరించింది. కెమిస్ట్రీ, కామర్స్, ఇంగ్లీష్, లా, ఎంఎల్‌ఐఎస్సీ, మేథ్స్, ఎకనామిక్స్, రూరల్‌డెవలప్‌మెంటు విభాగాల్లో చెరో నాలుగు ఖాళీలు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో చెరో 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే కొత్తగా ప్రారంభించిన నాలుగేళ్ల సమీకృత ఉపాద్యాయ కార్యక్రమం (ఐటెప్)లో 12 అధ్యాపకుల పోస్టుల భర్తీకి, సోషల్‌వర్క్‌లో ఒక పోస్టు భర్తీకి ప్రకటన ఇచ్చారు. అదే విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భర్తీకి కూడా ప్రకటన జారీ అయ్యింది. అయితే కోర్టు వివాదాల కారణాలతో ఆ ప్రకటనపై స్పష్టత రాలేదు.
కేవలం ఏడుగురే..
అంబేడ్కర్ వర్సిటీలో ఆర్ట్స్, లా, సైన్స్, ఇంజనీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నా కేవలం ఏడుగురు మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. 67 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు, మరో 20 మంది వరకూ సబ్జెక్ట్ కాంట్రాక్ట్ సిబ్బందితోనే తరగ తులు నెట్టుకొస్తున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో కోర్సులో ఒక ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసరు పోస్టులు ఉండాలి. వాస్తవానికి ఏ కోర్సులో కూడా రెగ్యులర్ సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు.
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు..
కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యూనివర్సిటీల్లో రెగ్యులర్ అధ్యాపకుల సిబ్బంది నియామకం జరుగుతుందనే ఆశలు చిగురించాయి. ఎప్పటి నుంచో రెగ్యులర్ అధ్యాపకుల నియామకం కోసం ఎదురుచూస్తున్న ఉన్నత విద్యావంతులు నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.