Share News

Farmers: రైతులకు ‘గుర్తింపు’

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:06 AM

Agriculture Benefits రైతులకు గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతీ రైతుకు ‘ఆధార్‌’ మాదిరి 14 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తూ గుర్తింపు కార్డులు జారీకి చర్యలు చేపడుతోంది.

Farmers: రైతులకు ‘గుర్తింపు’

  • ప్రత్యేక కార్డుల జారీకి చర్యలు

  • నమోదు ప్రక్రియ ప్రారంభం

  • నరసన్నపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రైతులకు గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతీ రైతుకు ‘ఆధార్‌’ మాదిరి 14 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తూ గుర్తింపు కార్డులు జారీకి చర్యలు చేపడుతోంది. ఈ కార్డుల ద్వారా రైతులకు సంక్షేమ పథకాలతోపాటు పంట నష్టం, బీమా పరిహారం తదితర సేవలను పారదర్శకంగా అమలు చేయనుంది. వాతావరణంలో మార్పులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించి అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టనుంది. ఈ సంఖ్య ప్రామాణికం కానున్న నేపథ్యంలో రైతులంతా.. ‘ఫార్మర్‌ రిజిస్ర్టేషన్‌’ చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

  • జిల్లాలో 3.72 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరంతా రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఆధార్‌, పట్టాదారు పుస్తకాల జిరాక్స్‌లను గ్రామ వ్యవసాయ సహాయకుడికి అందించాలి. ఆ వివరాలను వీఏఏ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రైతుకు చెందిన సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్‌తో వీఏఏ లాగిన్‌ ద్వారా రైతుల వివరాలను సరిచూస్తారు. పాస్‌పుస్తకాల్లో ఉన్న వివరాలు సరిపోలితే 14 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు అందిస్తారు. ఒకవేళ రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోతే వీఆర్వో లాగిన్‌కు వెళ్తుంది. వీఆర్వో సరిచూసి.. తహసీల్దార్‌కు వివరాలు పంపిస్తారు. వాటిలో తప్పులను రికార్డుల మేరకు సరిచేసిన తరువాత వీఏఏకు పంపిస్తారు. ప్రస్తుతం నమోదు ప్రక్రియ సాగుతోంది. రైతులు తగు ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలని నరసన్నపేట ఏడీఏ రవీంద్ర భారతి తెలిపారు. ప్రత్యేక గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు.

  • ప్రయోజనాలివీ..

    రైతులకు గుర్తింపు కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భూమి గల రైతులను త్వరగా గుర్తించేందుకు ఇవి దోహదపడతాయి. ప్రభుత్వ రాయితీలు, పంటల బీమా వర్తిస్తాయి. భూ ఆఽధారిత రైతు పథకాలైన పీఎం కిసాన్‌ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, వ్యవసాయ పరికరాలు తదితర పథకాలను నేరుగా పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే సత్వరమే పరిహారం అందించేందుకు అవకాశం ఉంది. నీటిపారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతవరణ సూచనలు వంటి ఇతర సేవలు కూడా పొందవచ్చు.

Updated Date - Feb 11 , 2025 | 12:06 AM