ఆన్‌లైన్‌లో రైల్వే పాసులు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:14 AM
దివ్యాంగుల రైల్వే పాసులకు సంబంధించి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లోనే వారు పాసులు పొందేందుకు అవకాశం ఇచ్చింది.

- స్టేషన్ల చుట్టూ తిరగవసరం లేదు
- దివ్యాంగుల కోసం రైల్వేశాఖ నిర్ణయం
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల రైల్వే పాసులకు సంబంధించి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లోనే వారు పాసులు పొందేందుకు అవకాశం ఇచ్చింది. గతంలో మాదిరిగా రైల్వేస్టేషన్ల చుట్టూ తిరగకుండానే ఇంటి వద్ద నుంచే రైల్వే పాసులు పొందే వెసులుబాటు కల్పించింది. ఇంటర్ నెట్ కేంద్రాల్లో కానీ.. మీ సేవా కేంద్రాలకు వెళ్లి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌టీటీపీ: దివ్యాంగజనిధి.ఇండియన్ రైల్వే.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులోనే యూనిక్ డిజిబులిటీ ఐడీ కార్డు (యూడీఐడీ) మంజూరు చేస్తారు. కొత్త పాసులు కావాల్సిన వారు, పాతవి రెన్యూవల్ చేయాలనుకునేవారు ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే పాసు ఐడీ కార్డు తీసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసుకునే సమయంలో తొలుత తన పేరు, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తరువాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత వచ్చిన ఓటీపీ నెంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఎన్నిసార్లు లాగిన్ అయినా పేర్లు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
కొందరే ఉపయోగించుకుంటున్నారు..
జిల్లాలో 7 వేల మంది దివ్యాంగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో కొద్ది మంది మాత్రమే రైల్వేపాసులు ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ మంది పాసులు తీసుకోవడం లేదు. జిల్లాలో పెద్దవైన శ్రీకాకుళం రోడ్, నౌపడ ఆర్‌ఎస్, పలాస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లలోనే దివ్యాంగులకు పాసులు జారీచేసేవారు. మిగతా స్టేషన్లు చిన్నవి కావడం, సిబ్బంది తక్కువగా ఉండడంతో పాసులు ఇచ్చేవారు కాదు. అయితే దివ్యాంగులు ఏటా రైల్వేపాసుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం కష్టతరంగా ఉండేది. పైగా కొన్నిస్టేషన్లలో ప్లాట్‌ఫారాలు దాటుకొని వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. అందుకే రైల్వేశాఖ దివ్యాంగుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని దివ్యాంగులు ఆహ్వానిస్తున్నారు.
శుభ పరిణామం
ఆన్‌లైన్‌లో రైల్వే పాసులు అందిస్తుండడం శుభపరిణామం. గతంలో వ్యయప్రయాసలకు గురయ్యేవాళ్లం. సుదూర ప్రాంతాలు వెళ్లి పాసులు తీసుకోవడానికి చాలామంది విముఖత చూపేవారు. రైల్వేశాఖ స్పందించి ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పాసులు పొందే వెసులుబాటు కల్పించడం బాగుంది. రైల్వేశాఖకు కృతజ్ఞతలు.
-తులసీరావు, దివ్యాంగుడు, ఇచ్ఛాపురం
మంచి నిర్ణయం
రైల్వేశాఖ మంచి నిర్ణయం తీసుకుంది. గతంలో పెద్దస్టేషన్లలో పాసుకు సంబంధించి కౌంటర్లు ఏర్పాటు చేసేవారు. అప్పట్లో రకరకాల సాంకేతిక సమస్యలు వచ్చేవి. దీంతో పాసులు పొందేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. మా ఇబ్బందులు గమనించిన రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో పాసుల జారీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం బాగుంది.
-ఎండ హిమతేజ, దివ్యాంగుడు, ఇచ్ఛాపురం