Radha Kanthuda: రాధాకాంతుడా.. నాటి వైభవం ఏదీ?
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:53 PM
Radha Kanthuda Former glory పూరీ ప్రాంతానికి చెందిన మఠాధిపతులతో, దూప, దీప, నైవేద్యాలతో ఒకప్పుడు ఆ ఆల యం కళకళలాడేది. అలాంటి ఆలయం నేడు వెలవెలబోతోంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నా ఆదాయం లేక ఆదరణకు నోచుకోవడం లేదు.

వందలాది ఎకరాలు ఉన్నా ఆదాయం లేదాయె
కొన్నిచోట్ల నామమాత్రపు లీజుల చెల్లింపు
దూప, దీప, నైవేద్యానికి కష్టమవుతున్న వైనం
చోద్యం చూస్తున్న దేవదాయశాఖ
ఇదీ టెక్కలిలోని ప్రాచీన ఆలయ దుస్థితి
టెక్కలి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పూరీ ప్రాంతానికి చెందిన మఠాధిపతులతో, దూప, దీప, నైవేద్యాలతో ఒకప్పుడు ఆ ఆల యం కళకళలాడేది. అలాంటి ఆలయం నేడు వెలవెలబోతోంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నా ఆదాయం లేక ఆదరణకు నోచుకోవడం లేదు. ఆస్తులు ఎక్కువగా ఆక్రమణలో ఉండగా, మరికొన్ని భూములకు నామమాత్రపు లీజుల చెల్లింపు తో రోజురోజుకీ ఆ ఆలయ వెలుగులు మసకబారి పోతున్నాయి. దూప, దీప, నైవేద్యాలకూ కష్టమవుతోంది. ఇదీ టెక్కలి తెలుగు బ్రాహ్మణ వీధిలోని రాధాకాంతుని ఆలయ దుస్థితి. నాలుగు దశా బ్దాల కిందట దేవదాయశాఖ ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాల ఆస్తులు, సంపదపై కోర్టులో వాజ్యం వేసి గెలిచింది. దీంతో రాధా కాంతుని ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి గ్రహణం పట్టింది. మండలంలోని గూడేం, మొఖలింగాపురం, నర్సింగపల్లి పంచాయతీల పరిధిలో రాధాకాంతుల ఆలయానికి 300 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. గిరిజనులు, గిరిజనేతరులే ఈ భూములను ఎక్కువగా సాగు చేస్తున్నారు. నర్సింగపల్లి పంచాయతీ నుంచి దశాబ్దాల తరబడి రాధాకాంతుని ఆలయా నికి ఆదాయం అందడం లేదు. గూడేం, డమరకు చెందిన కొంతమంది రైతులు నామమాత్రపు లీజులు దేవదాయశాఖకు చెల్లిస్తూ మమ అనిపిస్తున్నారు. ఎకరాకు రూ.500 నుంచి రూ.వెయ్యి చెల్లిస్తున్నా దేవదాయశాఖ పట్టించుకోవడం లేదు. లీజులతో పాటు ఆదాయ వనరులు పెంచడంలో దేవదాయశాఖ అధికారులు విఫలమయ్యా రు. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నా రాధాకాంతుని ఆలయం దైన్యస్థితిలో కొనసాగుతోంది. ఆలయ పైకప్పు ఊడిపోవడంతో స్థానిక యువత కొందరు సొంత నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం అరకొరగా వస్తున్న ఆదాయాన్ని ఆలయ విద్యుత్ నిర్వహణకు, దూప, దీప, నైవేద్యానికి, ఉత్సవాలకు, అర్చకుల జీతభత్యాల కోసం విని యోగిస్తున్నట్లు తెలుస్తోంది. రాధాకాంతుని ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడడంతో పాటు ఆదాయ వనరులు పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
ఆదాయం పెంచేందుకు కృషి
రాధాకాంతుని ఆలయ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం. నర్సింగపల్లి పంచాయతీ పరిధిలోని ఆలయ భూముల నుంచి లీజులు రావడం లేదు. దీనిపై ఆ ప్రాంత రైతులకు రెవెన్యూ సదస్సుల్లో అవగాహన కల్పించాం. లీజులు చెల్లించే రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం వంటి రాయితీలు లభిస్తాయి. ఉన్న వనరులతో పాటు దాతల సహకారంతో ఆలయం నడిపిస్తున్నాం.
- టి.మనస్విని, రాధాకాంత ఆలయ ఈవో