ఇంటర్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:21 AM
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.

75 పరీక్ష కేంద్రాలు.. 40,356 మంది విద్యార్థులు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో పి.దుర్గారావు మాట్లాడుతూ.. 10వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయన్నారు. ప్రయోగ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నాఉ. ఒకేషనల్ కోర్సు పరీక్షలు 5 నుంచి ప్రారంభమైనట్టు తెలిపారు. థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొత్తం 40,356 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, ఇందులో ప్రథమ సంవత్సరం 20,389 మంది, ద్వితీయ సంవత్సరం 19,967 మంది ఉన్నారన్నారు. వీరిలో 37,976 మంది సాధారణ, 2380 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జెరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని వసతులతోపాటు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సకాలంలో బస్సులు చేరుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, డీఈవో తిరుమల చైతన్య, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎన్.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 45,657 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.35,58,63,479 విడుదల య్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘2024- 25 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని వివిధ కళాశాలల్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు తొలివిడతగా ఈ నిధులు విడుదలయ్యాయి. ఎస్సీ విద్యార్థులకు మినహాయించి.. మిగిలిన వారందరికీ ట్యూషన్ ఫీజులను ఆయా కళాశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేశామ’ని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యాలు చేరుకుంటాం
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం సాయంత్రం సచివాలయం నుంచి వీడియోన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ. జిల్లాలో పీ-4 అమలుకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీవో భారతి సౌజన్య, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం ఉమామహేశ్వరరావు, డీఐపీఆర్వో కె.చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.