Share News

OP Fees: వామ్మో.. ఓపీ!

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:12 AM

Private hospitals Fee hike వైద్యం కోసం వెళ్లే రోగుల వద్ద ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు పిండేస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు ఎలా అమలవుతున్నాయి.. అక్కడ వైద్యం.. తీసుకుంటున్న ఫీజులు.. అందిస్తున్న సేవలు.. వైద్యులు, సిబ్బందితోపాటు ల్యాబ్‌ల్లో అర్హత కలిగిన వారే ఉన్నారా? అన్నది ఎవరికీ తెలియదాయె.

OP Fees: వామ్మో.. ఓపీ!

  • ఫీజులు భారీగా పెంచిన ప్రైవేటు ఆసుపత్రులు

  • పది రోజుల్లో ఒక్కసారే వైద్యుడు చూస్తారంట

  • ‘కార్పొరేట్‌’తో సమానంగా డబ్బుల వసూళ్లు

  • ప్రత్యేక వైద్య నిపుణుల టోకెన్‌కు డబుల్‌ రేట్లు

  • పర్యవేక్షణ చేయని వైద్యశాఖ ఉన్నతాధికారులు

  • ప్రైవేటు క్లినిక్‌ల్లో ప్రభుత్వ వైద్యులే అధికం

    శ్రీకాకుళం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి):

  • పలాస నియోజకవర్గానికి చెందిన ఒక రోగి ఇటీవల న్యూరాలజిస్టు కోసం శ్రీకాకుళంలోని డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఓపీ టోకెన్‌కు రూ.500 చెల్లించాడు. అక్కడే వైద్యపరీక్షలు చేసుకున్నాడు. స్కాన్‌ కోసం మరో కార్పొరేట్‌ ల్యాబ్‌కు పంపారు. వారం రోజులు తర్వాత మళ్లీ ఆసుపత్రికి వస్తే.. అప్పటికే ఒకసారి మధ్యలో వైద్యసలహాకు వచ్చారని.. ఇప్పుడు చెల్లుబాటుకాదని.. మళ్లీ టోకెన్‌ తీసుకోవాలని సిబ్బంది చెప్పారు. దీంతో మళ్లీ టోకెన్‌ తీసుకుని న్యూరాలజిస్టును సంప్రదించాడు.

    .......................

  • శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ చిన్నారికి ఇటీవల జ్వరం రాగా.. రాత్రివేళ డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లోని చిన్నపిల్లల వైద్యులకు సంబంధించిన ఓ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఎమర్జెన్సీ టోకెన్‌ కింద రూ.వెయ్యి తీసుకున్నారు సిబ్బంది. సాధారణ టోకెన్‌ రూ.600 అని.. అదీ అందుబాటులో లేవని.. ఎమర్జెన్సీ టోకెన్‌ అయితే రెడీగా ఉన్నాయని చెప్పడంతో చేసేదిలేక ఆ తల్లిదండ్రులు తమచిన్నారి కోసం అడిగినంత ఇచ్చారు. అక్కడే వైద్యపరీక్షలు నిర్వహించి.. ఆ ఆసుపత్రిలోనే వేలాది రూపాయల మందులు కూడా కొనుగోలు చేశారు.

    ..................

    .. ఇలా వైద్యం కోసం వెళ్లే రోగుల వద్ద ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు పిండేస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు ఎలా అమలవుతున్నాయి.. అక్కడ వైద్యం.. తీసుకుంటున్న ఫీజులు.. అందిస్తున్న సేవలు.. వైద్యులు, సిబ్బందితోపాటు ల్యాబ్‌ల్లో అర్హత కలిగిన వారే ఉన్నారా? అన్నది ఎవరికీ తెలియదాయె. ఎందుకంటే.. అధికారుల తనిఖీలు లేవు. ప్రైవేటు ఆస్పత్రులు తమ పరిధిలో ఉండవు.. వాటికి నిబంధనలతో సంబంధం లేదు అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు వెలుస్తున్నాయి. రోగుల జబ్బులు.. వారి భయాన్ని డబ్బుగా మార్చుకుంటున్నాయి.

    .................

    శ్రీకాకుళంలో అత్యధికంగా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రిలు ఉన్నాయి. జిల్లాలోని పలాస, సోంపేట, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం తదితర ప్రాంతాలతోపాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది ప్రజలు వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిల సంగతి అలా ఉంచితే.. రోజువారీ ప్రైవేటు ఆసుపత్రిలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రత్యేక వైద్యులు(స్పెషలిస్టులు) అందుబాటులో ఉంటారన్న కారణంతో రోగులు అక్కడకు వెళ్తున్నారు. ఇదే అదనుగా.. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే వైద్యుని ఓపీ ధరను ఇప్పుడు గణనీయంగా పెంచేశారు. వైజాగ్‌తో సమానంగానే శ్రీకాకుళంలోనూ ఓపీ ధరలు వసూలు చేస్తున్నారు. అక్కడ వైద్యానికి.. సౌకర్యాలకు.. ఇక్కడి పరిస్థితులతో పోల్చితే ఎవరివద్ద సమాధానం లేదాయె. శ్రీకాకుళంలో అత్యధిక ప్రైవేటు ఆసుపత్రిల్లో కనిష్ఠంగా రూ. 300 నుంచి రూ.వెయ్యి వరకు ఓపీ ధరలు ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్‌ వైద్యుని ఓపీ అయితే రూ.300 నుంచి రూ.500 వరకు ఉంది. పైగా ఒకసారి రోగిని చూశాక.. మళ్లీ అదే ఫైలు పట్టుకుని ఇతర సమస్యలతో వైద్యుని వద్దకు వస్తే కేవలం పదిరోజుల్లో ఒక్కసారి మాత్రమే అనుమతిస్తున్నారు. మరోసారి ఆసుపత్రికి వస్తే మళ్లీ టోకెన్‌ తీసుకోవాల్సిందే. ఇంకొన్ని ఆసుపత్రిల్లో వారం రోజులే గడువు విధిస్తున్నారు. అలాగే నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్టు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, కార్డియాలజిస్ట్‌ వైద్యుల వద్ద ఓపీ చాలా డిమాండ్‌గా ఉంటోంది. వారి టోకెన్‌లు లభించడమే గగనం అన్నట్లుగా ఉంది.

  • పిల్లల వైద్యులకు డబుల్‌

    రోగం అనేది ఎవరికైనా బాధ ఒకటే. అయితే పిల్లలకు నలత చేస్తే కుటుంబ సభ్యులు మరింత తల్లడిల్లిపోతారు. పిల్లలను అత్యవసరంగా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలంటే.. ఎమర్జెన్సీ టోకెన్‌ కింద ఓపీ ధరకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఏమీచేయలేక.. వైద్యులు అడిగినంత చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని ఆరోగ్య పథకాలు అమల్లోకి తీసుకువచ్చినా.. ఓపీతోపాటు.. సాధారణ వైద్యం.. రక్తపరీక్షలు.. ఇతరత్రా పరీక్షలకు పథకం అమలుకాదన్నది క్షేత్రస్థాయిలో నిజం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిల కంటే మెరుగైన వైద్యం అందుతుందన్న భావనతో పేదలు సైతం ప్రైవేటు ఆసుపత్రిలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో రోజురోజుకీ ప్రైవేటు ఆసుపత్రిలన్నీ కార్పొరేట్‌ ధరలను తలపిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రిల్లో వైద్యుల ఓపీ ధర.. రక్తపరీక్షలకు, స్కానింగ్‌కు చెల్లించాల్సిన ఫీజు.. ఇవేవీ బోర్డులు ప్రకటించడంలేదు. ప్రైవేటు ఆసుపత్రులతో సంబంధం లేదన్నట్లుగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ వ్యవహరిస్తోంది. అసలు ప్రైవేటు ఆసుపత్రిల వ్యవహారం ఏనాడూ బయటపెట్టిన దాఖలాలు లేవు.

  • అక్కడ హాజరు.. ఇక్కడ వైద్యం..

    శ్రీకాకుళంలోని దాదాపు 90 శాతం ప్రైవేటు ఆసుపత్రిల్లో వైద్యులందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నవారే. అందులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌)కు చెందినవారే. ఉదయం అలా సమయానికి వెళ్లి.. ఎఫ్‌ఎల్‌ఆర్‌ఎస్‌లో హాజరు వేసేసి.. మళ్లీ కొద్దిసేపట్లో బయటకు వచ్చేసి.. గంటల తరబడి సొంత క్లినిక్‌లకు అతుక్కుపోతున్నారు. ఓపీ చూసి వెళ్లి మళ్లీ హాజరు వేసి వస్తుండడం నిత్యకృత్యంగా మారింది. నిబంధన ప్రకారం ప్రభుత్వ వైద్యులు డ్యూటీ వేళల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సేవలు అందించాలి. డ్యూటీ ముగిశాక ప్రైవేటు క్లినిక్‌లకు వెళ్లొచ్చు. కానీ సాధారణ వైద్యుల నుంచి.. స్పెషలిస్టుల వరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చెందినవారు పగలు కూడా సొంత క్లినిక్‌లో దర్జాగా ఉంటున్నారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌.. నెలలో ఒకరోజైనా సరే ఉదయం పది గంటల నుంచి కనీసం పది ఆసుపత్రిలు శ్రీకాకుళంలోనే తనిఖీ చేస్తే.. అక్కడ ఉండే ప్రభుత్వ ఆసుపత్రిల ప్రైవేటు క్లినిక్‌ సేవలు బయటపడతాయి. కానీ గతంలో కానీ.. ఇప్పుడు కానీ ఉన్నతాధికారులు ప్రైవేటు ఆసుపత్రిలను తనిఖీ చేసే సాహసం చేయడంలేదు.

  • టెస్టులు.. మందులూ ఆసుపత్రిల్లోనే..

    ప్రైవేటు ఆసుపత్రిల నిర్వాహకులు.. అనుబంధంగా రక్తపరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు.. మందుల షాపులు కూడా పెట్టుకున్నారు. ఆయా ఆసుపత్రిల్లోనే పరీక్షలు నిర్వహించుకోవాలి. అక్కడే వైద్యులు రాసిన మందులను కొనుగోలు చేయాలి. అలా అని వారు రాసే మందులు కూడా ప్రముఖ బ్రాండెడ్‌వి కాదు. అత్యధికం పీడీ కంపెనీలే. వైద్యులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని సెక్షన్‌లతో సహా పోస్టర్లు అన్ని ప్రైవేటు ఆసుపత్రిల్లో ఉన్నాయి కానీ.. సరైన వైద్యం అందకున్నా.. రోగులకు ఇబ్బంది కలిగితే ఫలానావారికి ఫిర్యాదు చేయాలి.. ఫలానా అధికారి వద్దకు సమాచారం తీసుకువెళ్లాలన్న పోస్టర్లు ఎక్కడా లేవు. జిల్లాకేంద్రంలో పేరెన్నిక గల ప్రభుత్వ-ప్రైవేటు వైద్యులు.. ప్రజాప్రతినిధులకు బంధువర్గంలో చేరిపోయారు. దీంతో ప్రభుత్వ విధులకు డుమ్మాకొడుతున్నా.. ప్రజాప్రతినిధులు సైతం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలను ఆకస్మిక తనిఖీ చేసి.. డ్యూటీ వేళల్లో వైద్యులు ఉంటున్నారా.. ప్రైవేటు క్లినిక్‌లకు అతుక్కుపోతున్నారా? అన్న పరిశీలిస్తే పరిస్థితిలో తక్షణమే మార్పు వస్తుంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రాత్రివేళ అయితే.. ఎంతమంది వైద్యులు అందుబాటులో ఉంటున్నారో దేవుడికే ఎరుక. ఇప్పటికైనా ప్రైవేటు ఆసుపత్రిలపై నిఘా పెట్టి.. ఓపీ ధరలను స్థిరీకరించడమే కాకుండా.. రోగుల వద్ద తీసుకుంటున్న ఫీజులకు న్యాయంగా వైద్యం అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అధికారులు నెలకోసారైనా తనిఖీలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా

    జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపైనా నిఘా పెడతాం. ప్రభుత్వ వైద్యుడిగా జీతం తీసుకుంటున్నవారు తప్పనిసరిగా డ్యూటీ వేళల్లో ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే విధులు నిర్వహించాలి. డ్యూటీ ముగిశాక ఎక్కడ ప్రైవేటు వైద్యం చేసుకున్నా అభ్యంతరం లేదు. ఎక్కడైనా ప్రభుత్వ వైద్యులు.. ప్రభుత్వ డ్యూటీ ఎగ్గొట్టి ప్రైవేటు క్లినిక్‌ల్లో ఉన్నట్టు మా దృష్టికి వస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇటువంటి వాటిపై కొద్దిరోజుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.

    - బాలమురళీకృష్ణ, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

Updated Date - Feb 14 , 2025 | 12:12 AM