Share News

Radhasapthami: ఇక రెండు రోజులే!

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:35 PM

Festival అరసవల్లిలో సూర్యనారాయణస్వామి రథసప్తమి వేడుక ఏర్పాట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ సారి రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Radhasapthami: ఇక రెండు రోజులే!
అరసవల్లిలో చదును చేసిన ఆదిత్యుడి ఆలయం ఆవరణ

  • సకాలంలో పనులు పూర్తయ్యేనా?

  • రథసప్తమికి సమీపిస్తున్న గడువు

  • ఇంకా ఖరారు కాని క్యూలైన్ల ఏర్పాట్లు

  • సీసీ కెమెరాలపైనా స్పష్టత కరువు

  • అయోమయంలో ఆలయ అధికారులు

    అరసవల్లి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో సూర్యనారాయణస్వామి రథసప్తమి వేడుక ఏర్పాట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ సారి రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సమయం రెండు రోజులే ఉండడం, కొన్ని పనులు పూర్తికాకపోవడం.. మరోవైపు సమన్వయలోపాలతో ఆలయ అధికారులు అయోమయం చెందుతున్నారు. ఇప్పటికీ చాలా విషయాలు ఖరారు కాలేదని చెబుతున్నారు. ఇంతవరకు క్యూలైన్ల ఏర్పాట్లపై పూర్తి నిర్ణయం ఖరారు కాలేదు. గతంలో ఆలయం తూర్పు వైపున గేటు నుంచి రూ.100 దర్శనం, ఉచిత క్యూలైన్లు, అలాగే మునిసిపల్‌ స్కూలు భవనం పక్క నుంచి ఉచిత క్యూలైన్లలో భక్తులు రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు. వీఐపీ, రూ.500 లైన్లలో భక్తులు స్థానిక పెద్దతోట ముందు నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో దర్శనానికి వచ్చేవారు. ఈ ఏడాది సుమారు 1.20లక్షల మంది భక్తులు రానున్నట్టు అధికారుల అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం ముందు భాగంలోని అన్ని భవనాలు, షెడ్లను పూర్తిగా తొలగించి విశాలంగా తయారుచేశారు. కానీ భక్తులకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంది.

  • దాతలపై నిర్లక్ష్యమా?

    దాతల పాసుల పేరిట ఈ ఏడాది కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సుమారు 1,200 మంది దాతలు ఉండగా.. ఇప్పటివరకు 1,230 మంది పేర్లు నమోదయినట్టు ఆలయ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న దాతలందరూ ఎలా పాసుల కోసం నమోదు చేసుకున్నారో.. ఆలయ సిబ్బందికే తెలియాలి. అలాగే ప్రతీ రూ.లక్ష అందజేసిన దాతలకు గతంలో ఒక్క పాసు ఇచ్చేవారు. ఆ పాసుపై నలుగురికి ఆదిత్యుడి దర్శనాన్ని కల్పించేవారు. ఈ ఏడాది మాత్రం రూ.5లక్షలు ఇచ్చిన వారికి అదీ ఒక్క పాసు మాత్రమే జారీ చేస్తామనడంపై దాతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దాతల సహాయంతో చేపట్టిన నిర్మాణాలను.. ఆలయ అభివృద్ధిలో భాగంగా పూర్తిగా తొలగించారు. కనీసం ఈ విషయం కూడా తమకు తెలియజేయకపోవడం అన్యాయమని దాతలు ఆవేదన చెందుతున్నారు.

  • ఆ చెట్టు ఏం చేసిందో..?

    భక్తులు ఇంద్రపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం అక్కడే ఉన్న రావిచెట్టుకు పూజలు చేసేవారు. అభివృద్ధిలో భాగంగా ఆ చెట్టును కూడా తొలగించేందుకు ప్రయత్నించి, చివరకు సగం కొమ్మలను నరికివేయడంపై భక్తులు ఆవేదనకు గురవుతున్నారు. ఆ చెట్టు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు.

  • సీసీ కెమెరాలు.. ఎక్కడో?

    వేలాదిమంది భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు ఆదిత్యుడి దర్శనానికి వస్తున్నందున భద్రతా ఏర్పాట్ల విషయంలో సీసీ కెమెరాల ఏర్పాటు కీలకం. కానీ సీసీ కెమెరాలను ఏయే పాయింట్లలో ఏర్పాటు చేయాలో ఇప్పటికీ ఖరారు కాలేదు. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులకు, పిల్లలకు, దివ్యాంగులకు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నా... పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని భక్తులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపచేసేలా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని కోరుతున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:35 PM