Inter student: అయ్యో.. నీ భవిష్యత్ కోసమే కదా!
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:05 AM
inter student suside ‘పరీక్షలు దగ్గర పడుతున్నాయి. బాగా చదువుకో. అనవసర తిరుగుళ్లు వద్దు’ అని తల్లిదండ్రులు.. ఇంటర్ చదువుతున్న వారి కుమారుడిని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
చదువుకోవాలని మందలించారని..
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
అయ్యో కన్నా.. నీ బంగారు భవిష్యత్తు కోసమే కదా వారి తపన! నిన్ను ఉన్నత స్థాయిలో చూడాలని వారికుండదా! తాము పడిన కష్టాలు పడకూడదనే కదా నీకు చెప్పింది. అయినా వారేం అన్నారు నిన్ను! బాగా చదువుకోరా? అని కాస్త మందలించారు. ఈమాత్రం దానికే అంత పెద్దశిక్ష విధించుకుంటావా? ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతావా? ఆ ఆలోచన వచ్చినప్పుడు ఒక్క క్షణం.. ఒక్క క్షణం.. ఆలోచించి ఉంటే! ఇంత ఘోరం జరిగేదా? నీపైనే ఆశలు పెట్టుకున్న అమ్మానాన్నకు అండగా ఉండేవాడివి కదా! నువ్వు చేసింది మంచిది కాదురా చిన్నా!
పలాస, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘పరీక్షలు దగ్గర పడుతున్నాయి. బాగా చదువుకో. అనవసర తిరుగుళ్లు వద్దు’ అని తల్లిదండ్రులు.. ఇంటర్ చదువుతున్న వారి కుమారుడిని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత ఈ విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పుట్టెడు శోకంలో మునిగిపోయారు. సీఐ బి.సూర్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పద్మనాభపురం కాలనీకి చెందిన బుడమూరు దుర్గారావు, పాపమ్మ దంపతుల కుమారుడు యశ్వంత్ (17) కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రఽథమ సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజులుగా యశ్వంత్ వివాహాలు, వేడుకలకని ఇంటి వద్ద చెబుతూ బయటకు వెళ్లిపోతున్నాడు. దీంతో పరీక్షలు దగ్గర పడుతున్నాయని, బయట తిరగకుండా బాగా చదువుకోవాలని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యశ్వంత్.. తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఇటుకబట్టీ సమీపంలో ఓ ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. యశ్వంత్ శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లి సాయంత్రం వరకూ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనుమానంతో కళాశాలకు వెళ్లి సంప్రదించగా.. అసలు కాలేజీకే రాలేదని సిబ్బంది చెప్పారు. దీంతో మరింత ఆందోళన చెంది కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు యశ్వంత్ కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. రాత్రి 9.30గంటల సమయంలో కోసంగిపురం రహదారిలో ఇటుకబట్టి సమీపంలో ఉన్న నిర్వాసిత కాలనీలో ఓ ఇంటిపైన ఉరేసుకుని వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వెంటనే కిందకు దించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్ధరాత్రి దాటిన తరువాత మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శనివారం పంచనామా నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఎంతో గారాబంగా పెంచిన ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.