Share News

Offshore: ‘ఆఫ్‌షోర్‌’పై కదలిక

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:54 PM

Offshore works Restart పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద ఆగిపోయిన ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో కదలిక వచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

Offshore: ‘ఆఫ్‌షోర్‌’పై కదలిక
పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద నిలిచిన ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు

  • నేటి నుంచి పనులు పునఃప్రారంభం

  • కాంట్రాక్టర్‌కు రూ.19కోట్ల బకాయి చెల్లించిన కూటమి ప్రభుత్వం

  • పలాస, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద ఆగిపోయిన ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో కదలిక వచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల కూటమి ప్రభుత్వం ఆఫ్‌షోర్‌ పనులకుగానూ రూ.35కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. గత ప్రభుత్వం బకాయి ఉన్న రూ.19కోట్లను కాంట్రాక్టర్‌ ఖాతాకు జమ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి పనులు పునఃప్రారంభించేందుకు కాంట్రాక్టర్‌ సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ఇవి పాత పనులే కావడంతో ఆటంకం లేకుండా పునఃప్రారంభించనున్నారు.

  • దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద మహేంద్రతనయ-ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. రూ.147కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించతలపెట్టగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ అంచనా రూ.900 కోట్లకు పెరిగింది. అంతమొత్తంలో నిధులు వెచ్చించలేక వచ్చిన అన్నీ ప్రభుత్వాలు దీనిపై ఎన్నికల్లో ఓట్ల కోసం వినియోగించుకున్నాయి తప్ప.. పనులు పూర్తి చేయలేకపోయాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ‘ఆఫ్‌షోర్‌’ కోసం దపదఫాలుగా నిధులు కేటాయించి 40 శాతం వరకూ పనులు నిర్వహించింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పనుల ఊసేలేదు. ఈసారి తాము అధికారంలోకి వస్తే.. ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం దీన్ని ఏ విధంగానైనా పూర్తిచేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రూ.35కోట్లు మొదటి విడతగా విడుదల చేసింది. కాలువ , సర్‌ప్లస్‌వియర్‌, స్లూయస్‌, గట్టు ఎత్తుపెంచడం, రిజర్వాయరులో మట్టిని తీసి చదును చేయడం, ఆల్‌ఆంధ్రా రహదారి పూర్తిస్థాయిలో నిర్మించడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తయ్యాయి. దీంతోపాటు ముంపు గ్రామాల ప్రజలను తరలించడంతో పాటు వారికి పునరావాస ప్యాకేజీ పూర్తిస్థాయిలో అందించాల్సి ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయితే ఆఫ్‌షోర్‌ రిజర్వాయరుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. పలాస, టెక్కలిపట్నం వద్ద పునరావస గృహాలు ఇప్పటికే శతశాతం పూర్తయ్యాయి. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయితే పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి మండలాలకు చెందిన మొత్తం 25వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తిగా సాగునీరు, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి తాగునీరు అందించడానికి అవకాశం ఉంది. దీనిపై రైతులతో పాటు స్థానికులు ఎంతో ఆశతో ఉన్నారు.

  • మాది చేతల ప్రభుత్వం

    మాది చేతల ప్రభుత్వం. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. నిధులున్నా గత వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తిచేయకుండా వదిలేసింది. స్థానికంగా ఉన్న మాజీమంత్రి కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే రిజర్వాయర్‌ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించి రూ.35కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాం. రిజర్వాయర్‌ పనులు పూర్తిచేస్తాం. దీంతోపాటు నౌపడ-వెంకటాపురం రహదారికి రూ.48కోట్లు, కాశీబుగ్గ ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి కూడా తొందరలోనే మోక్షం లభిస్తుంది. పనులు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో మేము చూపిస్తాం.

    - గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే

Updated Date - Feb 07 , 2025 | 11:54 PM