Share News

Isuka: ఇసుక మనది.. కాసులు వారివి..

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:40 AM

Sand Scam రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఒడిశా వ్యాపారులకు కాసులు వర్షం కురిపిస్తోంది. జిల్లాలోని రీచ్‌ల్లో ఉచితంగా ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఆ రాష్ట్రానికి అక్రమంగా తరలించుకుపోతున్నారు.

Isuka: ఇసుక మనది.. కాసులు వారివి..
ఆకులతంపర రేవు నుంచి ఇసుకను ఒడిశాకు అక్రమ రవాణా ఇలా..

  • ఒడిశా వ్యాపారుల దందా

  • ఆకులతంపర రేవు నుంచి అక్రమంగా రవాణా

  • రాత్రివేళలో సరిహద్దు దాటిస్తున్న వైనం

  • పట్టించుకోని అధికారులు

    మెళియాపుట్టి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఒడిశా వ్యాపారులకు కాసులు వర్షం కురిపిస్తోంది. జిల్లాలోని రీచ్‌ల్లో ఉచితంగా ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఆ రాష్ట్రానికి అక్రమంగా తరలించుకుపోతున్నారు. వాస్తవానికి ఒడిశాకు సంబంధించి కాశీనగరం వద్ద ఇసుక రీచ్‌కు అనుమతులు ఇచ్చారు. అక్కడ నుంచి ట్రాక్టర్‌తో ఇసుక తరలించాలంటే సీనరేజి, రవాణా వంటి కోసం సుమారు రూ.15వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇసుక వ్యాపారులకు ఏమీ మిగలడం లేదు. అదే సరిహద్దున ఆంధ్రా పరిధిలోని ఉన్న కొత్తూరు మండలం ఆకులతంపర రేవు (కొత్తూరు మండలం) నుంచి ట్రాక్టర్‌ ఇసుకను ఒడిశా సరిహద్దుకు చేర్చేందుకు కేవలం రూ.1500 డీజిల్‌ ఖర్చు అవుతుంది. ఈ ఇసుకను ఒడిశాలో రూ.7,500 నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. టిప్పరు లోడు అయితే రూ.25వేల నుంచి రూ.30వేల వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక ఉచిత కావడంతో ఆకులతంపర రేవు నుంచి అక్రమంగా తరలించుకుపోతున్నారు. పగలు అయితే అధికారులు, పోలీసులు నిఘా ఉంటుందని రాత్రివేళలో రూట్‌ మార్చి దందా సాగిస్తున్నారు. మెళియాపుట్టి వరకు ఆరేడు ట్రాక్టర్లు వచ్చి కొన్ని పాఠశాల రోడ్డు నుంచి బిన్నాళ వైపు, మరి కొన్ని కొసమాళ వీధి నుంచి గురండి వైపు, ఇంకొన్ని చాపర నుంచి మోడాలు వైపు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

  • పట్టుకున్నా.. వదిలేస్తున్నారు..

    ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను కొన్నిసార్లు పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నారు. వారు రూ.2 వేల అపరాధ రుసుం విధించి.. ఇసుక ట్రాక్టర్లను వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పోలీసులు అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొంతమంది అధికారులు ట్రాక్టర్ల యజమానులకు మధ్యవర్తులుగా వ్యవహరించి ఒడిశా వ్యాపారుల నుంచి అధికంగా డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం రాత్రి 10 గంటల తరువాత మెళియాపుట్టి సరిహద్దు దాటి నాలుగు ట్రాక్టర్లు, బుధవారం వేకువజామున 4 గంటలకు మరో రెండు ఇసుక ట్రాక్టర్లు ఒడిశా వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. నిరంతరం ఇసుక అక్రమ రవాణా సాగుతోందని పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇసుకాసురులకు కొంతమంది కూటమి నాయకుల అందడండలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

  • వాహనాలు సీజ్‌ చేస్తాం

    రెండు రోజుల కిందట ఆంధ్రా నుంచి ఒడిశాకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని అపరాధం రుసుం వసూలు చేసి వదిలిపెట్టాం. ఇక నుంచి వాహనాలు పట్టుబడితే సీజ్‌ చేస్తాం.

    - బి.పాపారావు, తహసీల్దార్‌, మెళియాపుట్టి

Updated Date - Feb 03 , 2025 | 12:40 AM