Share News

Medical College: వైద్య కళాశాలలో.. వసతుల్లేవ్‌!

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:14 AM

Student Accommodation శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్‌)లో విద్యార్థులు వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు, నాణ్యమైన ఆహారం, మరుగుదొడ్ల సౌకర్యం లేక.. దుర్భర పరిస్థితుల్లో చదువులు కొనసాగిస్తున్నారు.

Medical College: వైద్య కళాశాలలో.. వసతుల్లేవ్‌!
శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాల

  • కనీసం తాగునీరు లేక అవస్థలు

  • 64 మరుగుదొడ్లకు మూడే వినియోగం

  • విద్యార్థుల పరిస్థితి దయనీయం

  • పట్టించుకోని అధికారులు

  • డీఎంఈ ఆదేశాలు సైతం బేఖాతరు

  • అరసవల్లి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్‌)లో విద్యార్థులు వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు, నాణ్యమైన ఆహారం, మరుగుదొడ్ల సౌకర్యం లేక.. దుర్భర పరిస్థితుల్లో చదువులు కొనసాగిస్తున్నారు. ఈ కళాశాలలో 650 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. అలాగే 150 మంది హౌస్‌సర్జన్లు, 200 మంది పీజీ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా వైద్య కళాశాలలో కనీస వసతులు లేక మనోవేదనకు గురవుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు.

  • సమస్యలెన్నో..

  • వైద్యవిద్యార్థులకు దాహం వేస్తే తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. వాటర్‌ప్లాంట్‌లు పాడై చాలా కాలమైనా పట్టించుకునే నాథులు లేరు. వరండాలో ఏర్పాటు చేసిన క్యాన్‌లలో నీరే దిక్కవుతోంది. కళాశాలతోపాటు హాస్టల్‌లోనూ తాగునీటి వసతిలేకపోవడంతో విద్యార్థులు వాటర్‌ బాటిళ్లతోనే నెట్టుకొస్తున్నారు.

  • కళాశాలలోని మూడు అంతస్తుల్లో ఎక్కడా తాగునీరు కనిపించదు సరికదా.. కనీస అవసరాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు కూడా పనిచేయడం లేదు. కనీసస్థాయిలో మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వైద్య విద్యార్థినులు అయితే.. హాస్టల్‌కు పరిగెత్తాల్సిందే. పరీక్షల సమయంలో మరింత ఇబ్బందులు పడాల్సిందే. మెన్స్‌ హాస్టల్‌లో 64 మరుగుదొడ్లకుగానూ కేవలం మూడు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఉమెన్స్‌ హాస్టల్‌లో 8 మాత్రమే వినియోగానికి అనువుగా ఉన్నాయి. వాటిల్లో కూడా కొన్నింటికి తలుపులు, లైట్లు కూడా లేవు.

  • వైద్య కళాశాల హాస్టల్‌ కొత్త భవనాలకు రంగులేశారు. కానీ విద్యార్థులకు హాస్టల్‌ గదుల్లో సరైన బెడ్స్‌, కుర్చీలు, కనీస వసతులు కూడా కల్పించలేదు. ఏటా సీట్ల సంఖ్యను పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ.. వసతుల కల్పనపై లేదని విద్యార్థులు గుసగుసలాడుకుంటున్నారు.

  • లైట్లు, కుర్చీలు లేకుండానే గ్రంథాలయం..

    విద్యార్థులు చదువుకునేందుకు కళాశాల మొదటి అంతస్తులో సెంట్రల్‌ లైబ్రరీ ఉంది. దీనిలోనే రీడింగ్‌ రూమ్‌ కూడా ఉంటుంది. కానీ గ్రంథాలయంలో కూర్చునేందుకు కుర్చీలు, చదువుకునేందుకు సరిపడా బల్లలు లేవు. ఫ్యాన్లు తిరగవు. లైట్లు కూడా సక్రమంగా వెలగవు. గ్రంథాలయం పరిసరాల్లో కూడా లైట్లు లేకపోవడంతో విద్యార్థినులు రాత్రివేళల్లో హాస్టల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారు. హాస్టల్‌లోని మూడు బాత్‌రూమ్‌ల్లో కూడా లైట్లు వెలగడం లేదని పేర్కొంటున్నారు. హాస్టల్‌ గదుల్లోకి తరచూ పాములు, ఎలుకలు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల నుంచి అభివృద్ధి నిధులు పేరిట వసూలు చేసిన డబ్బులు రూ.లక్షల్లో ఉన్నా.. వాటిని వినియోగించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

  • పీజీ విద్యార్థులకు హాస్టలేదీ?

    వైద్య కళాశాలలో పీజీ విద్యార్థులకు హాస్టల్‌ సదుపాయం లేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌)లో 30రూమ్‌లను వారికి తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన కేటాయించారు. వీటిలో నాలుగు రూమ్‌లను ఆస్పత్రి అధికారులు.. తమ బంధువుల కోసం వినియోగిస్తున్నారు. దీంతో చాలామంది పీజీ విద్యార్థులు బయట రూమ్‌లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొత్త భవనాలు అందుబాటులోకి వస్తున్నాయని, సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని, గత మూడేళ్లుగా అధికారులు చెబుతూనే ఉన్నారు. ఈ ఏడాది 19 విభాగాలకు సంబంధించి సుమారు మరో 100 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరనున్నారు. మరి వారి పరిస్థితి ఏంటో అధికారులకే తెలియాలి.

  • హాస్టల్‌ వార్డెన్‌ బంధువే.. ఫుడ్‌ కాంట్రాక్టర్‌

    హాస్టల్‌ మెస్‌లో వైద్య విద్యార్థులకు అందించే ఆహారం సరిగా ఉండడం లేదు. హాస్టల్‌ వార్డెన్‌ బంధువే.. ఫుడ్‌ కాంట్రాక్టర్‌. దీంతో ఆహారం నాణ్యతపై ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే.. వార్డెన్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తామని బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే హాస్టల్‌ మెస్‌ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని.. బలవంతంగా మెస్‌ బిల్లులు కట్టిస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బయట తినేందుకు కూడా తమకు స్వేచ్ఛ లేదని, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో చదువు కొనసాగేదెలా? అని వారు వాపోతున్నారు.

  • డీఎంఈ ఆదేశాలిచ్చినా..

    వైద్య కళాశాల, హాస్టల్‌లో విద్యార్థులకు వసతుల కల్పనపై డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఇటీవల ఆదేశాలు వచ్చినా సరే సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాత్రివేళల్లో వైద్యవిద్యార్థినుల కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

  • చర్యలు తీసుకుంటున్నాం

    వైద్య విద్యార్థుల హాస్టల్‌, కళాశాలలో వసతులకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇంజనీరింగ్‌ అధికారులకు చెప్పాం. కొత్త హాస్టల్‌కు సంబంధించి రానున్న రెండు నెలల్లో ఫర్నీచర్‌ను సమకూర్చి విద్యార్థులకు అందజేస్తాం. హాస్టల్‌లో విద్యార్థులు మెస్‌ రన్‌ చేసుకుంటున్నారు. విద్యార్థులు కోరితే ఫుడ్‌ కాంట్రాక్టర్‌ను మార్చడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

    - డా.రవి వెంకటాచలం, ప్రిన్సిపాల్‌, జీజీహెచ్‌(రిమ్స్‌) కళాశాల

Updated Date - Feb 15 , 2025 | 12:14 AM