schools menu: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ
ABN , Publish Date - Feb 28 , 2025 | 11:51 PM
Midday meal scheme ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరింత నాణ్యంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ శనివారం నుంచి కొత్త మెనూ అమలు చేయనుంది.
నేటి నుంచి అమలు
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చేలా మార్పులు
ఇచ్ఛాపురం/ సంతబొమ్మాళి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరింత నాణ్యంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ శనివారం నుంచి కొత్త మెనూ అమలు చేయనుంది. ప్రతి జిల్లాలో వంటకాలు, విద్యార్థుల అభిరుచులు, పోషకాలకు పెద్దపీట వేస్తూ జాబితాను సిద్ధం చేసింది. మొత్తం నాలుగు జోన్లుగా విడదీసింది. జోన్-1లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలను చేర్చింది. ఈ జిల్లాల్లో ఒకటే మెనూ అమలుచేయనుంది. గతంలో రాష్ట్రం మొత్తం ఒకే మెనూ అమల్లో ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మెనూలో మార్పులు చేసింది. కిచిడీ, సాంబారు బాత్‌పై పిల్లలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో రక్తహీనత, కంటిచూపు వంటి అనారోగ్య సమస్యలున్నట్టు తేలింది. దీంతో కూటమి ప్రభుత్వం విద్యార్థులు నివసించే ప్రాంతాలకు అనుగుణంగా ఆహార పదార్థాలతో మెనూ రూపొందించి అమలు చేయనుంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 1,895 ప్రభుత్వ ప్రాథమిక, 332 ప్రాథమికోన్నత, 334 ఉన్నత పాఠశాలలు మొత్తం 2,561 ఉన్నాయి. వీటిలో 1,54774 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ‘జగనన్న గోరుముద్ద’ పేరిట మధ్యాహ్న భోజనం పథకం మెనూ మార్చినట్టు చెప్పినా.. విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయాలేవీ తీసుకోలేదు. దీంతో ఆహారం రుచికరంగా లేకపోవడంతో చాలామంది విద్యార్థులు తినకుండానే అన్నాన్ని చెత్తడబ్బాల్లో పడేసేవారు. తద్వారా ఎక్కువ మంది విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం వెలుగు చూసింది. కంటిచూపు తగ్గడం, రక్తహీనత వంటివి వెలుగులోకి వచ్చాయి. అందుకే మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, పిల్లల్లో పౌష్ఠికాహారాన్ని లోపాన్ని సరిదిద్దేందుకు కొత్త మెనూ రూపొందించింది.
కొత్త మెనూ ఇలా..
సోమవారం అన్నం, ఆకుకూర, పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
మంగళవారం అన్నం, గుడ్డు కూర, రసం, రాగిజావ
బుధవారం వెజ్ పలావ్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
గురువారం అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ
శుక్రవారం పులిహోర, గొంగూర, కూరగాయల చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
శనివారం అన్నం, కూరగాయల కర్రీ, రసం, రాగిజావ, తియ్యని పొంగల్ పెడతారు.
మెనూ మారింది
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం మెనూను ప్రభుత్వం మార్చింది. విద్యార్థుల ఆరోగ్యం, బలవర్థక ఆహారం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని నాలుగు జోన్లుగా విడదీశారు. ఒక్కోజోన్‌లో స్థానికతకు అనుకూలంగా ఉన్న మెనూను కేటాయించారు. జిల్లాలోని 360 పాఠశాలల ఆవరణలో పండించిన కూరగాయలను వినియోగిస్తున్నాం. శ్రీకాకుళం, గార, ఆమదాలవలసలోని 309 పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా 20,508 మంది విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు. వంట ఏజెన్సీ నిర్వాహకులకు విజయవాడలో ప్రత్యేక శిక్షణ ఇచ్చాం.
- తిరుమల చైతన్య, డీఈవో, శ్రీకాకుళం