Share News

వేధింపులు తాళలేకే హత్య

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:49 PM

నగరంలో రెండు రోజుల కిందట ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో టూ టౌన్‌ పోలీ సులు కేసు న మోదు చేశారు.

వేధింపులు తాళలేకే హత్య
విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): నగరంలో రెండు రోజుల కిందట ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో టూ టౌన్‌ పోలీ సులు కేసు న మోదు చేశారు. విచారణలో అది హత్యగా నిర్ధారణ కావడంతో నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం సబ్‌ డివిజనల్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ సీ హెచ్‌ వివేకానంద ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని ఆర్టీసీ బస్సు గ్యారేజ్‌ పక్కన శివాలయం వెనుక గల టీ ఏజెంట్‌ వీధికి చెందిన మజ్జి రమేష్‌(35)తో ఒడిశా రాష్ట్రం రాయఘడ సమీపాన డుకుం గ్రామానికి చెందిన శశి అనే మహిళతో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరి పిల్లలు ఉన్నారు. స్ర్కాప్‌ షాపులో పని చేస్తు రమేష్‌ మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ వేధించడంతోపాటు తీవ్రంగా కొట్టేవాడు. ఈ క్రమంలో ఆమె పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీరిద్దరికి పోలీసులు, పెద్దలు పలుమార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురం కొనసాగించేలా చేశారు. అయినా రమేష్‌లో మార్పు రాలేదు. దీంతో ఈ నెల 3న శశి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రమేష్‌ పోలీసులను ఆశ్రయించడంతో మళ్లీ ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురానికి పంపించారు. ఇదిలావుంటే శశి నగరం లోని ఓ హోటల్‌లో పనిచేస్తోంది. ఈమె పరిస్థితిని చూసి ఆ హోటల్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి ఆమెకు సాయం చేస్తుండేవాడు. ఇది తెలుసుకున్న రమేష్‌ భార్యను అనుమానిస్తూ చిత్రహింసలు పెట్టేవాడు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీ ఉదయం రమేష్‌ బియ్యం తెచ్చేందుకు హడ్కో కాలనీలో నివాసం ఉంటున్న తన తల్లి విజయమ్మ వద్దకు వెళ్లాడు. పూటుగా మద్యం తాగి మరికొంత ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ సమయంలో కూడా భార్యతో పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్లీ పంది గంటల సమయంలో భార్యతో గొడవకు దిగాడు. దీంతో శశి తన ఒంటిపై ఉన్న చున్నీ రమేష్‌ మెడకు వేసి గట్టిగా లాగడంతో అతడు ఊపిరాడక చనిపోయాడు.
హత్యను కప్పిపుచ్చే యత్నం..
రమేష్‌ మరణించడంతో దీనిని కప్పి పుచ్చేందుకు ఇంటి పెరటి తలుపులు తీసి మధ్యాహ్నం 12 గంటల సమయంతో హడ్కో కాలనీలో ఉన్న అత్త మజ్జి విజయమ్మ దగ్గరకు శశి వెళ్లింది. నీ కొడుకు తలుపులు తీయడం లేదని రమ్మని పిలిచింది. ఇదంతా తెలియని విజయమ్మ తన కోడలిని భోజనం చేయమని, తిన్నాక వెళ్దామని చెప్పింది. భర్తను చంపేసానన్న అనుమానం రాకుండా ఉండేందుకు అత్తతో పాటు భోజనం చేసి ఇంటికి వెళ్లారు. ఎంత సేపటికి తలుపులు కొట్టిన తీయకపోవడంతో పెరటి నుంచి వెళ్లి చూడగా తలుపులు తీసి ఉండడంతో లోపలికి వెళ్లి చూసి హాల్‌లో రమేష్‌ విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించారు. ఏం జరిగిందని కోడలిని అడుగగా తనకు తెలియదని ఆత్మహత్య చేసుకున్నాడేమో అని చెప్పడంతో.. విజయ మ్మ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో కోడలు శశిపై అనుమానం వ్యక్తం చేయడంతో సీఐ పి.ఈశ్వరరావు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే చంపేసినట్టు శశి ఒప్పుకుంది. నిత్యం వేధించడంతోపాటు తమ మధ్య ఆ రోజు పెద్ద గొడవ జరగడంతో తనను చంపేస్తాడేమోన్న భయంతో చున్నీ అతడి మెడలో వేసి గట్టిగా లాగడంతో చనిపోయాడని చెప్పింది. హత్య కేసుగా నమోదు చేసి శశి కోర్టుకి తరలించారు. ఈ కేసును ఛేదించిన టూటౌన్‌ సీఐ పి.ఈశ్వరరావు, హెచ్‌సీ శివాజి, పీసీ రమేష్‌లను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినం దించారు.

Updated Date - Feb 26 , 2025 | 11:49 PM