Share News

Mahashivratri మహాశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరం

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:50 PM

Mahashivratri శ్రీముఖలింగంలో ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆలయంతో పాటు గ్రామంలోని పలు వీధుల్లో విద్యుద్దీపకాంతులు ఏర్పాటు చేయడంతో శోభాయమానంగా ఉన్నాయి.

Mahashivratri  మహాశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరం
విద్యుత్‌ వెలుగుల మధ్య పార్వతీ పరమేశ్వరుల తిరువీధి

100 మంది కార్మికులతో పారిశుధ్య పనులు

ముఖలింగేశ్వరుని ఆలయం శోభాయమానం

400 మంది పోలీసులతో బందోబస్తు

జలుమూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆలయంతో పాటు గ్రామంలోని పలు వీధుల్లో విద్యుద్దీపకాంతులు ఏర్పాటు చేయడంతో శోభాయమానంగా ఉన్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 100 మంది పారిశుధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నట్లు డీఎల్పీవో ఐవీ రమణ తెలిపారు. ఈ మేరకు పారిశుధ్య పనులను సోమవారం పరిశీలించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వీధు ల్లోనూ శాని టేషన్‌ పనులు నిరంతరం చేయించనున్నామన్నారు. కొమనాపల్లి నుంచి కరకవలస వరకు రోడ్డు కిరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.అప్పలనాయుడు, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి గోవిందరావు, సర్పంచ్‌ తమ్మన్నగారి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఉచిత, ప్రత్యేక దర్శనాలకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తు న్నట్లు ఆలయ ఈవో ప్రభాకరరావు తెలిపారు. తాగునీటి సదుపాయంతో పాటు ఎండ తగలకుండా షామియానాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక దర్శనానికి రూ.20 ధర నిర్ణయించామ న్నారు. భక్తులకు దక్షిణ ద్వారం వద్ద ఉచిత ప్రసాదం పులిహోర పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

శ్రీముఖలింగంలో 3 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పటిష్ఠ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవాల్లో బందోబస్తు నిర్వహణకు డీఎస్పీ పర్యవేక్షణలో ఏడుగురు సీఐలు, 19 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసులు, 200 మంది హోం గార్డులను ఉన్నతాధికారులు నియమించారన్నారు. ఉత్సవాల చివరిరోజు శుక్రవారం వంశధార నదిలో జరిగే స్వామి వారి చక్రతీర్థ స్నానాలకు అదనంగా 50 రోప్‌ పార్టీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్సవాల పర్యవేక్షణకు 25 సీసీ కెమెరాలను ఆలయం ఎదుట, గ్రామంలో వివిధ ప్రాంతా ల్లో ఏర్పాటు చేశామన్నారు. ద్విచక్ర వాహనాలకు, ఫోర్‌ వీలర్లు, ఆటోలు, బస్సులకు వేర్వేరుగా పార్కింగ్‌ స్థలాలను కేటాయించామన్నారు.

ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మాఘ బహుళ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం ప్రత్యేక పల్లకిలో వేంచేపు చేసి తిరువీధి ఉత్సవం చేపట్టారు. భక్తులు మంగళ హారతులిచ్చి స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఈవో పి.ప్రభాకరరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:50 PM