Share News

Rathasaptami: వైభవంగా ‘రథసప్తమి’ నిర్వహిద్దాం

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:58 PM

Rathasaptami celebration అరసవల్లిలో శ్రీసూర్యభగవానుడి ‘రథసప్తమి’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిద్దామని కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Rathasaptami: వైభవంగా ‘రథసప్తమి’ నిర్వహిద్దాం
ఇంద్ర పుష్కరిణి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, అధికారులు

  • పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

    శ్రీకాకుళం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో శ్రీసూర్యభగవానుడి ‘రథసప్తమి’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిద్దామని కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో.. పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 4 నుంచి మూడు రోజులపాటు రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం అరసవల్లిలో ఆలయ ప్రాంగణాన్ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి మంత్రులు సందర్శించారు. ఇంద్ర పుష్కరిణి, క్యూలైన్లు, మాఢవీదులను పరిశీలించారు. రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే ఆలయ ఆవరణలో తొలగించాల్సిన కట్టడాలకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో మాదిరిగా భక్తులు వేచి ఉండేందుకు గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక ఆకర్షణగా మూడురోజుల పాటు శ్రీకాకుళంలో హెలీకాఫ్టర్‌ చక్కెర్లు కొడుతుందని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యానికి తావులేకుండా సమష్టిగా అన్ని శాఖలు పనిచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఏర్పాట్లలో భాగంగా దుకాణాలు తొలగించడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విన్నవించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని.. ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

  • ప్రతి భక్తుడికీ దర్శనం కల్పించాలి

    రథసప్తమి వేడుకల్లో ప్రతి భక్తుడికీ ఆదిత్యుడి దర్శనం కల్పించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదేశించారు. అధికారులతో సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘రథసప్తమి వేడుకలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి. ప్రతి భక్తుడికీ సులభతర దర్శనం లభించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పోలీసు బందోబస్తు, పారిశుద్ధ నిర్వహణ, భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు.. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల’ని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ రథసప్తమికి సమాయత్తం అవుతున్నామని తెలిపారు. డోనర్‌ పాస్‌ ఉన్న వారికి ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించామని వెల్లడించారు. పాస్‌లు కలిగి ఉన్న వారంతా ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. శ్రీకాకుళం నగరానికి చెందిన భక్తులు సాయంత్రం సమయంలో దర్శనాలకు వచ్చేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు. తద్వారా ఒకే సమయంలో వచ్చే రద్దీని నియంత్రించి దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భద్రాజీ, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, దేవదాయశాఖ అధికారులు, టీడీపీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:58 PM