encroachment: ఎవరైతే మాకేంటి?
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:09 AM
Land occupation టెక్కలిలోని జగతిమెట్ట సమీపాన ఇళ్ల కాలనీ లేఅవుట్ అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఆక్రమణదారులు బరితెగించి ‘ఎవరైతే మాకేంటీ.. ఈ సైటు మాదే’ అంటూ ఖాళీ స్థలాలు కబ్జాకు పాల్పడుతున్నారు.

జగతిమెట్ట కాలనీలో ఖాళీ స్థలాలు ఆక్రమణ
టెక్కలి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని జగతిమెట్ట సమీపాన ఇళ్ల కాలనీ లేఅవుట్ అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఆక్రమణదారులు బరితెగించి ‘ఎవరైతే మాకేంటీ.. ఈ సైటు మాదే’ అంటూ ఖాళీ స్థలాలు కబ్జాకు పాల్పడుతున్నారు. ఓ వైపు రెవెన్యూ అధికారులు కాలనీ స్థలాల ఆక్రమణపై విచారణ చేస్తుండగా.. మరోవైపు బుధవారం రాత్రికిరాత్రే కొంతమంది అక్రమార్కులు ఖాళీ స్థలాలను చదును చేసి.. స్తంభాలు పాతి ఆక్రమణకు పాల్పడడం చర్చనీయాంశమవుతోంది. గతంలో రెవెన్యూ అధికారులు జగతిమెట్ట కాలనీ లేఅవుట్‌లో 335 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు కేటాయించారు. కాగా 55 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన 280 పట్టాలకు సంబంధించిన లే అవుట్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా ఖాళీ స్థలాలు, నిర్మాణాల్లో.. ‘ఇది ప్రభుత్వ జాగా, ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. గతంలో అక్రమాలకు సహకరించిన అధికారులను సైతం విచారణ చేస్తున్నారు. అయినా ఆక్రమణలు కొనసాగుతుండడం గమనార్హం. కాగా.. అధికారుల విచారణ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఇళ్ల కాలనీ లేఅవుట్లలో తప్పిదాలకు పాల్పడిన కొందరు వైసీపీ నాయకుల గుండెల్లో అలజడి రేగుతోంది. ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా దీనిపై టెక్కలి ఉప తహసీల్దార్ ఎస్.రవికుమార్‌కు దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.