Share News

Railway division: ఇచ్ఛాపురానికి షాక్‌!

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:26 AM

Visakhapatnam Railway Zone ఇచ్ఛాపురం ప్రాంతానికి రైల్వేశాఖ మరోసారి షాక్‌ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త రైల్వేజోన్‌ను పలాస వరకే పరిమితం చేసింది. ఇందులో ఇచ్ఛాపురానికి చోటు కల్పించలేదు. దీంతో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ 49 కిలోమీటర్ల మేర స్టేషన్లు భువనేశ్వర్‌ కేంద్రంగా నడిచే ఈస్టుకోస్టు రైల్వేజోన్‌లోనే కొనసాగనున్నాయి. కొత్త జోన్‌లో ఇచ్ఛాపురానికి చోటుదక్కకపోవడంపై ఈ ప్రాంతీయుల్లో ఆవేదన వ్యక్తమమవుతోంది.

Railway division: ఇచ్ఛాపురానికి షాక్‌!
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌

  • విశాఖ రైల్వేజోన్‌లో దక్కని చోటు

  • ఈ ప్రాంతీయుల్లో ఆవేదన

  • ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం ప్రాంతానికి రైల్వేశాఖ మరోసారి షాక్‌ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త రైల్వేజోన్‌ను పలాస వరకే పరిమితం చేసింది. ఇందులో ఇచ్ఛాపురానికి చోటు కల్పించలేదు. దీంతో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ 49 కిలోమీటర్ల మేర స్టేషన్లు భువనేశ్వర్‌ కేంద్రంగా నడిచే ఈస్టుకోస్టు రైల్వేజోన్‌లోనే కొనసాగనున్నాయి. కొత్త జోన్‌లో ఇచ్ఛాపురానికి చోటుదక్కకపోవడంపై ఈ ప్రాంతీయుల్లో ఆవేదన వ్యక్తమమవుతోంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జోన్‌కు.. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌గా నామకరణం చేశారు. ఇప్పటివరకూ కొనసాగుతున్న వాల్తేరు రైల్వేడివిజన్‌ను విశాఖ డివిజన్‌గా మార్చారు. దాని పరిధిని 410 కిలోమీటర్లుగా విస్తరించారు. అయితే ఇప్పటివరకూ మన జిల్లాలో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లు ఈస్టుకోస్టు రైల్వే డివిజన్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు విశాఖ నుంచి పలాస వరకూ అన్ని రైల్వేస్టేషన్లు విశాఖ డివిజన్‌లో చేర్చారు. అలాగే కొత్తగా విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ రైల్వేడివిజన్లు చేరనున్నాయి. ఈ లెక్కన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి పలాస వరకూ స్టేషన్లు ఈస్టుకోస్టు రైల్వే డివిజన్‌లో ఉండిపోనున్నాయి. దీనిపై ఈ ప్రాంతీయులు పెదవివిరుస్తున్నారు. విశాఖలో కొత్తగా ఏర్పాటైన డివిజన్‌తో పాటు జోన్‌లో చేర్చితేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఇక నుంచి ప్రత్యేక రైళ్లతో పాటు వసతులు పలాస వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది. అటు ఈస్టుకోస్టు రైల్వేజన్‌ భువనేశ్వర్‌ కేంద్రంగా ఉండడంతో.. ఒడిశాలోని బరంపూర్‌ రైల్వేస్టేషన్‌ వరకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. దీంతో ఇచ్ఛాపురం, సోంపేట, మందస వంటి స్టేషన్లు రెండు జోన్ల మధ్య వివక్షకు గురయ్యే అవకాశముంది. అందుకే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవచూపాలని ఇచ్ఛాపురం ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ డివిజన్‌తో పాటు దక్షిణ కోస్తా జోన్‌లో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ స్టేషన్లను చేర్చాలని కోరుతున్నారు. నౌపడ నుంచి పర్లాకిమిడి మార్గాన్ని విశాఖ డివిజన్‌తో పాటు జోన్‌లో చేర్చారు. కానీ పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ మాత్రం అలానే ఉంచేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • ఇది దారుణం

  • పలాస వరకూ విశాఖ రైల్వేడివిజన్‌, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్‌లో కలిపి.. ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని విస్మరించడం దారుణం. అటు నౌపడ నుంచి పర్లాకిమిడి వరకూ చేర్చారు. కానీ పలాస నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్ఛాపురాన్ని మాత్రం మరిచిపోయారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? తక్షణం ప్రజాప్రతినిధులు స్పందించి ఇచ్ఛాపురం వరకూ స్టేషన్లను విశాఖ రైల్వే డివిజన్‌లో కలపాలి.

    - కట్టా సూర్యప్రకాష్‌...డీఆర్‌యూసీసీ మెంబర్‌, ఇచ్ఛాపురం

    ....................

  • బాధాకరం

    ఇప్పటికే ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ అన్నివిధాలా వివక్షకు గురైంది. ప్రధాన రైళ్లు ఆగడం లేదు. ఇప్పుడు రైల్వే డివిజన్‌లో సైతం చోటు కల్పించకపోవడం దారుణం. రెండేళ్ల కిందట రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కానీ ఇంతవరకూ పనులు చేపట్టడం లేదు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించాలి. విశాఖ రెల్వే డివిజన్‌లో చేర్చాలి. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ నుంచి అత్యదిక ఆదాయం వస్తున్నా ఈ స్టేషన్‌పై వివక్ష చూపటం అత్యంత బాధాకరం.

    - ఎస్‌.విశ్వనాథం, హైకోర్టు న్యాయవాది, ఇచ్ఛాపురం

Updated Date - Feb 07 , 2025 | 12:26 AM