Cell towers: గిరి శిఖరాల్లో.. హలో.. హలో!
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:20 AM
Cell towers: గిరిజన గ్రామాలకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముందుగా రహదారులు నిర్మించింది. సాంకేతికంగా కూడా గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

కొండలపై గ్రామాల్లో సెల్‌టవర్లు
తీరనున్న మొబైల్ సిగ్నల్ సమస్యలు
మెళియాపుట్టి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాలకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముందుగా రహదారులు నిర్మించింది. సాంకేతికంగా కూడా గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. సిగ్నల్ సమస్యలు లేకుండా కొండలపై గ్రామాల్లో సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలని భావించారు. దీనిపై ఇటీవల కేంద్రానికి నివేదిక పంపారు. దీంతో కొండలపై ఉన్న గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్ కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మండలాల వారీ పరిశీలిస్తే.. సీతంపేటలో 42, మెళియాపుట్టిలో 15, నందిగాంలో 4, భామిని, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, మందస, టెక్కలి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 67 టవర్లు మంజూరు చేశారు. అధికంగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. వీటి ఏర్పాటు పూర్తయిందని, పీఎం నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తారని వెల్లడించారు. కాగా.. గతంలో నెట్‌వర్క్ లేక సాంకేతిక సమస్యతో అధికారులు ఇబ్బందులు పడేవారు. పింఛన్లు, రేషన్ కావాలంటే లబ్ధిదారులు కొండపై నుంచి ఆపసోపాలు పడి కిందకు దిగివచ్చి తీసుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తుండడంతో ఇకపై తమకు ఇబ్బందులు తప్పనున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.