Share News

Illegal construction: అతను మా బంధువు.. అందుకే తొలగించం!

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:02 AM

Illegal construction of bridge సంతబొమ్మాళి పంచాయతీ జగన్నాఽథపురం (రెయ్యపేట)లో కొన్నాళ్ల కిందట ఓ రియల్టర్‌ అనుమతి లేకుండా లేఅవుట్‌ వేశాడు. ఈ లేఅవుట్‌కు వెళ్లేందుకు దారి లేకపోవడంతో పక్కనే ఉన్న వంశధార కాలువపై అక్రమంగా వంతెన కట్టేశాడు.

Illegal construction: అతను మా బంధువు.. అందుకే తొలగించం!
వంశధార కాలువపై అక్రమంగా నిర్మించిన వంతెన

  • సాగునీటి కాలువపై అక్రమంగా వంతెన నిర్మాణం

  • ‘రియల్‌’ వ్యాపారులకు కొందరు అధికారుల అండ

  • ఓ ఇంజనీరుతో బంధుత్వం ఉండడమే కారణం!

  • రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం

    సంతబొమ్మాళి, జనవరి 6(ఆంధ్రజ్యోతి):

  • ఓ రియల్టర్‌ వంశధార కాలువపై అక్రమంగా వంతెన నిర్మించారు. దీనివల్ల తాము నష్టపోతామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతెన అధికారులకు తొలగించాలని ఫిర్యాదు చేశారు. ఐదు నెలలు గడిచిపోయాయి. అయినా చర్యల్లేవు. అధికారులు నోటీసులతోనే సరిపెట్టారు. కారణం ఓ ఇంజనీరుతో సంబంధిత రియల్టర్‌ ఉన్న బంధుత్వమే కారణమని తెలుస్తోంది.

  • సంతబొమ్మాళి పంచాయతీ జగన్నాఽథపురం (రెయ్యపేట)లో కొన్నాళ్ల కిందట ఓ రియల్టర్‌ అనుమతి లేకుండా లేఅవుట్‌ వేశాడు. ఈ లేఅవుట్‌కు వెళ్లేందుకు దారి లేకపోవడంతో పక్కనే ఉన్న వంశధార కాలువపై అక్రమంగా వంతెన కట్టేశాడు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, టెక్కలి, మెళియాపుట్టి, నందిగాం, పాతపట్నం, సారవకోట మండలాల నుంచి కాకరాపల్లి వరకూ ఈ కాలువ ద్వారా పొలాలకు సాగునీరు అందుతుంది. అక్కడి నుంచి నీరు సముద్రంలో కలుస్తుంది. అటువంటి కాలువపై అధికారుల అనుమతి లేకుండా కాంక్రీట్‌ వంతెన నిర్మించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రియల్‌ దందాపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. రెవెన్యూ, వంశధార అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. వంశధార శాఖకు చెందిన స్థలంలోనే రియల్టర్‌ అక్రమంగా కాలువపై వంతెన కట్టేశారని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీనిపై అప్పటి తహసీల్దార్‌ ప్రవీణ్‌.. వంశధార శాఖకు నివేదిక పంపారు. అయితే వంశధార శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వంతెన కట్టారని తేల్చినా.. ఇంతవరకు సంబంధిత అధికారులు రియల్టర్‌పై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్టర్‌కు వంశధార శాఖకు చెందిన ఓ ఇంజనీర్‌తో బంధుత్వం ఉండడం వల్లే ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వంశధార కాలువపై అక్రమ వంతెన నిర్మాణం వల్ల.. వర్షాల సమయంలో వరద నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి పంట పొలాలకు ముంపు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షాలకే డీపీఎన్‌ రోడ్డులో పాలేశ్వరస్వామి ఆలయం నుంచి రెయ్యపేట వరకూ వరదనీరు ముంచెత్తే సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. అధికారులు స్పందించి కాలువపై అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై నరసన్నపేట సర్కిల్‌ వంశధార ఈఈ ప్రదీప్‌ వద్ద ప్రస్తావించగా.. కాలువపై అక్రమంగా వంతెన నిర్మించిన రియల్టర్‌కు నోటీసులు జారీచేస్తామని తెలిపారు. అనంతరం అక్రమ వంతెన తొలగిస్తామన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:03 AM