కష్టాల చదువులు!
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:31 PM
మెళియాపుట్టి మండలం వెంకటాపురం పంచాయతీలోని అడ్డివాడ గ్రామం కొండపై ఉంది. గతంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విలీనం పేరుతో మూసేశారు.

-గిరిజన బిడ్డలు కిలోమీటర్లు నడవాల్సిందే
విలీనం పేరిట పాఠశాలల మూత
-గత వైసీపీ ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు
-సమస్యల పరిష్కారంపై కూటమి సర్కార్ దృష్టి
-మూతపడిన బడులు తెరిపిస్తామని భరోసా
మెళియాపుట్టి, మార్చి 5(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం వెంకటాపురం పంచాయతీలోని అడ్డివాడ గ్రామం కొండపై ఉంది. గతంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విలీనం పేరుతో మూసేశారు. దీంతో ఈ గ్రామంలో ఉన్న 11మంది గిరిజన విద్యార్థులు టెక్కలి మండలం నర్సింగపల్లి పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ మూడు కిలోమీటర్లు కొండలు దిగి, మరో రెండు కిలోమీటర్లు పల్లం ప్రాంతంలో నడిచి నర్సింగపల్లిలో పాఠశాలకు చేరుకుంటున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు.
మెళియాపుట్టి మండలం చీపురుపల్లి పంచాయతీ దాసుపురంలోని ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్వాసిత గ్రామం. ఏడేళ్ల కిందట ఈ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని నిర్వాసిత కాలనీలో ఇళ్లు నిర్మించారు. కానీ పాఠశాల నిర్మించలేదు. దీంతో పాత గ్రామంలోనే పాఠశాల కొనసాగుతోంది. రోజూ మూడు కిలోమీటర్లు నడిచి.. గెడ్డలు, వాగులు దాటుకుని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
మెళియాపుట్టి మండలం దబ్బగుడ్డి గ్రామంలో సుమారు 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గ్రామంలో పాఠశాల లేక పోవడంతో ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడిచి పెద్దకేదారి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామానికి సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు. (3 ఎంఎల్‌పి 3)
11111111111111111111111111
ఆంగ్ల విద్య పేరుతో గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో పలు పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 105 జీపీఎస్ పాఠశాలలు ఉండేవి. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో సుమారు 30 పాఠశాలలను విలీనం చేశారు. దీంతో కొంతమంది విద్యార్థులు సమీప దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక చదువుకు దూరమయ్యారు. మరికొంతమంది విద్యార్థులను రోజూ పాఠశాలకు తీసుకెళ్లి తెచ్చేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గతంలో మూతపడిన పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెరిపిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీంతో గిరిజనులు సంతోష పడుతున్నారు.
ఉన్నవి వదిలేశారు:
వైసీపీ ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకం కింద కొన్ని జిల్లాపరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు రెండు విడతలుగా నిధులు వెచ్చించి.. అభివృద్ధి పనులు చేపట్టింది. మూడో విడత కింద జీపీఎస్ పాఠశాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పింది. కానీ పైసా కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో చాలా పాఠశాలల్లో పెచ్చులూడుతున్న శ్లాబ్, అధ్వానంగా గచ్చులు దర్శనమిస్తున్నాయి.
- మెళియాపుట్టి మండలం అడ్డివాడ గ్రామంలో నిధులు మంజూరు చేసినా పదేళ్ల నుంచి పాఠశాల భవనం పూర్తికావడం లేదు. ఇంతలో విలీనం పేరుతో పాఠశాలను ఇతర గ్రామానికి తరలించడంతో నిర్మాణ పనులు అర్థాంతరంగా వదిలేశారు. ప్రస్తుతం మొండిగోడలే దర్శనమిస్తున్నాయి.
- చందనగిరిలో పాఠశాల లేక గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్మించిన భవనంలోనే చదువులు సాగిస్తున్నారు. అలాగే కేరాశింగి పాఠశాలలో గచ్చులు పెచ్చులూడి గుంతలుగా ఏర్పడింది. నేలపైనే విద్యార్థులు కూర్చొని చదువులు సాగిస్తున్నారు.
-మరికొన్ని పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గిరిజన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది. నిధులు మంజూరుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన పాఠశాలలను సైతం తెరిపిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ మేరకు ఐటీడీఏ పరిధిలో ఏడు పాఠశాలలకు పూర్తిగా భవనాలు లేనట్టు గుర్తించామని పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఇటీవల వెల్లడించారు. నిధులు మంజూరైతే త్వరలో వాటి నిర్మాణాలు చేపడతామని తెలిపారు. మూతపడిన మరో 13 పాఠశాలలను వచ్చే ఏడాది నుంచి తెరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఏడేళ్లుగా అర్థంతరంగా వదిలేసిన అడ్డివాడ పాఠశాల భవనం
నివేదిక అందజేస్తాం
మూతపడిన పాఠశాలలు గుర్తించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెరిపించే ఏర్పాట్లు చేస్తాం. మూతపడిన పాఠశాలలతోపాటు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.
- ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి
..................
ఇబ్బందులు పడుతున్నాం
మా గ్రామంలో పాఠశాల మూతపడడంతో గత ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ప్రతిరోజూ కొండలు దిగి.. నాలుగు కిలోమీటర్లు నడిచి పాఠశాలలకు పిల్లలు వెళ్లి వస్తున్నారు.
- సవర గణేష్, అడ్డివాడ