shivaratri: హరహర మహాదేవ
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:27 AM
shivayya temples నాగావళి నది ఒడ్డున ఉన్న ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరిం చారు.

శివరాత్రి వేడుకలకు ముస్తాబైన క్షేత్రాలు
ఉమారుద్ర కోటేశ్వరుడి సన్నిధిలో..
శ్రీకాకుళం కల్చరల్ ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): నాగావళి నది ఒడ్డున ఉన్న ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరిం చారు. శివరాత్రి నాడు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే మహానందీశ్వర వాహనంపై తిరువీధి నిర్వహించడానికి పల్లకిలు సిద్ధం చేశారు. ఇక్కడ 400 ఏళ్ల రావిచెట్టు ఉంది. వినాయకుడి గుడి ఈ చెట్టు వద్దే ప్రతిష్ఠించారు. స్వామి దర్శనానికి ముందు ఈ చెట్టు, వినాయకుడిని భక్తులు దర్శనం చేసుకుంటారు.
శ్రీముఖలింగేశ్వరుడి వేడుకకు వేళాయే
జలుమూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): వంశధార నదీతీరాన వెలిసిన శ్రీముఖలింగం క్షేత్రం శివరాత్రి వేడుకకు సన్నద్ధమైంది. శివుడు ముఖాకృతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న ఏకైక ఆలయం శ్రీముఖలింగమని చెబుతారు. ఇది శ్రీకాకుళానికి 50 కి.మీ దూరంలో జలుమూరు మండలంలో వెలిసింది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ లభించిన శాసనాల ఆధారంగా క్రీ.శ.720 నుంచి 1450 వరకు గంగవంశీకులు ఈ ఆలయం నిర్మాణం ప్రారంభమైంది. క్రీ.శ.14వ శతాబ్దంలో శిథిలమైన ఆలయాన్ని పర్లాకిమిడి ప్రభువు శ్రీవిష్ణువర్దన మధుకర్ల గజపతి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఆలయంపై అద్భుత శిల్పాలు మనకు శ్రీముఖలింగంలో ముక్కోణం ఆకారంలో మూడు ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం మధుకేశ్వరాలయం. దీనికి అభిముఖంగా భీమేశ్వర ఆలయం వున్నది. ఈ రెండింటికి కాస్తదూరంగా ఊరి ప్రారంభంలో సోమేశ్వరాలయం ఉంది.
నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
ఇక్కడ బుధవారం నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి నాడు జాగారం, 27న గురువారం పడియా, 28న శుక్రవారం వంశధార నదిలో స్వామివారి చక్రతీర్థస్నానాలు జరగనున్నాయి. చక్రతీర్థ స్నానాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు.
ఎండల మల్లికార్జునుడి సన్నిధిలో..
టెక్కలి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రికి ముస్తాబయింది. ఈవో జి.గురునాథరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు మూడురోజుల పాటు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 26న మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 9గంటల నుంచి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం, 27న విభూదితో భష్మాలంకరణ, 28న స్వామివారి తిరువీధి, సీతకోనేరులో చక్రతీర్థ స్నానం ఉంటాయి. 26న సత్యహరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శనలు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలంటే..
టెక్కలికి 5 కిలోమీటర్లు దూరంలోని రావివలస చేరుకునేందుకు బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. నౌపడా రైల్వేస్టేషన్ నుంచి, టెక్కలి రైల్వేస్టేషన్ నుంచి కూడా రావివలసకు చేరుకోవచ్చు. జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో రావివలస ఉంది.
మహేంద్రగిరికి యాత్ర
హరిపురం, ఫిబ్రవరి25 (ఆంధ్రజ్యోతి): శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం వేకువజాము నుంచే భక్తులు మహేంద్ర గిరులకు కాలినడకన యాత్ర ప్రారంభించారు. బుధవారం వేకువ జామున అక్కడికి చేరుకుని సూర్యోధయాన్ని వీక్షిస్తారు. వేలాది మంది ఇప్పటికే పంచాక్షరికి చేరుకుని ఆలయాలను సందర్శిస్తున్నారు. బీముని ఆలయం, కుంతీకోవెల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు పలాస నుంచి మందస మండలం సాభకోట వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కాలినడక దారిలో సింగుపురం వద్ద వైద్యాధికారులు శిబిరాన్ని ఏర్పాటు చేశారు.