Gravel: ఇక్కడ ఓ కొండ ఉండేది!
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:06 AM
Mukthimpuram Hill ఒకప్పుడు పచ్చనిచెట్లు, ఎర్రని మట్టి దిబ్బలతో ఆహ్లాదంగా ఉండే ఆ కొండ కనుమరుగై పోతోంది. కొంతమంది వ్యక్తుల ధనదాహం కారణంగా దాని స్వరూపమే కోల్పోయింది. అనుమతుల్లేకుండా లేకుండా కంకర కోసం తవ్వకాలు చేపట్టి.. ఏకంగా దాన్ని గుల్ల చేసేశారు.

కంకర అక్రమంగా తవ్వుకుని.. అమ్మేసుకుని..
లారీలు, ట్రాక్టర్లలో వందలాది లోడ్లు రవాణా
స్వరూపమే కోల్పోయిన ముక్తింపురం కొండ
కొందరు వైసీపీ స్థానిక నేతల ధనదాహమిది
అయినా పట్టించుకోని స్థానిక అధికారులు
ఒకప్పుడు పచ్చనిచెట్లు, ఎర్రని మట్టి దిబ్బలతో ఆహ్లాదంగా ఉండే ఆ కొండ కనుమరుగై పోతోంది. కొంతమంది వ్యక్తుల ధనదాహం కారణంగా దాని స్వరూపమే కోల్పోయింది. అనుమతుల్లేకుండా లేకుండా కంకర కోసం తవ్వకాలు చేపట్టి.. ఏకంగా దాన్ని గుల్ల చేసేశారు. రెండు నెలలుగా వందలాది లారీలు, ట్రాక్టర్లలో కంకరను తరలిస్తున్నారు. కొందరు వైసీపీ స్థానిక నాయకులంతా ఏకమై లక్షలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రణస్థలం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం ముక్తింపురం కొండపై కంకర(గ్రావెల్) తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ముక్తింపురంలో 58 సర్వే నంబర్‌లో 76 ఎకరాల్లో కొండ పోరంబోకు భూమి ఉంది. వన నర్సరీలో భాగంగా అప్పటికే ఆ భూమిలో అటవీశాఖ నీలగిరి, ఆకేసు చెట్లు పెంచుతోంది. గనుల శాఖ, పంచాయతీ అనుమతులు సైతం తీసుకోవాలి. కానీ కనీస అనుమతులు లేకుండా వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఈ కొండపై కంకరను తరలించుకుపోయారు. వేలాది క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు చేసినట్టు అక్కడి ఆనవాళ్లు తెలియజేస్తున్నాయి. రాత్రిపూట భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడం.. లారీలు, ట్రాక్టర్లలో తరలించడం విశేషం. ఇంత జరుగుతున్నా సచివాలయ సిబ్బంది కానీ.. రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అప్పట్లో భారీ ఆక్రమణ..
గతంలో ఈ కొండను అప్పటి వైసీపీ నేతలు ఆక్రమించేందుకు పన్నిన పన్నాగం వివాదంగా మారింది. ఇక్కడ ఎకరా రూ.3కోట్లపైగా పలుకుతోంది. ఈ భూమి పక్కనే ప్రైవేట్ లేఅవుట్‌లు వెలిశాయి. ఇక్కడ సెంటు భూమి ధర రూ.5లక్షలు. మూడున్నర సెంట్ల ఇంటి ప్లాట్ రూ.15లక్షలకు విక్రయిస్తున్నారు. దీంతో కొండ పోరంబోకు భూమిపై కొంతమంది వ్యక్తుల కన్నుపడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండ దిగువ ప్రాంతంలో 15 ఎకరాలు చదును చేసి ప్లాట్లుగా విభజించారు. గ్రామంలో నిరుపేదల పేరిట ప్లాట్లను విభజించారు. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. మొత్తం 200 మందికిపైగా ప్లాట్లు కట్టెబెట్టారు. అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ తెర వెనుక మొత్తం భూమిని ఆక్రమించుకోవాలని అప్పటి చోటా నేతలు ఆలోచన చేశారు. దీంతో అది రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిపోయింది. గతేడాది ఫిబ్రవరి 4న ఘర్షణకు దారి తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు వచ్చి హెచ్చరిక బోర్డులు పాతడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పుడు తాజాగా అదే కొండను గుల్ల చేసి వందలాది లోడ్ల కంకర తవ్వకాలు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
ఈ ప్రాంతంలో కంకరకు విపరీతమైన డిమాండ్ ఉంది. పరిశ్రమలు, గృహ నిర్మాణాలకుగాను భారీగా గిరాకీ ఉంది. దీంతో అక్రమార్కులు అనుమతులు ఉన్నాయని చెబుతూ ఈ కొండపై వేల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు చేసి కంకరను తరలిస్తున్నారు. ఇప్పటికే కొండ చుట్టుపక్కల గుల్ల చేశారు. ఒక్కో లారీ లోడు(ఆరు యూనిట్లు) రూ.7,200కు విక్రయిస్తున్నారు. అలాగే ట్రాక్టర్ లోడు రవాణా దూరం బట్టి రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ వసూలు చేస్తున్నారు. కంకర అక్రమ తవ్వకాల విషయాన్ని సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించకపోతే కొండ కనుమరుగు కావడం ఖాయమని పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి కంకర అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ముక్తింపురం కొండపై కంకర తవ్వకాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సిబ్బందిని అప్రమత్తం చేశాం. పూర్తిస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
- ఎన్.ప్రసాద్, తహసీల్దారు, రణస్థలం