Share News

గ్రావెల్‌ మాఫియా!

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:40 PM

మందస మండలంలో గ్రావెల్‌ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. వారి దెబ్బకు కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి.

   గ్రావెల్‌ మాఫియా!
గండ్రుగాం వద్ద కొండలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న దృశ్యం

- కొండలు, గుట్టలు మాయం

- డీపట్టా భూములు కూడా వదలట్లే

- యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు

- చూద్యం చూస్తున్న అధికారులు

04-hpm02.gif

మందస మండలం గుడ్డిపద్ర వద్ద ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన డీపట్టా భూములు ఇవి. పంటలను సాగు చేయాల్సిన ఈ భూముల్లో అక్రమార్కులు యంత్రాలతో గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతూ జేబులు నింపుకొంటున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో ఆ భూములు చెరువుల్లా మారుతున్నాయి.

04-hpm03.gif

ఇది మందస మండలం కుంటికోట సమీపంలోని కొండ దుస్థితి. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ కొండపై యంత్రాలతో నిత్యం గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక నేత సహకారంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఒక్కో వాహనానికి ఒక ధరను నిర్ణయించి అక్రమంగా గ్రావెల్‌ రవాణా చేస్తున్నారు. ఈ కొండపై రైల్వేకు చెందిన భారీ విద్యుత్తు లైన్ల స్తంభాలు ఉన్నా పట్టించుకోవడం లేదు.


హరిపురం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలో గ్రావెల్‌ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. వారి దెబ్బకు కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి. డీపట్టా భూములను కూడా వదలడం లేదు. ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి తరలించుకుతున్నారు. తమ కళ్లముందే, అనుమతులు లేకుండా గ్రావెల్‌ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు అధికారులకు నెలవారీ డబ్బులు అందుతున్నట్లు తెలుస్తోంది. మాఫియాకు కొందరు స్థానిక నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎక్కడెక్కడంటే..

మండలంలోని లోహరిబంద పంచాయతీ యశోదనగర్‌, పిడిమందసలోని బలోక గిరి, బహాడపల్లి, రాయికోల వద్ద కొండలను యంత్రాలతో తవ్వి గ్రావెల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. బీఎస్‌పురం, టంగరపుట్టి, కొండలోగాం, గండ్రుగాం, ఉమాగిరి, గుడ్డిపద్ర, కుంటికోట, అల్లిమెరక వద్ద ఉన్న ప్రభుత్వ భూములతో పాటు డీపట్టా భూముల్లో కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం రాకతో గ్రామాల్లో సిమెంటు, బీటీ రోడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే, స్థిరాస్థి వ్యాపారాలు ఊపందుకున్నాయి. దీంతో గ్రావెల్‌ వినియోగం పెరగడంతో అక్రమార్కుల కన్ను కొండలు, గుట్టలపై పడింది. గుడిపద్ర, బహాడపల్లి గండ్రుగాం సమీపంలోని కొండల నుంచి వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో కంకర రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పలాస, సోంపేట వంటి పట్టణాలతో తీర ప్రాంతాలకు నిత్యం గ్రావెల్‌ తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పరిశీలించి చర్యలు..

గ్రావెల్‌ను అక్రమంగా తవ్వినా, తరలించినా నేరమే. రవాణా చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకుంటాం. అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. కేసులు నమోదు చేసి పోలీసులకు అప్పగిస్తాం. బహాడపల్లి కొండ అక్రమాలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం.

-విజయలక్ష్మి, ఏడీ, గనుల శాఖ, టెక్కలి.

Updated Date - Mar 05 , 2025 | 11:40 PM