Rathasapthami : వైభవంగా.. రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:48 AM
Festival ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు.. ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగా ప్రకటించడంతో.. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సంబరాలు అంబరాన్ని తాకాయి. వేడుకల వేళ.. సిక్కోలు సుందరంగా ముస్తాబైంది.

5వేల మంది సూర్యనమస్కారాలు
సుందరంగా ముస్తాబైన సిక్కోలు
సందడిగా గ్రామీణ క్రీడల పోటీలు
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శోభాయాత్ర
అరసవల్లి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి):
శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో సుమారు 5వేల మందితో సామూహిక సూర్యనమస్కారాలు.. ధ్యానం.. యోగాసనాలు..
ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్ మైదానంలో వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, కర్రసాము, సంగిడీలు, ఉలవల బస్తా లిఫ్టింగ్, పిల్లి మొగ్గలు వంటి గ్రామీణ క్రీడా పోటీలు..
డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి నమూనా రథాలతో అరసవల్లిలోని ఆదిత్యుడి ఆలయం వరకూ శోభాయాత్ర..
ఆకట్టుకున్న జానపద కళారూపాలు, కోలాటం, తప్పెటగుళ్లు, థింసా నృత్య ప్రదర్శనలు..
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ(ఆర్ట్స్) కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు.. పౌరాణిక నాటక ప్రదర్శనలు..
కలెక్టరేట్ సమీపాన డబ్ బిల్డింగ్ వద్ద హెలికాప్టర్ టూరిజం.. ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌షో..
- ఇవీ అరసవల్లిలో రథసప్తమి వేళ.. ఆదివారం ఉదయం నుంచీ రాత్రివరకూ ఉత్సాహంగా సాగిన వేడుకలు. ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించగా.. ఈ వేడుకలు నిజంగానే పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఎక్కడ చూసినా సందడే సందడి కనిపించింది.
..............
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు.. ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగా ప్రకటించడంతో.. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సంబరాలు అంబరాన్ని తాకాయి. వేడుకల వేళ.. సిక్కోలు సుందరంగా ముస్తాబైంది. శ్రీకాకుళం నగరం నుంచి అరసవల్లి వరకూ ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా సిక్కోలు శోభ కనిపించింది. డేఅండ్ నైట్ జంక్షన్ నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకు, అలాగే పొట్టి శ్రీరాముల జంక్షన్ నుంచి అరసవల్లి మిల్లు జంక్షన్ మీదుగా ఆదిత్యాలయం ఆర్చ్ వరకు విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేకంగా మిల్లు జంక్షన్ వద్ద రోడ్డుకు ఇరువైపులా పూలకుండీలతో అలంకరణ, కోణార్క్ చక్రం ఏర్పాటు, జంక్షన్ మధ్యలో సప్తాశ్వరథధారుడైన ఆదిత్యుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే జంక్షన్ మొదట్లో రోడ్డుమధ్యలో డివైడర్‌పై 12 భంగిమలతో కూడిన సూర్యనమస్కారాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ విగ్రహాలను చూసి, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అలాగే కలెక్టరేట్ సమీపాన డచ్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన హె లికాప్టర్ టూరిజం కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.
తొలిరోజు సందడి ఇలా..
శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో 5వేల మందితో సూర్యనమస్కారాలు, ధ్యానం నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తోపాటు అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, యోగాసాధన, స్వచ్ఛంద, థార్మిక సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా గురువు రామారావు ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు చేసి.. ఆసనాలు వేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. మానవుని శారీరక, మానసిక ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అందరూ ప్రతీరోజు సూర్యనమస్కారాలను సాధన చేసి సుఖ, సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలు జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమం అద్భుతం.. అపురూపమని కొనియాడారు. రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాని కోరారు.
శ్రీకాకుళం ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం ఉదయం గ్రామీణ క్రీడల పోటీలను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు, ఎత్తుడు రాయి, సంగిడీలు, వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము వంటి పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ క్రీడలను తిలకించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
వైభవోపేతంగా శోభాయాత్ర
రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆదిత్యుని శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్ట్స్ కాలేజీ రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో సుమారు 20వేలమంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. తొలుత సూర్యదేవుని సుందరంగా అలంకరించిన సప్తాశ్వరథంపై ఆశీనులను చేసి.. యాత్ర చేపట్టారు. దానివెనుక అన్నవరం సత్యదేవుని రథం, విజయవాడ దుర్గామల్లేశ్వర అమ్మవారి రథంతోపాటు టూరిజం, ఐటీడీఏ, మత్స్యశాఖ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఎయిర్‌పోర్టు, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శకటాలతో యాత్ర నిర్వహించారు. కోలాట ప్రదర్శన, థింసా నృత్యం, సాంప్రదాయ కళావేదిక విద్యార్థుల ప్రదర్శన, పులి వేషాలు, కర్రసాము గారడీలు, గిరిజనుల డప్పుల నాట్యం, వివిధ కళారూపాలతో అత్యంత వైభవంగా శోభాయాత్ర సాగింది. ఉత్సవాల్లో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తదితర ప్రముఖులు పాల్గొని తిలకించారు.