ICDS: ఎలుకల బోన్లనూ వదల్లే!
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:19 AM
ICDS funding by the wayside స్త్రీ శిశు సంక్షేమశాఖలో ఓ అధికారిణి అవినీతి కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు విడుదలయ్యే నిధులను సొంతానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పౌష్టికాహారం రక్షణ కోసం ఎలుకల బోన్లకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు సైతం పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించిన వైనం
ఐసీడీఎస్‌లో ఓ అధికారిణి అవినీతి కలకలం
అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు
అక్రమాలపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదు
గత నెల 31న గోప్యంగా ఆర్జేడీ విచారణ
స్త్రీ శిశు సంక్షేమశాఖలో ఓ అధికారిణి అవినీతి కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు విడుదలయ్యే నిధులను సొంతానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పౌష్టికాహారం రక్షణ కోసం ఎలుకల బోన్లకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు సైతం పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఉద్యోగులు ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్జేడీ స్థాయి అధికారి విచారణ చేపట్టారు.
రణస్థలం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లా ఐసీడీఎస్ పరిధిలో 16 ప్రాజెక్టులు ఉన్నాయి. 16మంది సీడీపీవోలతో పాటు మండలానికి ఒకరు చొప్పున సూపర్‌వైజర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర శాఖలో పనిచేసే ఓ అధికారిణిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐసీడీఎస్‌లో నియమించారు. అప్పటి నుంచి ఆమె పండుగల సమయంలో బహమతులు, నచ్చిన వస్తువులు ఇవ్వని వారిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబరు 13 నుంచి కిశోర వికాసం పథకాన్ని నిర్వహిస్తోంది. చదువుకు దూరంగా ఉండే 10 నుంచి 18 ఏళ్లలోపు 80 వేల మంది బాలికలకు శిక్షణనివ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనికిగాను 16 ఐసీడీఎస్‌ల పరిధిలో సీడీపీవోలు, అసిస్టెంట్ సీడీపీవోలకు శిక్షణ ఇచ్చారు. ఎంపిక చేసిన బాలికలకు జూనియర్ కాలేజీల స్థాయిలో పీటీజీలు శిక్షణ ఇస్తారు. పర్యవేక్షణ బాధ్యత సీడీపీవోలే చూస్తారు. ప్రభుత్వం ఒక్కో ప్రాజెక్టుకు రూ.50 వేల వరకు కేటాయించింది. జిల్లాలో మాత్రం ఓ అధికారిణి రూ.10 వేలు మాత్రమే అందించినట్లు సమాచారం. మిగతాది కిందిస్థాయి ఉద్యోగులు సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
గతంలో కూడా తల్లిపాల వారోత్సవాలు, పోషణ పక్వాడా, జగనన్న సురక్ష వంటి వాటికి ప్రభుత్వమే నిర్వహణ నిధులు విడుదల చేసేది. ఈ నిధుల్లో కూడా ఆమె చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో సొంత భవనాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు 2023లో నిర్వహణ నిమిత్తం రూ.3000 చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులు సైతం ఆ అధికారిణి పక్కదారి పట్టించారన్న అభియోగాలు ఉన్నాయి. కేంద్రాల్లో పౌష్టికాహారం రక్షణ కోసం ప్రభుత్వం ఎలుకల బోన్లు అందించించిది. దీనికి సంబంధించి విడుదలైన నిధులు కేంద్రాలకు ఇవ్వాలి. కానీ ఆ అధికారిణి వాటిని సైతం పక్కదారి పట్టినట్టు ఆరోపణలున్నాయి.
జిల్లాలో 16 ఐసీడీఎస్‌ల ప్రాజెక్టుల పరిధిలో 3,358 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇటీవల కిశోర వికాసం పథకానికి సంబంధించి ఒక్కో ఐసీడీఎస్ ప్రాజెక్టుకు రూ.50వేలు చొప్పున కేటాయించింది. కాగా.. అధికారిణి ఇందులో రూ.10వేలు చొప్పున 1,60,000 మాత్రమే సీడీపీవోలకు అందజేశారు. ఈ నిధులతోనే కార్యక్రమం నిర్వహణ ఖర్చులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎలుకల బోన్లు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే ఒక్కో ఎలుక బోను సుమారు రూ.500 ఉంటుందని, జిల్లాలోని 3,358 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక్కోటి ఏర్పాటు చేసినా.. రూ.16,79,000 ఖర్చవుతోందని కొంతమంది ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతుండడంతో సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేసినట్లు విమర్శలు ఉన్నాయి.
ఆ అధికారిణి తీరుతో విసిగిపోయిన కొందరు ఉద్యోగులు సీఎం కార్యాలయానికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర రీజియన్ డైరెక్టర్ చిన్మయిదేవి డిసెంబరు 31న విచారణ చేపట్టారు.
ఈ విషయమై ఆర్జేడీ చిన్మయదేవి వద్ద ప్రస్తావించగా.. ఐసీడీఎస్‌లో ఓ అధికారిణిపై ఫిర్యాదులు రావడం వాస్తవమేనన్నారు. ఇటీవల విచారణ చేపట్టామని, ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిణి వద్ద అక్రమాల విషయమై ప్రస్తావించగా.. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. సక్రమంగా పనిచేయాలని చెబితే.. కొంతమంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తానెప్పుడూ నిబంధనలు అతిక్రమించలేదని తెలిపారు.