Lands Encroached : నమ్మించారు.. అమ్మేశారు
ABN , Publish Date - Feb 25 , 2025 | 12:08 AM
Land dispute ‘అదిగదిగో ఆ చార్మినార్ చూశావా.. అది నాదే. కొంచెం డబ్బులు అవసరమని.. దాన్ని తక్కువ ధరకే అమ్మేస్తున్నా. నువ్వు కొనగలవా?. నీకు వద్దంటే చెప్పు మరొకరు రెడీ ఉన్నారు. ఆ ఆఫర్ అతడికి ఇచ్చేస్తా’ అంటూ ఓ సినిమాలో ఒక నటుడు.. మరొకరిని బురిడీ కొట్టించి డబ్బులు లాగేసుకుంటాడు.
పలాస-కాశీబుగ్గలో ప్రభుత్వ స్థలాలు కబ్జా
రియల్ ఎస్టేట్ పేరిట తక్కువకు విక్రయాలు
ఆశపడి.. కొనుగోలు చేసిన వినియోగదారులు
అవన్నీ ప్రభుత్వ స్థలాలని బయటపడిన వైనం
ఆక్రమణల తొలగింపునకు అధికారుల చర్యలు
పలాస, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘అదిగదిగో ఆ చార్మినార్ చూశావా.. అది నాదే. కొంచెం డబ్బులు అవసరమని.. దాన్ని తక్కువ ధరకే అమ్మేస్తున్నా. నువ్వు కొనగలవా?. నీకు వద్దంటే చెప్పు మరొకరు రెడీ ఉన్నారు. ఆ ఆఫర్ అతడికి ఇచ్చేస్తా’ అంటూ ఓ సినిమాలో ఒక నటుడు.. మరొకరిని బురిడీ కొట్టించి డబ్బులు లాగేసుకుంటాడు. ఇదే మాదిరి.. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కొంతమంది ప్రబుద్ధులు.. రూ.కోట్లు ధర పలికే ప్రభుత్వ స్థలాలు తమ తాతల నుంచి వారత్వంగా వచ్చిందని నమ్మిస్తూ గత నాలుగేళ్ల నుంచి విక్రయిస్తున్నారు. సెంటు రూ.2లక్షల చొప్పున ఇస్తామని, లేటు చేస్తే భూముల ధర మరింత పెరిగిపోతాయని హడావుడి చేశారు. అది నిజమా.. కాదా.. అన్నది పరిశీలించకుండానే చౌకగా రావడంతో కొంతమంది రూ.లక్షలు పెట్టి ఆ స్థలాలు కొనుగోలు చేశారు. నిర్మాణాలు చేపడుతున్నారు. తీరా ప్రస్తుతం అధికారులు పరిశీలించి.. ఇవి ప్రభుత్వ స్థలాలే అంటూ.. నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచీ సర్వేనెంబరు 51లో ఉన్న సూదికొండ ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీంతో రూ.లక్షలు పెట్టి స్థలాలు కొనుగోలుచేసిన వారంతా లబోదిబోమంటున్నారు. విక్రయదారులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టు తప్పుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం పలాసలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయగా.. దానికి అవసరమైన స్థలం కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరింది. దీంతో సూదికొండ వద్ద ఉన్న 9.10 ఎకరాల భూమి ఇచ్చేందుకు రెవెన్యూశాఖ ఆమోదం తెలిపింది. అప్పటికే ఆ భూములను కొంతమంది కబ్జా చేసి విక్రయించగా.. 47మంది వరకూ ఇళ్లు నిర్మించుకున్నారు. మరికొంతమంది పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు ఆ ప్రాంతంలో సర్వే చేసి కబ్జాదారులను గుర్తించి వారికి ముందస్తు నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నోటీసులను పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల మాటలపై విశ్వాసం ఉంచి వాటిని తొలగించలేదు. ఆదివారం ఉదయం నుంచి రెవెన్యూ అధికారులు ఎక్స్‌కవేటర్లు, సిబ్బంది సహాయంతో ఆక్రమణల స్థలాలకు వెళ్లడంతో అప్పుడు వారికి తెలిసొచ్చింది. తాము కొనుగోలు చేసింది ప్రభుత్వ భూములేనని. దీంతో కాళ్లబేరానికి వచ్చారు. అందులో 22 మంది వరకూ పేదలు ఉండడంతో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి స్థలాలు ఇస్తామని అధికారులు భరోసా కల్పించారు. మిగిలిన వారి స్థలాలు యథాతథంగా కూల్చివేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకూ ఈ కూల్చివేతలు జరిగాయి. మొత్తం 9.10 ఎకరాల స్థలాన్ని చదును చేసి అందులో ఉన్న రాళ్లు, గుట్టలు తొలగించారు. తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి ఆధ్వర్యంలో కాశీబుగ్గ సీఐ బి.సూర్యనారాయణ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటుతో ఆక్రమణలన్నీ నేలమట్టం చేశారు.
రూ.కోట్ల వ్యాపార లావాదేవీలు
బంగారు బాతుగుడ్డుగా పేరుగాంచిన సూదికొండ భూములను ఆ ప్రాంత నేతలు ఆక్రమించి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేశారు. గత ఐదేళ్లూ రూ.10కోట్లకుపైగా వ్యాపారలావాదేవీలు జరిగినట్లు బాధితులే స్వయంగా చెబుతుండడం అధికారులకు విస్మయం కలిగిస్తోంది. రెండు సెంట్లు స్థలం రూ.7లక్షల వరకూ విక్రయించారు. అధికారులు ఆక్రమణలు తొలగిస్తారని తెలిసి కూడా కొంతమంది రూ.10లక్షలు, రూ.20లక్షలు చొప్పున బ్రోకర్లకు చెల్లించి స్థలాలు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారు. సూదికొండ ఆక్ర మణపై 2021 సంవత్సరం నుంచీ ‘ఆంధ్రజ్యోతి’ లో తరచూ కథనాలు ప్రచురించినా కొనుగోలుదారులు మేల్కోలేదు. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం మంజూరైన నేపఽథ్యంలో ఆక్రమణలన్నీ తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుల కోసం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానుండడం శుభసూచికమని, అధికారుల ఆదేశాల మేరకు వారికి సంబంధిత స్థలాలు అప్పగించనున్నామన్నారు. నిర్వాసితులను గుర్తించామని, వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు.