Share News

జీబీఎస్‌ కలకలం

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:24 AM

గిల్లన్‌ బ్యార్రే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) అరుదైన వ్యాధి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల పరిధిలో పదేళ్ల బాలుడు ఈ వ్యాఽధి లక్షణాలతో ఇటీవల మరణిం చాడనే ప్రచారంతో... కలకలరం రేగుతోంది.

జీబీఎస్‌ కలకలం
గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్న వైద్యాధికారులు

సంతబొమ్మాళి మండలంలో అనుమానిత కేసు

జిల్లా వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తం

గ్రామంలో పర్యటించిన డీఎంహెచ్‌వో

ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు

సంతబొమ్మాళి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గిల్లన్‌ బ్యార్రే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) అరుదైన వ్యాధి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల పరిధిలో పదేళ్ల బాలుడు ఈ వ్యాఽధి లక్షణాలతో ఇటీవల మరణిం చాడనే ప్రచారంతో... కలకలరం రేగుతోంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమై బుధవారం ఆ గ్రామంలో పర్యటించింది. బాలుడి తల్లిదండ్రులను ఆరా తీసింది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేశారు. అయితే ఇది అంటు వ్యాధి కాదని, భయపడాల్సిన అవసరం లేదని దండుగోపాలపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డా.బి.సుధీర్‌ చెబుతున్నారు. కాపుగోదాయవలసలో వాతాడ యువంత్‌ (10) అనే బాలుడు ఈ వ్యాధితో మృతి చెందాడనే అనుమానంతో గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఇటువంటి వ్యాధి ఐదు లక్షల మందిలో ఒకరికి వస్తుందని తెలిపారు. శరీరంలో సోకిన ఇన్‌ఫెక్షన్‌ రోగిని కృంగదీస్తుందన్నారు. ముందుగా గొంతు నొప్పి, దగ్గు, డయేరియా, జ్వరంతో ప్రారంభమవుతుందని తెలిపారు. శరీర కణజాలాలను నిర్వీర్యం చేసి ఊపిరి ఆడకుండా చేస్తుందని తెలిపారు. దీనిపై గ్రామంలో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇంకా ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నాయేమోననే విషయమై గ్రామంలో వైద్య సిబ్బందితో సర్వే చేశామని వివరించారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఇద్దరు చిన్నపిల్లల వైద్య నిపుణులు ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారని ఆయన తెలిపారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని సూచించామన్నారు. ఈ వ్యాధి సోకిందని గుర్తించడానికి మూడు రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వివరించారు. ఒక్క రకం వైద్య పరీక్ష మాత్రమే చేసినందున యువంత్‌ ఈ వ్యాధితో మృతి చెందాడని నిర్ధారణకు రాలేకపోతున్నామని వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో వైద్య పరీక్షలు చేశామని వైద్యాధికారి సుధీర్‌ తెలిపారు.

నరాల పనితీరుపై ప్రభావం

ఈ వ్యాధి వస్తే నరాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. నరాల బలహీనత, తిమ్మిర్లు, కొన్నిసార్లు పక్షవాతానికి కారణమవుతుంది. చేతులు, కాళ్లు బలహీనమవుతాయి. ఈ వ్యాధి సోకడానికి గల కచ్చితమైన కారణాలను వైద్యులు గుర్తించలేకపోతున్నారు. మూడింట రెండొంతుల మందికి సంక్రమణ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్‌, కొవిడ్‌-19 లక్షణాలైన గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో పాటు ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపుతుంది. జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి. తరచుగా కాళ్లు, పాదాల్లో జలదరింపు ఉంటుంది. శరీరం, చేతులకు వ్యాపిస్తుంది. నడవడం, బరువులు ఎత్తడం కష్టమవుతుంది. కొంతమందికి చేతులు, ముఖంలో ముందుగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. చేతి వేళ్లు, కాలి వేళ్లు, చీలమండలు (మణికట్టు)లో సూదులతో గుచ్చినట్లు ఉంటుంది. శరీరమంతా బలహీనపడుతుంది. సరిగా నడవలేకపోవడంతో పాటు మెట్లు ఎక్కేందుకు ఇబ్బందులు పడతారు. మాట్లాడడం, నమలడం (మింగడం) వంటి పనులు చేయలేకపోవడం, ప్రేవుల పనితీరులో సమస్యలు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, రక్తపోటులో తేడా (ఎక్కువ, తక్కువ) ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సాధారణంగా లక్షణాలు కనిపించిన రెండు వారాల లోపే నిస్సత్తువ ఆవరిస్తుంది.

ఏం చేయాలంటే...

కాలి వేళ్లలో తెలికపాటి జలదరింపు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. అత్యవసర సహయం తీసుకోవాల్సిందే. ఈ వ్యాధి బారిన పడిన వారికి చికిత్సకు కొంత సమయం పడుతుంది. కోలుకోవడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. కొంతమందికి మూడేళ్లు పట్టవచ్చు. రోగ నిర్ధారణ జరిగిన ఆరు నెలల తరువాత దాదాపు 80శాతం మంది స్వతంత్రంగా నడవగలుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఏడాది తరువాత 60శాతం మంది కోలుకుంటున్నారని చెబుతున్నారు. 5 నుంచి 10శాతం మంది మాత్రమే అలస్యంగా కోలుకుంటున్నారని అంటున్నారు. చిన్నపిల్లలకు ఈ వ్యాఽధి అరుదుగా వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో పెద్దల కంటే పిల్లలు తొందరగానే కోలుకుంటున్నారని వైద్యవర్గాల మాట. ఒత్తిడిని తగ్గించుకోవడం, సంతులిత ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులతో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవడం ద్వారా దీని భారిన పడకుండా ఉండొచ్చు.

వెంటనే వైద్యులకు చూపించాలి

పాదాల నుంచి చేతుల వరకు వణుకు వస్తుంది. నడవలేరు. కూర్చోవడమూ కష్టమవుతుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులకు చూపించాలి. నరాలపైన ప్రభావం చూపే వ్యాధి కావడంతో రోగ నిరోధక శక్తికి సంబందించిన వైద్యం అందిస్తారు. ఈ వ్యాధి కారణంగా ఇన్‌ఫెక్షన్‌కు గురైన అవయవాలకు వైద్యం అందిస్తారు. ఎక్కువగా 20 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు ఈ వ్యాధికి గురవుతున్నారు.

-డాక్టర్‌ ఎస్‌.వి.సత్యశేఖర్‌, జనరల్‌ సర్జన్‌, ఎస్‌.కోట

Updated Date - Feb 13 , 2025 | 12:24 AM