Forest: అటవీ ఉత్పత్తులు.. తగ్గుతున్నాయ్!
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:57 PM
Environmental Impact అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఉత్పత్తులు తగ్గుతున్నాయి. జిల్లాలోని మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి, పాతపట్నం, మందస, కొత్తూరు, హిరమండలం, మండలాల పరిధిలో అధికంగా అటవీ ఉత్పతుల సేకరణ జరిగేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా గిరిజనులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టేవారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు. అయితే అడవుల్లో గతంలో ఉన్న ఔషధ మొక్కలు, చెట్లు ప్రస్తుతం కనిపించటం లేదు.

తితలీ తుఫాన్ సమయంలో నేలకొరిగిన చెట్లు
గత ఐదేళ్లుగా నాటని మొక్కలు
గిరిజనులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు
మెళియాపుట్టి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలంలో ఒకప్పుడు అధికంగా ఉండే నరమామిడి చెట్లు ఇప్పడు కనుమరుగయ్యాయి. పదేళ్ల కిందట అధికంగా కుడ్డబ, దీనబందుపురం, నాయుడుపోలూరు తదితర గ్రామాల సమీపాన కొండల్లో ఏటా 50 క్వింటాళ్ల వరకూ నరమామిడి చెక్కను జీసీసీ సిబ్బంది కొనుగోలు చేసేవారు. 2018లో సంభవించిన తితలీ తుఫాన్ ప్రభావంతో చెట్లన్నీ నెలకొరిగాయి. గత ఐదేళ్లుగా అటవీశాఖ ద్వారా కొండల్లో మొక్కలు నాటడం లేదు. దీంతో నరమామిడి చెట్లు కనుమరుగయ్యాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
................
అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఉత్పత్తులు తగ్గుతున్నాయి. జిల్లాలోని మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి, పాతపట్నం, మందస, కొత్తూరు, హిరమండలం, మండలాల పరిధిలో అధికంగా అటవీ ఉత్పతుల సేకరణ జరిగేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా గిరిజనులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టేవారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు. అయితే అడవుల్లో గతంలో ఉన్న ఔషధ మొక్కలు, చెట్లు ప్రస్తుతం కనిపించటం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో చాలా చెట్లు నేలకొరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అటవీశాఖ అధికారలుఉ కనీస స్థాయిలో మొక్కలు నాటలేదు. మరోవైపు కొంతమంది గిరిజనులు పోడు వ్యవసాయం చేసేందుకు చెట్లను నరికేస్తున్నారు. దీంతో విప్ప, నరమామిడి చెక్క, ఉసిరి, అడ్డాకులు, కొండ తామర జిగురు తదితర చెట్లు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం అధికంగా కుంకుళ్లు, చింతపండు, కొండచీపుర్లు మాత్రమే గిరిజనుల నుంచి జీసీసీ అధికారులు సేకరిస్తున్నారు. విప్ప పంట ద్వారా గిరిజనులకు అధికంగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం విప్ప పంట లేక.. జీసీసీ అధికారులు కొనుగోలు చేయడం లేదు. అలాగే అటవీ ప్రాంతాల్లోని చెట్లకు ఉన్న తేనె పట్టుల నుంచి తేనె సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. తుఫాన్ల కారణంగా చెట్లు నేలకొరగడంతో తేనెతీగల పట్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో తేనె సేకరణ తగ్గింది. అలాగే పదేళ్ల కిందట జిల్లా నుంచి 5వేల క్వింటాళ్ల వరకూ జీసీసీ ద్వారా నరమామిడి చెక్కను గిరిజనులు సేకరించేవారు. ప్రస్తుతం నరమామిడి చెట్లు లేక 50 క్వింటాళ్లు కూడా రావడం లేదని జీసీసీ అధికారులు చెబుతున్నారు. గిరిజనులు సేకరిస్తామన్నా.. చెట్లు లేని పరిస్థితి నెలకొందన్నారు.
అడవుల్లో సహజంగా లభించే ఉసిరికాయల చెట్లు కూడా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు నరికి ఉసిరికాయలు సేకరిస్తున్నారు. దీంతో చెట్లు మళ్లీ చిగురించక.. ఉసిరి పంట కూడా కరువవుతోంది.
గతంలో గిరిజనులు సేకరించే అడ్డాకులకు భలే గిరాకీ ఉండేది. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో అడ్డాకులకు డిమాండ్ తగ్గింది. దీంతో అడ్డాకుల సేకరణపై గిరిజనుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. అలాగే అధికంగా ఔషధాలకు వినియోగించే కొండతామర జిగురు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మందస, మెళియాపుట్టి, నందిగాం తదితర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ఉన్న ఈ చెట్లు.. ప్రస్తుతం కనుమరుగయ్యాయి. చింత, కుంకుడు చెట్లు కూడా ముదిరిపోవడంతో ఉత్పత్తులు తగ్గుతున్నాయి. ఒకప్పుడు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం ఏడాదికి జీసీసీ ద్వారా 500 క్వింటాళ్ల కుంకుడు కాయలు, 2,500 క్వింటాళ్ల చింతపండు మాత్రమే సేకరిస్తున్నారు. కొండచీపుర్లు కూడా ఏడాదికి పదివేల కట్టలు మాత్రమే సేకరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి అటవీశాఖ ద్వారా ఔషధాలకు వినియోగించే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
‘తితలీ’ తర్వాత తగ్గాయి
తితలీ తుఫాన్ సమయంలో చాలా చెట్లు నేలకొరగడంతో అటవీ ఉత్పత్తులు తగ్గాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధర పెంచింది. ఈ నేపథ్యంలో పంటలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. కుంకుళ్లు, చింతపండు, కొండ చీపుర్లు, నరమామిడిచెక్కను పాతపట్నం జీసీసీ నుంచి సేకరిస్తున్నాం.
-జి.నరసింహులు, జీసీసీ మేనేజర్, పాతపట్నం