Foreign cheated: విదేశీ వల.. మోసపోతున్న యువత!
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:32 AM
Youth being cheated! స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహరించకపోవడంతో జిల్లాలోని తీరప్రాంతాల్లో యువత అధికంగా విదేశాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఉద్దానం, తీరప్రాంత మండలాలైన ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన యువత విదేశాలకు ఉపాధి కోసం అధికంగా వెళ్తుంటారు. అలాంటి వారిని విదేశాల్లోని కంపెనీలకు మ్యాన్‌పవర్ సమకూర్చే ఏజెంట్లు, దళారీలు మోసగిస్తున్నారు.

ఏజెన్సీలు, దళారీల మాయమాటలతో ఉచ్చులోకి..
ఉపాధి కోసం వెళ్లి.. విదేశాల్లో చిక్కుకున్న వారెందరో..
తాజాగా ట్రైనింగ్ సెంటర్ల పేరిట నిరుద్యోగులకు వల
కట్టడి చేయలేకపోతున్న యంత్రాంగం
వజ్రపుకొత్తూరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి):
పై చిత్రంలో కనిపిస్తున్న వారంతా.. వజ్రపుకొత్తూరు మండలం పెద్దమురహరిపురం, చినమురహరిపురం, రామకృష్ణాపురం, చిన్న పల్లివూరు, అమలపాడు, సంతబొమ్మాళి మండలం భావనపాడు, నందిగాం మండల కేంద్రానికి చెందిన యువకులు. వీరి పేర్లు జీవన్, చింత హేమారావు, రాజాం మహేష్, నందిగాం శ్రీను, గర్తం జోగారావు, గొరకల షణ్ముఖరావు, శంకరావు. పల్లివూరు, భావనపా డుకు చెందిన ఏజెంట్లు.. విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వీరికి ఆశ కల్పించారు. వారి నుంచి డబ్బులు తీసుకుని అక్టోబరులో ఉజ్బెకిస్తాన్ దేశం పంపించారు. అక్కడకు చేరుకున్న తర్వాత లాడ్జీలో ఉంచిన అక్కడ ఏజెంట్లు సరైన తిండి పెట్టలేదు. కంపె నీలో ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో మూడు నెలలుగా తామం తా ఇబ్బందులు పడ్డామని ఈ యువకులు ఆవేదన వ్యక్తం చేశా రు. ‘మాకు విజిట్ వీసా ఇచ్చి ఉజ్బెకిస్తాన్ పంపించారు. ఒక్కొక్క రి నుంచి రూ.1.50లక్షలు చొప్పున ఏజెంట్లు వసూలు చేశారు. కం పెనీలో సరైన ఉద్యోగాలు కల్పించలేదు. జీతాలు ఇవ్వలేదు. దీం తో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. స్వదేశానికి పంపించాలని వేడుకు న్నా.. మమ్మల్ని పట్టించుకోలేద’ని వారు వాపోయారు. ఈ విష యాన్ని ఇటీవల వీడియోకాల్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పి.. ఆవేదన వెల్లగక్కారు. స్థానిక నాయకులు.. కేం ద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇంతలో అక్కడ అధికారులు కూడా స్పందించారు. వారివి విజిట్ వీసాలు కావడంతో స్వదేశానికి పంపించేందుకు అనుమతించారు. ఈ నేపథ్యంలో సొంత ఖర్చులతో శనివారం సాయంత్రం నాటికి వారంతా ఉజ్బెకిస్తాన్ నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
......................
స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహరించకపోవడంతో జిల్లాలోని తీరప్రాంతాల్లో యువత అధికంగా విదేశాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఉద్దానం, తీరప్రాంత మండలాలైన ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన యువత విదేశాలకు ఉపాధి కోసం అధికంగా వెళ్తుంటారు. అలాంటి వారిని విదేశాల్లోని కంపెనీలకు మ్యాన్‌పవర్ సమకూర్చే ఏజెంట్లు, దళారీలు మోసగిస్తున్నారు. యువత బలహీనతను వారు సొమ్ము చేసుకుంటున్నారు. యువత అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి మంచి కంపెనీల్లో ఉద్యోగాలంటూ విదేశాలకు పంపిస్తున్నారు. ఈక్రమంలో వారు కొందరిని విదేశాలకు విజిటింగ్ వీసాలపై పంపించి చేతులు దులుపుకొన్న ఘటనలూ అధికమే. విదేశాల్లోని చిన్న కంపెనీలకు పంపడం వల్ల అక్కడ సరిగ్గా ఆయా యాజమాన్యాలు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితులు సర్వసాధారణంగా మారాయి. చివరకు నెలల తరబడి పనులు చేయించుకుని, వారిని బందీలుగా ఉంచి, భోజనాలు కూడా పెట్టని ఘటనలు అనేకం. విదేశాలకు పంపించే సమయంలో సదరు ఏజెంట్లు, దళారీలు చెప్పిన మాటలకు, అక్కడ జరిగే వ్యవహారాలకు ఎక్కడా పొంతన ఉండదు. అదే విషయంపై సదరు వ్యక్తులను నిలదీస్తే వారు చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. చివరకు విదేశాల్లో చిక్కుకున్న యువత వీడియోల సందేశాలతో ఇబ్బందులు తెలియజేస్తూ ప్రభుత్వ సాయాన్ని కోరడం సర్వసాధారణమైంది.
ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్..
యువతను మోసం చేసి విదేశాలకు పంపిస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకునే నాథులే కరువయ్యారు. ఇటీవల సౌదీ అరేబియాలో జిల్లాకు చెందిన 30 మంది యువకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఉపాధి లేక తాము పడుతున్న దుస్థితిని వివరిస్తూ పంపిన వీడియో సందేశం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి, ఇచ్ఛాపురంలోని ఏజెన్సీలే తమను మోసగించి అక్కడకు పంపించాయని వారు వెల్లడించినప్పటికీ కనీస చర్యలకూ పోలీసులు ఉప్రకమించలేదు. గతంలో పూండి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఆర్మీ, విదేశాల ఉద్యోగాల పేరుతో మోసగించిన నేపథ్యంలో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి గట్టి చర్యలు తీసుకున్నారు. దాంతో సుమారు పదేళ్ల పాటు ఏజెంట్లు కనిపించకుండా పోయారు.
కొత్త తరహాలో మోసం..
ఇటీవల ఏజెంట్లు, దళారీలు కొత్త తరహా మోసానికి తెరతీశారు. ట్రైనింగ్ సెంటర్లు పేరుతో నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. ఇక్కడే శిక్షణ ఇచ్చి విదేశాలకు తామే పంపిస్తామని చెబుతూ రూ.లక్షలు గుంజేస్తున్నారు. వీరి మాటలు నమ్మి ఇప్పటికే విదేశాలకు వెళ్లినవారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలు చెప్పిన జీతాలకు, పంపించిన పనికి సంబంధం లేకపోవడంతో దేశం కాని దేశంలో అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నంలోని ఆటోనగర్ వద్ద ఉన్న విదేశీ ఏజెన్సీలకు పూండి, ఇచ్ఛాపురం కేంద్రాలలో నడుపుతున్న ఏజెన్సీలు ఉప ఏజెన్సీలుగా కొనసాగుతున్నాయి. వారు ఏమి చెబితే వీరూ అదే చెప్పి నిరుద్యోగులకు వల వేస్తున్నారు.
నకిలీ ఏజెన్సీలను నమ్మొద్దు
విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే యువత నకిలీ ఏజెన్సీలతో మోసపోవద్దు. విదేశాల ఉద్యోగాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోండి. నకిలీ ఏజెన్సీలపై ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పూండి ఏజెన్సీ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిచి మాట్లాడాం. వారి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తున్నాం. ఇదే విషయంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం.
- బి.నిహార్, ఎస్‌ఐ, వజ్రపుకొత్తూరు
ఉపాధి అవకాశాలు కల్పించాలి
విదేశీ ఉద్యోగాల మోజులో యువత అధికంగా మోసపోతున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాల లేకపోవడమే ఇందుకు కారణం. ఉపాధి కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. విదేశీ ఉద్యోగాల పేరిట మోసపోతున్న యువత అధికంగా జిల్లావాసులే కావడం బాధాకరం. నకిలీ ఏజెన్సీలను గుర్తించి చర్యలు చేపడితే మేలు.
- జోగి తిరుపతిరావు, జూనియర్ కాలేజీ లెక్చరర్, పలాస