Share News

Flyover: ఫ్లై‘ఓవర్‌’.. కొలత!

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:19 AM

bridge construction రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. తీవ్ర తర్జనభర్జన నడుమ జాతీయ రహదారుల సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరు నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే రోడ్డు మధ్యలో మట్టి పరీక్ష చేపడుతోంది. మరోవైపు రహదారికి ఇరువైపులా కొలతలు తీస్తూ మార్కింగ్‌ వేస్తోంది.

Flyover: ఫ్లై‘ఓవర్‌’.. కొలత!
రణస్థలం వద్ద హైవే

  • ఎట్టకేలకు రణస్థలంలో వంతెన నిర్మాణానికి సన్నాహాలు

  • అస్తవ్యస్తంగా మార్కింగ్‌పై ప్రజల ఆందోళన

  • బైపాస్‌ ఏర్పాటు చేయాలని వ్యాపారుల డిమాండ్‌

  • సమస్యలు నివృత్తి చేయని హైవే అధికారులు

  • రణస్థలం, ఫిబ్రవరి 12(ఆంరఽధజ్యోతి): రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. తీవ్ర తర్జనభర్జన నడుమ జాతీయ రహదారుల సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరు నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే రోడ్డు మధ్యలో మట్టి పరీక్ష చేపడుతోంది. మరోవైపు రహదారికి ఇరువైపులా కొలతలు తీస్తూ మార్కింగ్‌ వేస్తోంది. కాగా.. సిబ్బంది తీస్తున్న రోడ్డు కొలతలు స్థానికుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అస్తవ్యస్తంగా మార్కింగ్‌ వేస్తుండడంతో తాము మరింత నష్టపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రణస్థలంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌ కొనసాగుతుంది. మరో 800 మీటర్ల వరకూ ఓపెన్‌ ఫ్లైఓవర్‌ నిర్మించే అవకాశం ఉంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఆశీలుమెట్ట తరహాలో భారీ స్తంభాలతో వంతెన ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే వంతెన నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ రావివలస సమీపంలో కొన్ని ఎకరాల లేఅవుట్‌ను అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ నిర్మాణ సామగ్రి ఉంచనున్నారు. మరోవైపు విద్యుత్‌ స్తంభాల మార్పు విషయంలో సంబంధిత కంపెనీ ప్రతినిధులు విద్యుత్‌ శాఖ అధికారులతో చర్చించారు. వాస్తవానికి 2016లో జాతీయ రహదారి విస్తరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పట్లో రోడ్డుకిరువైపులా 22.5 మీటర్లు అంటే 75 అడుగుల రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. ఆ మేరకు షాపులు, ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించారు. పరిహారం అందించినా చాలామంది బతుకులు తారుమారయ్యాయి. ఆస్తులు పోయాయి. అయితే ఇప్పుడు ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడతామని చెప్పడంతో గతంలో సేకరించిన భూమిలోనే నిర్మిస్తారని అంతా భావించారు. కానీ 22.5 మీటర్లకు మించి కొలత చేపడుతుండడంతో అందరిలోనూ భయం వెంటాడుతోంది. గతంలోనే విలువైన స్థలాలను కోల్పోయామని.. ఎలాగోలా ఉన్నస్థలాన్ని కాపాడుకొని షాపులు, ఇళ్ల నిర్మాణాలుగా మార్చుకుంటే ఇప్పుడు మళ్లీ కొలుస్తుండడంతో కలత చెందుతున్నారు. ఒక దగ్గర 26, మరో దగ్గర 27, ఇంకోదగ్గర 37 మీటర్లు కొలుస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఫ్లైఓవర్‌ వద్దని, బైపాస్‌ ఏర్పాటు చేయాలని వ్యాపారులు ఆందోళన చేస్తూ.. రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.

  • ఇదీ పరిస్థితి

    విశాఖ నుంచి నరసన్నపేట వరకూ దాదాపు 135 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని ఆరు లేన్లగా విస్తరించారు. కానీ ఒక్క రణస్థలం మండల కేంద్రాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ బైపాస్‌ రోడ్డా?.. లేదా ఫ్లైఓవర్‌ నిర్మించాలా? అనే విషయమై ఏళ్ల తరబడి సందిగ్ధత కొనసాగుతోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రణస్థలం మండల కేంద్రాన్ని తప్పించి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి 2016లో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పటి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు కృషి మేరకు... దన్నానపేట నుంచి లావేరు మండలం రావివలస వరకూ 3.5 కిలోమీటర్ల మేర బైపాస్‌ నిర్మాణానికి నిర్ణయించారు. సుమారు 66 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. భూసేకరణ కూడా చేపట్టారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, ఎచ్చెర్లలో సేకరించిన భూములకు మాదిరిగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. మార్కెట్‌ ధర ప్రకారం సెంటు భూమికి రూ.2 లక్షలకుపైగా చెల్లిస్తామని ప్రకటించారు. కానీ అప్పట్లో విపక్షంగా ఉన్న వైసీపీ నేతలు ఈ పరిహారం చాలదని, పెంచాలని డిమాండ్‌ చేశారు. అయితే మిగతా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై దృష్టిపెట్టిన హైవే అథారిటీ అధికారులు రణస్థలంలో పెండింగ్‌ పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారం విషయంలో మాట మార్చారు. సెంటుకు మొదటి అనుకున్నంత ధర ఇవ్వలేమని 30 శాతం తగ్గించి ఇస్తామని ప్రకటించారు. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. బైపాస్‌ నిర్మించాలంటే దాదాపు ఐదుచోట్ల వంతెనల నిర్మాణం చేపట్టాలి. రైతులకు పరిహారం చెల్లించాలి. ఈ మొత్తం లెక్కలు వేసుకున్న హైవే అథారిటీ అధికారులు మాత్రం మండల కేంద్రంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికే మొగ్గుచూపారు. అప్పటికే రైతుల నుంచి సేకరించిన 66 ఎకరాలను తిరిగి వారికి అప్పగిస్తూ ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఇప్పుడు కొలతల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • చాలా భయం వేస్తోంది

    ఫ్లైఓవర్‌ నిర్మాణానికిగాను వేస్తున్న కొలతలు చూస్తుంటే భయం వేస్తోంది. గతంలోనే రోడ్డు విస్తరణలో విలువైన ఆస్తులను కోల్పోయాం. ప్రభుత్వం పరిహారం ఇచ్చినా అది ఏ మూలకు చాలలేదు. ఇప్పుడిప్పుడే ఎలాగోలా బయటపడ్డామనుకుంటే.. ప్రస్తుతం ఇళ్లు, షాపులను దాటించి కొలతలు వేస్తున్నారు.

    - గాజుల భాస్కరరావు, స్థానికుడు, రణస్థలం

    ..................................

  • అంత వ్యత్యాసమా?

    కొలతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకచోట 26 మీటర్లు వేస్తున్నారు. మరికొన్నిచోట్ల 37 మీటర్లు తీస్తున్నారు. అలా ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. కనీసం అక్కడ ఉండేవారు నోరు మెదపడం లేదు. ఉన్నతాధికారులు చెప్పిన విధంగా తాము చేసుకొని వెళుతున్నామని మాత్రమే చెబుతున్నారు.

    - చుక్క శ్రీను, స్థానికుడు, రణస్థలం

    ..................................

  • హైవే అధికారులు లేరు

    హైవే అధికారులు లేకుండా.. దిగువస్థాయి సిబ్బందితో సర్వే చేయిస్తున్నారు. అటు రెవెన్యూ కీలక అధికారులు సైతం కనిపించడం లేదు. కేవలం సచివాలయ సిబ్బందితో కొలతలు తీయడం ఏమిటి. ఇంతటి భారీ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అధికారులపై ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు పట్టించుకోవాలి.

    - ఇడదాసుల తిరుపతిరాజు, స్థానికుడు, రణస్థలం


ranasthalam Fly over-1.gif

Updated Date - Feb 13 , 2025 | 12:19 AM