Education: సెలవు రోజుల్లోనూ.. మధ్యాహ్న భోజనం
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:58 PM
Holidays in Lunch.. విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో కీలకమైన పదోతరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. పరీక్షల గడువు సమీపిస్తుండడంతో అదనపు తరగతులతోపాటు సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. తాజాగా పదోతరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలుకు శ్రీకారం చుట్టింది.

పదో తరగతి విద్యార్థుల్లో ఆనందం
హిరమండలం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో కీలకమైన పదోతరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. పరీక్షల గడువు సమీపిస్తుండడంతో అదనపు తరగతులతోపాటు సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. తాజాగా పదోతరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 2 నుంచి ఈ విధానం అమలు చేస్తోంది. మార్చి 10 వరకూ దీనిని కొనసాగించనుంది. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 414 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 21,834 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మార్చి 17 నుంచి వార్షిక ప్రణాళికలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను పరీక్షలను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతినెలా రెండో శనివారం, ప్రతీ ఆదివారంతోపాటు ఇతర సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక బోధన కొనసాగిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే కొంతమంది విద్యార్థులు క్యారేజీలు తెచ్చుకోలేకపోవడంతో మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడేవారు. దీంతో కొంతమంది సక్రమంగా ప్రత్యేక తరగతులకు హాజరుకావడం లేదు. కాగా.. కూటమి ప్రభుత్వం తాజాగా సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తుండడంతో తమకు ఆకలి బాధలు తప్పాయని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రణాళిక ప్రకారంగా బోధన చేస్తున్నారు. సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు వల్ల పూర్తి సమయం చదువుకు కేటాయించవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు సాధించాలి.
- ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖ అధికారి