Railway: అంత ఆదాయాన్ని.. వదులుకుంటుందా?
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:22 AM
railway divison పలాస, సోంపేట, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే (భువనేశ్వర్)కు బంగారు బాతుగుడ్లుగా అధికారులు గుర్తిస్తారు. ఎందుకంటే కేవలం ఈ మూడు స్టేషన్లలో ప్రయాణికుల ద్వారా ఏటా ఈకో రైల్వేకు రూ.30కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది.

జోన్ల పరిధిపై స్పష్టత ఇవ్వని ఈకో రైల్వేశాఖ
ఆంధ్రా పరిధిలోని స్టేషన్లలో అయోమయం
మళ్లీ మొదటికే వచ్చిన పలాస డివిజన్ పరిస్థితి
పలాస, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): పలాస, సోంపేట, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే (భువనేశ్వర్)కు బంగారు బాతుగుడ్లుగా అధికారులు గుర్తిస్తారు. ఎందుకంటే కేవలం ఈ మూడు స్టేషన్లలో ప్రయాణికుల ద్వారా ఏటా ఈకో రైల్వేకు రూ.30కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. అందుకే ఆంధ్రా పరిధిలో ఉన్న ఈ స్టేషన్లను ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త రైల్వేజోన్, డివిజన్ కేంద్రంలో పలాస వరకూ విశాఖపట్నంలో కలుపుతున్నట్లు ప్రకటించారు. దీనిపై ఈ ప్రాంతీయులు పెద్దగా ఆశ్చర్యం చెందడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాల్తేర్ డివిజన్ పరిధి పలాస వరకూ ఉంది. పలాసకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపురం రైల్వేగేటు(374) వరకూ నౌపడా ఇంజనీరింగ్ సెక్షన్‌లో పనిచేస్తూ అక్కడ సిబ్బందే విధులు నిర్వహిస్తుంటారు. అక్కడ నుంచి పలాస కేంద్రంగా ఖుర్దా రోడ్ డివిజన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పలాస రైల్వేస్టేషన్.. పది రైల్వేలైన్లతో డివిజన్‌లో అతిపెద్ద స్టేషన్‌గా అభివృద్ధి చెందుతోంది. దీనికితోడు అమృత్‌భారత్ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దడానికి రైల్వేమంత్రిత్వ శాఖ రూ.24.80కోట్లు నిధులు విడుదల చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పలాస వరకూ విశాఖపట్నంలోను, నౌపడ నుంచి పర్లాకిమిడి వరకూ కూడా విశాఖ పరిధిలో ఉంటుందని ప్రకటించారు.
వాస్తవానికి ఇచ్ఛాపురం, సోంపేట, మందసరోడ్, పలాస వరకూ విశాఖ డివిజన్‌లో కలపాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రరైల్వేశాఖ మంత్రికి విన్నవించారు. పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. అయితే రూ.కోట్లలో ఆదాయం తీసుకువస్తున్న పలాస డివిజన్ పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లను ఈస్ట్‌కోస్ట్ రైల్వే విడిచిపెట్టడానికి మొదటి నుంచి ఒప్పుకోవడం లేదు. బెంగాల్-నాగపూర్ (బీఎన్‌ఆర్) రైల్వే, సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో మొదటగా పలాస వరకూ రైల్వేస్టేషన్లు ఉండేవి. కొత్తగా జోన్లు ఆవిర్భవించిన తరువాత ఈస్ట్‌కోస్ట్‌రైల్వేలో కూడా పలాస అంతర్భాగమైంది. దీన్ని విడదీయాలంటే సాంకేతికంగా రైల్వేశాఖ సిద్ధపడాలి. పలాసలో ప్యానెల్‌బోర్డ్‌తో డివిజన్‌కు అనుసంధానమైంది. తక్షణమే దీన్ని మార్పిడి చేయాలంటే రైల్వేశాఖకు తలకుమించిన భారమే. తొలుత బరంపురం(ఒడిశా)లో దీన్ని మార్పిడి చేయడానికి ప్రయత్నించినా, రైల్వేశాఖ ఒత్తిళ్ల కారణంగా మార్చలేకపోయారు. ప్రస్తుతం పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన ్న రైల్వేస్టేషన్ల పరిధిలో మొత్తం 721 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జోన్లు వేరుచేయాలంటే వారికి ముందుగా కోరుకున్న ప్రదేశాలకు బదిలీ చేయాలి. ఎప్పటి నుంచో డివిజన్ కేంద్రాల్లో పనిచేస్తున్న తెలుగు వారందర్ని ఆప్షన్లు కోరి బదిలీ చేయాలి. ముందుగా దీనిపై నిర్ణయం తీసుకొని తరువాత జోన్ల విభజన చేయాల్సి ఉంది.
ప్రస్తుతం రైల్వేశాఖ పలాస వరకూ విశాఖలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారే తప్ప.. స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఇదే నిర్ణయానికి కట్టుబడి జోన్లు విడదీస్తే పలాస డివిజన్ పరిధిలో ఉన్న మందస రోడ్, సోంపేట, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లకు అన్యాయం చేసినట్లే. మళ్లీ పాత విధానం ద్వారే ఒడిశాలో వీటిని ఉంచేందుకు రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లే. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వేస్టేషన్లను మొత్తం విశాఖ డివిజన్‌లో విలీనం చేస్తే తెలుగువారికి న్యాయం చేసినట్లవుతుంది. మొత్తం పాలన అంతా విశాఖపట్నం జోన్ పరిధిలో ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు గట్టిగా పట్టుబట్టి మొత్తం ఇచ్ఛాపురం వరకూ ఉన్న తెలుగు రైల్వేస్టేషన్లన్నీ విశాఖజోన్ పరిధిలోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా రైల్వేజోన్ల ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. పలాస వరకూ విశాఖలో ఉండేలా చర్యలు తీసుకున్నా, మొదటగా పలాస శివారున రాజపురం వరకూ వాల్తేర్ పరిధిలో ఉండేదని, అక్కడ వరకే జోన్ ఉంటుందని అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్నామని రైల్వేకార్మికసంఘ నాయకులు పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి స్పష్టత వచ్చాకే తాము స్పందించగలమని చెబుతున్నారు.
న్యాయం చేయాలి
ఇచ్ఛాపురం, సోంపేట, పలాస వరకూ ఉన ్న మొత్తం రైల్వే స్టేషన్లన్నీ విశాఖ డివిజన్ పరిధిలో చేర్పించాలి. ఎన్నోఏళ్లుగా తెలుగు ప్రజల ఆకాంక్ష ఇది. ఉద్యోగుల బదిలీ నిర్వహించి మొత్తం ప్రక్రియ ఈ బడ్జెట్‌లోనే నిర్వహించాలి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి.
- ఎం.నరేంద్ర(చిన్ని), తెలుగు యువత, కాశీబుగ్గ