fishermen: మత్స్యకారులకు.. రెట్టింపు భరోసా
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:25 AM
Double assurance కూటమి ప్రభుత్వం మత్స్యకారుల వేట నిషేధ భృతిని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని గాలికొదిలేసింది.
వేట నిషేధ భృతి రూ.20వేలకు పెంపు
జిల్లాలో 16వేల మందికి లబ్ధి
సంతబొమ్మాళి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మత్స్యకారుల వేట నిషేధ భృతిని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని గాలికొదిలేసింది. వారికి ఇవ్వాల్సిన రాయితీలను ఎత్తేసింది. దీంతో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి మత్స్యకారులు తమ సమస్యలను తీసుకెళ్లారు. మంత్రి అచ్చెన్న వాటిని సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. దీంతో ఇటీవల అమరావతిలో నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో మత్స్యకారుల వేట నిషేధ భృతిని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలో 16వేల మంది మత్స్యకారులకు లబ్ధి కలుగనుంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 11 మండలాల పరిధిలో 193 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 1,12,500 మంది మత్స్యకార జనాభా ఉన్నారు. వీరిలో 16వేల మంది మత్స్యకారులు మోటరైజ్డ్, సంప్రదాయ పడవల్లో వేట సాగిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వాలు నిషేధిస్తుంటాయి. ఈ 60 రోజులూ చేపలు గుడ్లు పెట్టి సంపదను వృద్ధి చేస్తుంటాయి. వేట నిషేధ కాలానికిగాను మత్స్యకారుల జీవనం కోసం ప్రభుత్వాలు భృతి చెల్లిస్తుంటాయి. అయితే, గత వైసీపీ సర్కారు రూ.10వేలు మాత్రమే చెల్లించేది. ఈ భృతి కుటుంబ పోషణకు చాలక మత్స్యకారులు ఇబ్బందులు పడేవారు. పైగా పింఛన్, రైతుభరోసా పొందిన మత్స్యకారులకు వేట నిషేధ భృతిని నిలిపివేసేవారు. అలాగే అనర్హులకు భృతి అందించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014-19 మధ్య) మత్స్యకారులకు 11 రకాల పథకాలపై రాయితీ ఇచ్చేవారు. హై ఫ్రీక్వెన్సీ సెట్లు, జీపీఎస్, గిల్‌సెట్లు, ఫిష్ పైండర్స్, వలలు, తెప్పలు, ఐస్‌బాక్స్‌లు, ద్విచక్ర వాహనాలు, లగేజీ వాహనాలను 90శాతం రాయితీపై అందించేవారు. ఆ తరువాత అధికారలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాయితీలు తగ్గించడంతో మత్స్యకారులు పెద్దగా ప్రయోజనం పొందలేకపోయారు.
మత్స్యకారులకు ఎంతో మేలు
కూటమి ప్రభుత్వం వేట నిషేధ భృతిని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచడంతో మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. మత్స్యకారులకు ఎప్పుడూ టీడీపీ అండగా ఉంటుంది. గతంలో 90రాయితీపై అందించిన పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తేసి మత్స్యకారులకు అన్యాయం చేసింది.
- సూరాడ ధనరాజు, మత్స్యకార నాయకుడు, సూరాడవానిపేట
వేటకు వెళ్లిన వారికి అందించాలి
వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారుడికీ భృతి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకే వేట నిషేధ భృతి అందింది. భృతిని రెట్టింపు చేసిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు.
- సూరాడ దాసురాజు, టీడీపీ జిల్లా మత్స్యకార నాయకుడు, మరువాడ
ఆదేశాలు రావాల్సి ఉంది
మత్స్యకారుల వేట నిషేధ భృతిని రూ.20వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావలసి ఉంది. జిల్లాలో 16వేల మందికి పైగా మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందనుంది.
- ధర్మరాజు పాత్రో, ఎఫ్‌డీవో, మత్స్యశాఖ టెక్కలి