Migration: సుదూర తీరం.. అయినా వలసలే!
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:40 AM
Economic Migration జిల్లాలో రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ తీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరం వెంబడి వందలాది గ్రామాల్లో లక్షలాది మంది మత్స్యకారులు దశాబ్దాలుగా వేట సాగిస్తున్నా.. స్థానికంగా గిట్టుబాటు కావడం లేదు. జెట్టీలు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్ట్‌స్టోరేజీలు లేక చేపలవేట సక్రమంగా సాగడం లేదు.
రాష్ట్రంలో 978 కిలోమీటర్ల పొడవునా..
మత్స్యకారులకు గిట్టుబాటుకాని వేట
ముందస్తు ఒప్పందంతో గుజరాత్‌కు..
ప్రమాదాలు జరిగితే మృత్యువాతే..
సిక్కోలు.. వలసల జిల్లాగా పేరొందింది. జిల్లాలో సుదూర తీర ప్రాంతం ఉన్నా.. చేపలవేటకు అనుకూల పరిస్థితులు లేక మత్స్యకారులకు ఉపాధి కరువవుతోంది. ఫలితంగా గుజరాత్, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఏడాదిలో సుమారు 9 నెలలుపాటు కుటుంబాలకు దూరంగా.. ఇతర ప్రాంతాల్లోనూ ఉంటూ పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జీవన పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతుండడంతో ఇకనైనా తమ బతుకులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎచ్చెర్ల, జనవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ తీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరం వెంబడి వందలాది గ్రామాల్లో లక్షలాది మంది మత్స్యకారులు దశాబ్దాలుగా వేట సాగిస్తున్నా.. స్థానికంగా గిట్టుబాటు కావడం లేదు. జెట్టీలు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్ట్‌స్టోరేజీలు లేక చేపలవేట సక్రమంగా సాగడం లేదు. దీంతో ఏటా మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్, కాండ్లా, పోరుబందర్‌తో పాటు కర్ణాటకలోని మంగుళూరు తదితర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఏడాదిలో సుమారు 9 నెలలపాటు భార్యాబిడ్డలను ఇక్కడ విచిడి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇతర ప్రాంతాల్లోనే చేపల వేట సాగిస్తున్నారు. ఏటా జూలై, ఆగస్టులో వలస వెళ్లి.. ఏప్రిల్‌లో స్వగ్రామాలకు చేరుకుంటారు. కాగా, జిల్లా మత్స్యకారులు గుజరాత్‌లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. వీరావల్‌లోని అరేబియా సముద్రంలో చేపల వేట సాగిస్తూ.. ఈ ప్రాంత మత్స్యకారులు పొరపాటున బోర్డర్ దాటి పాక్ కోస్ట్‌గార్డులకు చిక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2018 నవంబరులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు పాక్ కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఏడాదిన్నర తర్వాత విడుదలయ్యారు. అంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. దీంతో కొంతమంది మత్స్యకారులు కర్ణాటక రాష్ట్రానికి వలసలు ప్రారంభించారు.
కారణాలెన్నో
మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులే వలసలకు ప్రధాన కారణం. జిల్లాలో మత్స్యకారులు సంప్రదాయ తెప్పలతో, మోటారు బోట్లతో వేట సాగిస్తున్నారు. ఐదారుగురు చేపల వేటకు వెళితే కనీస ఖర్చులు కూడా రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. అలాగే ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. సొంతిల్లు కట్టుకోలేకపోతున్నామని పేర్కొంటున్నారు. స్థానికంగా వేట సాగిస్తే.. ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. దీంతో వలసబాట పడుతున్నామని చెబుతున్నారు.
ముందుస్తు అంగీకారంతోనే..
గుజరాత్‌లోని బోటు యజమానులతో ముందుగా ఒప్పందం కుదుర్చుకొని మత్స్యకారులు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. సీజన్‌కు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ బోటు డ్రైవర్‌తో యాజమానులు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక్కో బోటులో 7 నుంచి 9 మంది వరకు వేటకు వెళ్తుంటారు. ఇందులో డ్రైవర్(గుజరాత్‌లో తండేలు అంటారు), అసిస్టెంట్ డ్రైవర్, కలాసీలు, వంట మనిషి(బండారి) ఉంటారు. సీనియర్ డ్రైవర్‌కు నెలకు రూ.35 వేలు, అసిస్టెంట్ డ్రైవర్‌కు రూ.20 వేల వరకు ఇస్తారు. కళాసీ, వంట మనిషికి రూ.12వేల నుంచి రూ.15వేలు చొప్పున చెల్లిస్తారు. చేపల వేట ఆశించిన స్థాయిలో సాగితేనే ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లిస్తారు.
మూత్ర విసర్జనకూ ఇబ్బందే
గుజరాత్‌లోని అరేబియా సముద్రంలో బోటుపై ఒకసారి బయలుదేరితే 20 నుంచి 25 రోజుల వరకు చేపలవేట సాగిస్తారు. బోటులో ఉన్నన్ని రోజులు స్నానం ఉండదు. దీని వల్ల చర్మవ్యాధులు సంక్రమిస్తాయి. పొరపాటున బోట్లు ఒకదానికొకటి ఢీకొని గాయాలపాలైనా, అనారోగ్యానికి గురైనా సరైన వైద్యం కూడా లభించదు. చేపల వేటలో ఉండగా మూత్ర విసర్జనకు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఒడ్డుకు చేరిన తర్వాత కూడా ఒకటి రెండు రోజులు బోటులోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రత్యేకంగా వీరికి విశ్రాంతి గదులు ఉండవు. సముద్రంలో ఉండగా కొద్ది దూరం మాత్రమే మొబైల్ నెట్ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా వైర్‌లెస్‌పై ఆధారపడాలి.
గుజరాత్‌కే ఎందుకంటే
గుజరాత్‌లో 1,050 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే.. మన రాష్ట్రంలో 978 కిలోమీటర్ల తీరం ఉంది. రెండు రాష్ట్రాల్లోని సముద్ర తీరంలో పెద్దగా తేడా లేకపోయినా.. గుజరాత్‌కు ఈ ప్రాంత మత్స్యకారులు వలసపోవడానికి కారణాలను సంబంధిత అధికారుల బృందం అధ్యయనం చేసింది. గుజరాత్‌లో ప్రతి 20 నుంచి 25 కిలోమీటర్లకు తీరంలో జెట్టీలు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించారు. ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు. కోల్డ్‌స్టోరేజీ, హేచరీస్ తదితర వాటిని అధిక సంఖ్యలో నెలకొల్పారు. అక్కడ మత్స్య సంపద ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. దీంతో మన ప్రాంత మత్స్యకారులు గుజరాత్‌కు వెళ్తున్నారు. గుజరాత్‌లో సుమారు రూ.50 లక్షల విలువైన మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట సాగిస్తున్నారు. మన ప్రాంతంలో సంప్రదాయ తెప్పలు, పైబర్ తెప్పలు, మోటారైజ్డ్ బోట్లతో చేపల వేట చేపడుతున్నారు. దీనివల్ల వేటకు ఎక్కువ దూరం పోయేందుకు వీలుండదు. తెల్లవారుజామున నాలుగైదు గంటల సమయంలో చేపల వేటకు వెళితే మధ్యాహ్నం ఒంటి గంటకు ఒడ్డుకు చేరుతారు. దీంతో పెద్దగా చేపల వేట సాగడంలేదు. మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట లాభసాటిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పడిప్పుడే అభివృద్ధి దిశగా..
మన రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రయోజనాలు కల్పించేలా ఇప్పుడిప్పుడే చర్యలు మొదలయ్యాయి. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వీటి నిర్మాణాలు పూర్తయితే మత్స్యకారులకు స్థానికంగానే ఉపాధి లభించనుంది. కాగా పీఎంఎంఎస్‌వై పథకం కింద రాయితీపై సామగ్రిని అందజేస్తున్నా.. చేపల వేటకు అనుకూల పరిస్థితులు లేక వలసలు తప్పడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
వలస తప్పడంలేదు
పదో తరగతి చదివాను. ఈ ప్రాంతంలో చేపల వేట అనుకూలంగా లేదు. దీంతో సుమారు 18 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్తున్నాను. వీరావల్‌లో అరేబియా సముద్రంలో చేపల వేట సాగించే బోటులో తొలుత కళాసీగా పనిచేశాను. గత 8 ఏళ్ల నుంచీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం స్పందించి వలసల నివారణకు చర్యలు చేపట్టాలి.
- వారది మహందాత, బడివానిపేట
.............
హార్బర్ నిర్మాణమైతేనే..
బుడగట్లపాలెంలో హార్బర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం నుంచి వలసలను పూర్తిస్థాయిలో నివారించవచ్చు. జిల్లాలో సుదూర సముద్ర తీర ప్రాంతం ఉన్నా ఒక్క జెట్టీ కూడా లేదు. గుజరాత్‌లో ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి వంతున జెట్టీని ఏర్పాటు చేయడంతోనే చేపల వేటకు అనుకూలంగా ఉంది. బుడగట్లపాలెంలో హార్బర్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి.
- అల్లుపల్లి రాంబాబు, సర్పంచ్, బుడగట్లపాలెం