Devotees ఎండలోనే భక్తులు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:11 AM
మాఘమాసం, మూడో ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ఆదిత్యుని దర్శనానికి తప్పని ఇబ్బందులు
‘అరసవల్లి’లో అరకొర ఏర్పాట్లు
అరసవల్లి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మాఘమాసం, మూడో ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత, రూ.100 క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పు ద్వారం వరకు భక్తులు క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గంటల కొద్దీ భక్తులు లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి క్యూ లైన్లలో వెళ్లే భక్తులకు ఎండ బాధలు తప్పలేదు. గత వారం భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏర్పాట్లు చేసినా అవి సరిపోకపోవడంతో భక్తులు ఎండలోనే నిల్చోవడం కనిపించింది. రథసప్తమి ఏర్పాట్ల పేరుతో ఆలయం ఎదురుగా ఉన్న భవనాలను తొలగించారు. వాటితో పాటు భక్తులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించే షెడ్లను కూడా తొలగించడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఆలయం ఎదుట గల విశాల ప్రాంగణంలో తాత్కాలికంగా షెడ్లను నిర్మిస్తే ఆలయానికి వచ్చే భక్తులకు కొంత మేర సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే వీఐపీ, వీవీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు వచ్చే భక్తులు ఆలయ ప్రధాన ద్వారం గుండా, ఆలయ అనివెట్టి మండపంలోకి ప్రవేశించి, నేరుగా స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ బయట ఓపెన్‌గా వదిలేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడి, ఆలయ సిబ్బందిపై ప్రత్యేక దర్శనం కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ గతంలో మాదిరిగానే ఇరువైపులా బారికేడ్లను వేస్తే, దర్శనాలు సజావుగా జరుగుతాయని, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.